Home ఎడిటోరియల్ సంపన్నులకేనా ఉన్నత విద్య?

సంపన్నులకేనా ఉన్నత విద్య?

edit

ధనికులకే విద్య. ఇదీ ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు వ్యాప్తి చేస్తున్న సందేశం. ఫీజులు గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు చదువుకోసం అప్పుచేయక తప్పటం లేదు. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో సగానికి పైగా అధిక రుణభారంతో పట్టాలు పొందుతున్నారు. సంక్షేమరాజ్య భావన కూలిపోతున్నది. విద్య ఇంకెంతమాత్రం ప్రభుత్వ బాధ్యతగా కనిపించటం లేదు. ఉత్తరాఖండ్‌లో ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమ ఏడాది ఫీజును అకస్మాత్తుగా 300400 శాతం పెంచటంతోసంవత్సరానికి రూ.5లక్షల నుంచి రూ.26 లక్షలకు గగ్గోలు బయలు దేరింది. అటువంటి సంస్థలు ఇతర చోట్ల కూడా ఫీజులను భరించలేని స్థాయికి పెంచాయి. లేదా పెంపుదలను డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేటు విద్యను అతిగా అభిమానించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పి.జి.మెడికల్ విద్య ఫీజును 100 శాతం అనగా రూ.3.2లక్షల నుంచి రూ.6.9లక్షలకు పెంచారు. ప్రైవేటు మేనేజిమెంట్ కోటా సీట్లకైతే రూ.5.25 లక్షలనుంచి రూ.24.2 లక్షలకు పెంపుచేశారు. చిత్రమేమంటే, కొత్తగా నియామకం పొందిన డాక్టర్లు అత్యధిక ఆసుపత్రుల్లో నెలకు సుమారు రూ.20వేలు అనగా సంవత్సరానికి రూ.2.4లక్షలు పొందుతున్నారు. అనుభవం సంపాదించటానికి అవకాశం కల్పించమే గొప్ప అన్నట్లు కొన్ని సంస్థలు రూ. 5000 నుంచి రూ. 10000 చెల్లిస్తున్నాయి.
పిజి కోర్సుల్లో అడ్మిషన్స్‌కు ప్రైవేటు కాలేజీలు నగదుగా లేక ఏవో ట్రస్టులకు విరాళంగా రూ.50లక్షలనుంచి రూ.1కోటి వరకు కాపిటేషన్ ఫీజు గుంజటం తెలిసిందే. ఈ జబ్బు దాదాపు సర్వవ్యాప్తం. ఇది ప్రభుత్వానికి తెలియదా? అంతా తెలుసు. రాజకీయ నాయకులతో బలమైన సంబంధం గలిగిన పలుకుబడిగల వ్యక్తులు అత్యధిక మెడికల్ కాలేజీలు నడుపుతున్నారు. సగటు కుటుంబాల ఆదాయం టీచర్లు, ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగుల వార్షికాదాయం రూ.2.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. వారి పిల్లల ఫీజు సంవత్సరానికి రూ.20లక్షలకు, బకాయిలతో కలిపి రూ.40లక్షలకు అకస్మాత్తుగా పెంచితే వారు కట్టగలరా? ఎంబిబిఎస్ చదువుకు రూ.1కోటి ఖర్చవుతోంది. అల్పాదాయ పరులకు ఏ బ్యాంక్ అంత రుణమిస్తుంది. దేశం ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందుబాటులో ఎలా ఉంచగలుగుతుంది? ఫీజుల పెరుగుదల లక్షణం అనేక సంవత్సరాలుగా ఉంది. దాదాపు అన్ని విద్యాసంస్థలు కేటాయింపులు కుదించుకుని, తమ బడ్జెటరీ వ్యయంలో 3035 శాతం అంతర్గత వనరులనుంచి ఆర్జిస్తామని హామీ పత్రాలు ఇవ్వవలసి వస్తోంది. ప్రభుత్వం నడిపే ఐఐటిలు, ఐఐఎంలు, ఐఐఎంసిలు, ఎన్‌ఐఎఫ్‌టి వంటి సంస్థల్లో సైతం ఫీజుల పెంపుదలకు ఇది దారితీసింది. ఐఐటిల్లో వార్షిక ఫీజు 2017లోని రూ. 90వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఐఐఎం అహ్మదాబాద్ తన రెండేళ్ల డిప్లమో కోర్స్ ఫీజును రూ.18.5 నుండి రూ.19.5లక్షలకు పెంచింది. ఇతర సంస్థలన్నీ గత కొద్ది సంవత్సరాల్లో ఫీజులు పెంచాయి, ఈ సంవత్సరం కూడా పెంచే పనిలో ఉన్నాయి.
