Home కలం ఫీల్ హిజ్ లవ్!

ఫీల్ హిజ్ లవ్!

GERO

కవిత్వం ఇవాళ అక్షరకర్తకీ, అక్షర స్వీకర్తకీ మధ్య తేడాని తుడిచేస్తున్నది. తన మనస్సులోని ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్స్ ని ‘రీడర్ లోనూ జెనరేట్ చేయగలుగుతున్నాడు కవి. సబ్జెక్టివిటీ కి ఆబ్జెక్టివిటీకి మధ్య అంతరం తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో కవిత్వం కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కమ్యూనియన్ కూడా. ఇపుడు ప్రపంచ బాధా కవి బాధా వేరువేరు కావు. కరెంటుతీగని పట్టుకున్న కవి షాక్ అతన్ని ముట్టుకునే ప్రతి వ్యక్తికీ పాస్ ఆన్ అవుతున్నది. ఇట్లా తనని తాను వ్యక్తం చేసుకునే క్రమంలో ప్రపంచాన్ని, ప్రపంచంలోని రాటెన్ కార్నర్స్ నీ వ్యక్తంచేసే ట్రాన్స్పోర్టబుల్ ఎబిలిటీస్ వున్న కవి మోహన్ రుషి. దుఃఖం అతని సెల్ఫ్ పో్రర్ట్ట్రైట్ అయితే అది మన చుట్టూ వున్న సమాజం మీద ఇంపోజ్ అయి కనిపిస్తుంది.
ప్రాపంచిక వస్తువుల రంగూరుచీ వాసన్నీ ఒక ఫికస్డ్ సెట్ అప్ లో కాకుండా కొత్త డైమెన్షన్స్ లో వ్యక్తం చెయ్యడానికి తనకున్న స్వేచ్ఛని, క్రియేటివిటీని ఫుల్ త్రాటిల్ ఫోర్స్ తో ఉపయోగించుకుంటాడు. అందుకే ‘జీరో డిగ్రీ‘లో విషాదం తియ్యగానూ, ఆనందం చేదుగానూ వుంటాయి. కవిత్వాన్ని ఎవరి ఇష్టం వచ్చిన త్రాసులో వాళ్ళు పెట్టి, ఎవరి ప్రయోజనపు స్కేలుతో వాళ్ళు కొలిచే వాళ్ళకోసం చెప్పాల్సింది ఒక్కటే. మోహన్ రుషి కవిత్వమ్, పాము విషమూ ఒక్కటే. చూస్తూ వుండగానే అది మన ఒళ్ళంతా వ్యాపిస్తుంది. అయితేనేం, ఆ బాధ ఎంతో హాయిగా వుంటుంది. బ్లాక్ పోయెటస్ మాయ ఏంజిలో వాక్యాలు గుర్తొస్తాయి.
‘ముసుగులే ఎక్కువ లొసుగుల్ని చూపిస్తాయి/మేకప్పే వికృత స్వరూపాన్ని పట్టిస్తుంది/లేనిది ఉన్నదిగా చూపెట్టేకొద్దీ ఉన్నాయని అనుకుంటున్నవి / లేనివిగా తెల్సిపోతుంది‘ (పే 51, జీరో డిగ్రీ) నగరం అన్నా నగర జీవితం అన్నా ఎవర్షన్ వున్న ఈ కవికి గ్రామం ఒక ప్యాషన్. గ్రామంలో రిసరెక్ట్ అవ్వాలనే స్ట్రాంగ్ డిసైర్‌ని ‘ఎండగొట్టదు /వానదాకదు /సలిదెల్వదు/ పట్నం మొకమ్మీద/కాండ్రిచ్చి ఊంచుకుంట/అడ్డగోల్‌గ అర్సుకుంట పోతనేవుంట‘ (పే 8, దూప)లాంటి వాక్యాల్లో డెలివర్ చేస్తాడు.
ఈస్టర్, జీరో డిగ్రీ, క్షతగాత్ర గానం, లోపలి బాల్కనీ వంటి కవితల్లో జీవితం పట్ల వున్న అవగాహనని తెలియచేస్తే, మంటగలిసిపోతున్న మానవ సంబంధాలని ఒక రిలేషన్ అనేక రియలైజేషన్స్, ఒక ఆదివారం మధ్యాహ్నం, డ్యుయల్ సిమ్ అనే కవితల్లో క్వశ్చన్ చేస్తాడు. జీవితాన్నివ్యాఖ్యానించేప్పుడు సెల్ఫ్- ఇంట్రాస్పెక్షన్‌తో ఒప్పిస్తాడు.
