Home వికారాబాద్ డబుల్ జోరు

డబుల్ జోరు

Fast building construction

వేగవంతంగా ఇండ్ల నిర్మాణం
ఎన్నికల నాటికి మలివిడత మంజూరు

మన తెలంగాణ/వికారాబాద్: ఆరంభంలో నత్తనడకన సాగిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొంతకాలంగా వేగం పుంజుకొంది.  మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ వంటి శాశ్వత పథకాల అమలుపై సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇక పేదల పక్కా ఇండ్లపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ఛాలెంజ్ నెరవేరే దిశగా అడుగులు పడుతుండగా డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుపై దృష్టి పెట్టారు. దాంతో ఇండ్ల నిర్మాణం వేగమంతం చేయాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన పక్కా ఇల్లు పేదలకు సరిపోనందున డబుల్ బెడ్‌రూం కట్టించాలని సంకల్పించారు. అయితే, ఇతర పథకాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చించడంతో ఇండ్ల నిర్మాణానికి కాస్త ఆటంకాలు ఎదురైనాయి. అంతేకాకుండా గతంలో నిర్మించిన ఇండ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగినందున ఆచీతూచీ వ్యవహరించారు. గృహనిర్మాణ సంస్థలో అవినీతి అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కై ప్రభుత్వ పక్కా ఇండ్లను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సిబిసిఐడి అధికారులు ఆరంభంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో డబుల్‌రూం ఇండ్లకు కాస్త ఆలస్యమైనా ఇటీవల సీఎం స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో వేగం పుంజుకొంది. వికారాబాద్ జిల్లాలో తొలిదశగా 1900 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం శ్లాబ్ లెవల్‌లో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇండ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే.. ఆరంభంలో కాంట్రాక్టర్లు గిట్టుబాటు కాదని టెండర్లు వేసేందుకు మొరాయించారు. చివరకు పలు మండలాల్లో టెండర్లలో పాల్గొన్నారు. ఎట్టకేలకు తొలి విడత మంజూరు చేసిన పనులు వేగమంతంగా సాగుతున్నాయి. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 ఇండ్లు, పరిగి, వికారాబాద్, కొడంగల్ సెగ్మెంట్‌లకు 960 ఇండ్లు కేటాయించారు. పంచాయత్‌రాజ్ ఇంజనీరింగ్‌శాఖ ఇండ్ల నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యత చేపడుతున్నది. ప్రతి మండలానికి 100 చొప్పున ఇండ్లు మంజూరు చేశారు. మున్సిపల్ పరిధిలో 500 నుంచి 600 ఇండ్లు నిర్మిస్తున్నారు. పలుచోట్ల కేసీఆర్ కాలనీగా నామకరణం చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు కొనసాగుతుండగానే రెండో దశ కింద ప్రతి నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్‌రూము ఇండ్లు మంజూరు చేయాలని యోచిస్తున్నారు. త్వరలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పేదలకు ఇండ్లను అందజేయాలని యోచిస్తున్నారు. ఇసుక, ఇతర సామగ్రి కొరత లేకుండా చర్యలు చేపట్టారు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది వరకు దుర్వినియోగం జరిగినందున ఇండ్ల కేటాయింపు బాధ్యత కలెక్టర్, తహశీల్దార్లకు అప్పగించారు. రాజకీయుల మితిమీరి జోక్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయి. ఒక్కో లబ్దిదారుకు రెండు, మూడేసి ఇండ్లు కాజేసిన దాఖలాలు ఉన్నాయి. ఎలాంటి నిర్మాణాలు లేకుండానే బిల్లులు స్వాహా చేసిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగుచూశాయి. సిబిసిఐడి విచారణ కూడా జరిపిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇండ్ల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించనున్నారు. ఈ అంశాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు సమావేశాల్లో స్పష్టం చేశారు. రాజకీయ పైరవీలకు ఆస్కారం లేదని, అర్హులైన పేదలకే ఇండ్లు ఇస్తామని తెలిపారు.