విద్యను ముఖ్యంగా సాంకేతిక విద్యను సంపన్నులకే పరిమితం చేయాలా? అన్నది ప్రశ్న. అటువంటి నిర్ణయాలతో యు.కె., యూరోపియన్ యూనియన్ నష్టపోయాయి. రుణభారం విద్యార్థులను తప్పుడు మార్గాలకు మళ్లిస్తున్నది. భారత్ యూరప్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నది. తల్లిదండ్రుల ఆదాయం తమ పిల్లలకు ఫీజులు కట్టటానికి సరిపోనంతగా విద్య ఖరీదు వస్తువుగా మారింది. తమ తల్లిదండ్రుల బాధలు పిల్లల్లో అపరాధభావం కలిగిస్తున్నాయి, పేదరికంలోకి నెడుతున్నాయి. ఇది కచ్చితంగా సామాజిక సంక్షోభం. నీల్సన్ గ్లోబల్ సర్వే, 2013 మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికాల్లోని 58దేశాల్లో 29వేలమందికిపైగా అభిప్రాయాలను సేకరించగా, ఉన్నత విద్య ఎంతో కీలకమని వారిలో 78శాతం అంగీకరించారు. అయితే విద్యావ్యయం తక్కువ ఆదాయ కుటుంబాలకు అవరోధంగా మారుతుండగా, అధిక ఆదాయ కుటుంబాలకు ప్రత్యేక హోదాగా మారుతున్నది. విద్యపై నెలవారీ ఖర్చు అనేక వర్థమాన దేశాల్లో ప్రపంచ సగటుకన్నా హెచ్చుగా ఉంది. ఇండోనేషియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వంటివి అటువంటి దేశాల్లో ఉండగా భారత్ ఏమంత దూరంలో లేదు.
కాలేజీ గ్రాడ్యుయేట్‌లు హైస్కూలు గ్రాడ్యుయేట్‌ల కన్నా కచ్చితంగా ఎక్కువ సంపాదిస్తారు. కాని కాలేజీ డ్రిగీకి పెరుగుతున్న విలువతోపాటే యూనివర్శిటీలు, ఇతర సంస్థల్లో చదువుకయ్యేవ్యయం అంతకన్నా వేగంగా పెరుగుతున్నది. పర్యవసానంగా అల్పాదాయ కుటుంబాల్లో అర్హులైన అనేకమంది పిల్లలకు విద్య అందుబాటులో లేకుండా పోతున్నది.
రిజర్వుబ్యాంక్ మార్చి 27న విడుదల చేసిన కెఎల్‌ఇఎం డేటాబేస్ భారతదేశంలో 201516 వరకు ఉపాధి స్థితిగూర్చి కళ్లు తెరిపించే సమాచారం ఇచ్చింది. 201213 నుంచి భారతదేశ స్థూల ఉత్పత్తి అదనపు విలువ(జివిఎ) నిరంతరాయంగా పెరుగుతున్నప్పటికీ, మొత్తం ఉపాధి 201415లో 0.2శాతం, 201516లో 0.1 శాతం తగ్గింది. 201213నుంచి 2015 16 మధ్య , అనగా మూడేళ్లలో మొత్తం ఉపాధి వృద్ధి రుణాత్మకం (నెగటివ్).
ఉపాధి నష్టాలు సామాజిక ఒత్తిడి పెంచుతాయి. ప్రభుత్వం అందించే సేవలు ఖరీదు కావటం కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు వంటగ్యాస్ సిలెండర్ ధర గత నాలుగేళ్లలో రు.370 నుండి రూ.750కి పెరిగింది. దీనివల్ల ప్రజల బాధలు పెరుగుతున్నాయి, రెండోవైపు, ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరుగుతోంది. ఇది రాజకీయ మూల్యం.
ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, ఫీజులు, విద్యావ్యయం తగ్గించటమెలాగో ప్రభుత్వం బహిరంగ చర్చ నిర్వహించాలి. రాష్ట్రమంత్రివర్గ నిర్ణయాల ముందు రెగ్యులేటర్లు అశక్తులవుతున్నారు. అధిక వ్యయంతో కూడిన విద్య సామాజిక మూల్యం. ప్రపంచీకరణను స్వీకరించేవరకు భారతదేశం పరిస్థితి భిన్నంగా ఉండేది. పేదలపై మోయలేని భారం పరిష్కారం కాదు. అధిక రుణాల భారం నెత్తికెత్తుకోలేనిఅనేకమంది ఉన్నత విద్యకు దూరమవుతారు. భారతదేశం 1960, 1970వ దశకం వర కు అందుబాటులో విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. విధాన రూపకల్పనకు అది ప్రాతిపదికగా ఉండాలి.