‘మోస్తూనే నడుస్తాం /మౌనంగా అరుస్తాం/ అనంతమైన ఆలోచనల్లోంచి /అసలెప్పటికైనా/బయటపడ్తామా అని భయపడ్తాం‘ (పే 39, లోపలి బాల్కనీ) /జీవితంలో వివిధ దశల్లో వివిధ పాత్రలు నిర్వహించే స్త్రీని అమ్మగా గౌరవిస్తాడు.
‘అమ్మ ముఖం మీది ముడుతలు తను పడ్డ కష్టాలకు ప్రతీకలు/ పాదాల పగుళ్ళు రొటీన్ బతుకు మీద రోతకు ఆనవాళ్ళు/ఆ బట్టలన్నీ మా వీపులకేసి ఉతికినా మాకా శిక్ష చాలదు/ఆ గిన్నెలన్నీ మా చర్మంతొ తోమినా/మాకు పట్టిన అహంకారపు చీడ వదలదు‘ (పే 1, పాత యంత్రం) అంటూ అమ్మని ఆరాధించే కవి భార్యగా వుండే స్త్రీని ముఖ్యంగా క్షణం క్షణం చస్తూ, బతుకుతూ భర్తల సేవల్లో అం‘తరిస్తున్న’ భార్యలందరికీ
‘పొయ్యిలో నువు కట్టెవయినా కూర పాత్రలో వాని / హృదయం ఉడకదు -/ పేగులు చుట్టుకుపోయే బాధతో గుండెలవిసేలా ఏడ్వు -/ ముగింపొక్కటే మిగిలింది !/ వాడి అవయవాలన్నీ కత్తిపీటతో తెగ్గోస్తూ / గుమ్మడికాయ గురుతు తెలీకుండా చెక్కాలి’ (పే.5, భరతవాక్యం)
అంటూ విన్నపం చేస్తాడు. ఆమె రిసెంట్మెంట్‌ని తెలియజేయడానికి ఏం చేయ్యాలో కూడా చెప్తాడు. అంతేకాదు, భార్యపట్ల మగవాడు చూపే కృతఘ్నతను మగవాడిగా తను యాక్సెప్ట్ చేస్తాడు.
‘అనాది నుంచీ ఆడదానికి / ముదనష్టపు మగవాడు వేస్తున్న శిలువను తప్ప / ఇస్తున్న శిలుం పట్టిన జీవితం తప్ప/ ఏమైనా ఇచ్చానా నేను నిజంగా నీకు?’ (పే 30. మార్ డాలా)
తెలంగాణ మీద రాసినవీ, తెలంగాణ డయలెక్ట్‌లో ఇతర విషయాల మీద రాసినవీ యిప్పటిదాకా యిదే అసలు సిసలు కవిత్వం భాష అనుకుంటూ సొంత వోకల్ కారడ్స్ ని వైబ్రేట్ చేయడం మర్చిపోయినవాళ్ళకీ మోహన్ డ్యుయల్ టోన్ ని సమర్థవంతంగా నిర్వహించడం, తన మట్టి పరిమళాన్ని మరచిపోలేకపోవడం ఆస్టానిషింగా వుంటుంది.
‘గీ ఎక్కిరిచ్చుడు ఇయ్యాల్టిది కాదు / నీతోటే అయిపొయ్యేటిదీ కాదు / ఎవసాయం రానోళ్లై / భాష రానోళ్లై / బఫూన్ల్నై / బఫూన్లయ్యి, బక్రా రౌడీలయ్యీ / ఒకటా, రెండా..?! / నీ బట్టెబాజ్ తనంల ఏం కాకుండా మిగిల్నం? (పే 40, ఔర్ ఏక్ నక్కా!)
మోహన్ రుషి కవిత్వంలో మరో ముఖ్యమైన అంశం స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో ఆఫ్ ఫీలింగ్స్. సబ్ కాన్షియస్ డొమైన్ నుంచి అన్ ఇంటరప్టెడ్ ప్రవాహంగా వచ్చే భావాలని అదే వేగంతొ వరుస క్రమం తప్పించి అక్షరబద్ధం చెయ్యడం అన్నది వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన తెలుగు కవులకి మాత్రమే తెలుసును. మోహన్ రుషి ఆ లెక్కలోని కవే. ‘తెల్లారుజాముల‘, ‘రిగ్రెట్స్ రిపోర్ట్‘ కవితలు మొత్తంగా ఉదహరించాలి కాని ఈ వాక్యాలు చాలు.
