Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్‌షాక్‌తో తండ్రి, కూతురు మృతి…. మిన్నంటిన రోదనలు

currentకోదాడ: విద్యుదాఘాతానికి తండ్రికూతుళ్ళు మృతి చెందిన సంఘటన శుక్రవారం వేకువజామున నల్లగొండ జిల్లా కోదాడ మండలం గోండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విద్యుత్ ప్రమాదంలో మృతుని భార్య ప్రమాదం నుంచి బయట పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటనలో పసులూరి వెంకటేశ్వర్లు(56) కూతురు కొల్లు రమాదేవి(36)ఈ విద్యుత్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంట్లో ఉన్న దుస్తులు ఆరవేసుకునే తీగకు విద్యుత్ షాట్ సర్యూట్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లు రమాదేవి తన కూతురు స్కూల్ పుస్తకాల బ్యాగ్‌ను ఉతికి ఆర వేస్తుండగా ఆమెకు విద్యుత్ షాట్ సర్కూట్‌తో అక్కడే పడిపోయింది. దీనిని గమనించిన తండ్రి వెంకటేశ్వర్లు తన చేతిలో ఉన్న కర్రతో ఆమెను విడిపించడం కోసం ప్రయత్నం చేయడంలో ఆ కర్ర కూడా తడిసి ఉండటంతో కర్రకు విద్యుత్ ప్రవహించి ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వీరి ఇద్దరి పరిస్థితిని గమనించిన వెంకటేశ్వర్లు భార్య సావిత్రమ్మ విడిపించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెకు కూడా తీవ్రగాయాలయ్యాయి, కాగా ఈ నేపథ్యంలో ఇది గమనించిన గ్రామస్థులు ఆ ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్ చేయడంతో సావిత్రమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. గ్రామస్థులు సావిత్రమ్మను కోదాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతురాలు రమాదేవికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అదే విధంగా వెంకటేశ్వర్లుకు భార్య, నలుగురు కూతుళ్ళు ఉన్నారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆసుపత్రిలో సందర్శించి సంతాపం తెలిపారు. కోదాడ రూరల్ పోలీసులు సంఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో విషాదఛాయలు…….
current-shock1విద్యుత్ షాక్‌తో తండ్రి,కూతుళ్లు మృతి చెందడంతో గోండ్రియాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్వర్లకు భార్య, నలుగురు కూతుళ్ళు ఉన్నారు. వీరిలో ఇద్దరికి వివాహం కాగా మరో ఇద్దరు పైచదువులు చదువుకుంటున్నారు. పెద్ద కూతురు ఆయన రమాదేవికి 12 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల బొదులబండ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో రమాదేవి తన తండ్రి గ్రామం అయిన గొండ్రియాలలోనే ఉంటూ పిల్లలను చదివిస్తున్నది. అదే విధంగా ఆమె ఎస్‌బిహెచ్ రుణాలకు సంబందించి బుక్‌కీపర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఆమె మృతితో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. వెంటేశ్వర్లు, రమాదేవి మృతితో గ్రామం అంతా దు:ఖసాగరంలో మునిగింది. తన తల్లి మృతి చెందడంతో కొడుకు సందీప్ తల్లి మృతదేహాన్ని పట్టుకుని విలపిస్తున్న తీరు పలువురుని కంటతడి పెట్టించింది.
కోదాడ ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు….
విద్యుత్ షాక్‌తో తండ్రి,కూతుళ్ళు మృతి చెందడంతో పాటు తీవ్రగాయాలు అయిన మృతిడి భార్య ఒకే ఆసుపత్రిలో ఉండటంతో ఆసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటన వేకువ జామున జరగడంతో గ్రామం ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలతో పాటు ఆసుపత్రికి చేరుకున్నారు.

Comments

comments