‘కప్పుకున్న చెద్దర్ని చిన్నగా కిందికి జరిపి, మరీ ఎక్కువ కాదు. తల్కాయ కిందికి. సుతారంగా కండ్లు తెరిచి. కాళ్ళు ఇంకింత ముడ్సుకొని. కిటీలకెల్లి గోడ మీద పడ్తున్న పొద్దుపొద్దుటి తెల్లటి వెలుగుని చూసుకుంట. ఏమి శీకుశింత లేకుంట.‘ (పే 103, తెల్లారుజాముల)
‘జీరో డిగ్రీ‘ కవితల్లో తెలుగు కవిత తను తెలుగు కవితనని గర్వంగా తల ఎత్తుకోగలిగిన అనేక లక్షణాల్లో తెలుగు ఇంగ్లీషు పదాల హ్యాపీ బ్లెండింగ్ ఒకటి. కాన్ఫ్లిక్ట్ అనకొండ, టేస్టెడ్ అండ్ ప్రూవ్డ్ తాయెత్తు, వాళ్ళ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి, శ్రావణ బెళగోల స్టాచ్యూ, స్కాట్లెండ్ పోలీస్ షార్ప్ నెస్ వంటి పదాల కాయినేజ్ చదవడానికి ఎట్లాంటి అవరోధమూ కల్గించదు.
నామ్ కె వాస్తె, బతుకు పట్కారు, పచ్చల్ పచ్చలై, అడ్డగోల్, కయాల్, ముసాఫిర్, నెనరు, బరాబర్, సంబూరం, కచ్చ, బట్టెబాజ్ తనం, గలీజ్ నోరు, చుప్ బే సాలె, కానూన్ కె హాథ్, మాసూమియత్, ఉప్పుమూట ఆట, మోతీచూర్, జమజస్కా, జాలిమ్ లోషన్, దరిదాపు, చల్ అకేలా, సాలెగాడు, మలాం, చిచ్చా, ఎల్లెల్కలబడ్డవా, గలె మిలాయించి వంటి మన తెలుగు, ఉర్దూ పదాలు మన దిల్ కీ ధడ్కనే కదా.
మార్ డాలా, ఔర్ ఏక్ నక్క, ఒక రిలేషన్ అనేక రియలైజేషన్స్, జానే కహా గయే వొ దిన్, మరణజన్మ సంయోగ క్రియ, కిసిసె అబ్ క్యా కెహ్నా, సోమవార వ్రత మహాత్మ్యం, జీవన్ టోన్, 8P, 3. 47, క్షతగాత్రగానం, బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై, పునర్దర్శన ప్రాప్తిరస్తు వంటి శీర్శికలు మోటివేట్ చేసి చదివిస్తాయి.
ఎందరో పాత కవులు తాము ఎక్కిన నిచ్చెన్ని పట్టుకుని ఇంకా వేళ్ళాడుతుంటే మరెందరో కొత్త కవులు ఏక కాలంలో అనేక అడుగుల ఎత్తుకు ఎదిగిపోదామనికవిత్వానికి మార్కెట్ వ్యాల్యూ కల్పించడానికి కమ్ముకొస్తుంటే, కేవలం కవిత్వాన్ని మాత్రమే నమ్ముకుని, కవిత్వమే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావించే కొద్దిమంది కవుల సరసన నిలబడ్డానికి ‘జీరో డిగ్రీ‘ కవికి అన్ని అర్హతలూ వున్నాయి.
కవి ‘దర్దే దిల్‘ కవిత్వమైతే, దానితో పాటు కవిత్వానికి సంబంధించిన అన్ని కోణాల్లోనూ అసెండెన్సీని సాధించిన మోహన్ రుషిని ‘దిల్ ఖోల్ కే‘ ఆహ్వానించక తప్పదు. ఇంగ్లీష్ క్రిటిక్ మ్యాథ్యూ ఆర్నాల్ సూచించిన టచ్ స్ఠొన్ పద్ధతిలో ఈ కవిత్వంలో కవితావాక్యాల కోసం వెదకాల్సిన పని లేదు. ‘జీరో డిగ్రీ‘లో ప్రతి వాక్యమూ కవిత్వమే కనుక, ‘జీరో డిగ్రీ‘లో వున్నది వంద శాతం కవిత్వం కనుక ఆ అవసరం లేదు.

‘ఏమి కావలె, ఇక ఈ జీవితానికి?
పై గుండీ విప్పి, అంగీ వెనక్కి లాగితే,
తగిలే చల్లటి గాలి‘ ఈ జీరో డిగ్రీ.

-చింతపట్ల సుదర్శన్
9299809212