Home ఎడిటోరియల్ స్త్రీవాద కవిత్వం- సమాజం

స్త్రీవాద కవిత్వం- సమాజం

Feminist‘ఫెమినిజం’ అనే ఇంగ్లీష్ పదం ‘స్త్రీవాదం’ అనే తెలుగు పదంగా అన్వయించుకొని వాడుతున్నాము. ఫ్రెంచ్ విప్లవం తెచ్చిన ‘వ్యక్తివాదం’ వ్యక్తిస్వేచ్ఛను సమానత, సౌభ్రాతృత్వ భావాల నుంచి, పీడిత జనాభ్యుదయం భాగంగా గ్రహించి వాడుతున్నాము. ఈ అర్థంలోంచే స్త్రీఅభ్యుదయ భావం పుట్టింది. రెండవ ప్రపంచయుదం తర్వాత మానవహక్కుల ప్రకటన స్త్రీ అభ్యుదయ భావానికి జీజాలు వేసింది విముక్తి పోరాటాలు చేసేదిశలో యూరప్, అమెరికాల్లో స్త్రీలో ఓటుహక్కు కోసం పోరాటాలు చేయడంతో ప్రారంభమైంది.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్త్రీ అభ్యున్నతి ఒక ‘కల’ అయ్యింది. కానీ ‘కల్ల’ కాదని నిరూపించడానికి కొన్ని మార్గాలు లభ్యమ య్యాయి. 1960-70 దశకంలో స్త్రీ విముక్తి ఉద్యమం ఒక సైద్ధాంతికతతో ప్రారంభమైంది. దాన్ని ‘ఫెమినిజం’ అన్నారు. ఈ స్త్రీ వాదంగా పరిణమించిన ఈ పదం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాపించి, ఓటు హక్కుతో ప్రారంభమై, ఆడపిల్లల విద్యావిషయం, పెళ్ళిళ్ళ స్వేచ్ఛవంటి సంస్కారాన్ని అలవర్చింది.
1929లో రచయిత్రి వర్జీనియావుల్ “ఏరూమ్ ఆఫ్ వన్స్ ఓన్‌” అనే రచనలో ఫెమినిజం సూత్రాలు ప్రతిబింబించింది. క్రమంగా రెండవ ప్రపంచయుద్ధం జరిగిన తర్వాత స్త్రీలు తమ అస్తిత్వాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం ప్రారంభించారు. సెక్స్ సంబంధాల్లో ద్వంద్వనీతిని అనుసరించే విధానాన్ని చర్చించడం, ఎదురుతిరగడం వంటివి ఉద్యమంలావచ్చాయి. పురుషాధిక ప్రపంచమే స్త్రీ జాతికి శత్రువు కాని, పురుషులు కాదు. అజేయమైన స్త్రీశక్తిని గుర్తించక పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలు వారి అస్తిత్వాన్ని కోలోయేలా చేసింది కాని, 1972 లో “ద ఫిమేల్ యానక్‌” లో జర్నయిన్ గ్రీయర్ వ్రాసిన విషయంపై అందరి దృష్టి ఈ విషయాలపై దృష్టి పడేలా చేసింది. “సెక్స్‌” అనే పదంతో కాకుండా స్త్రీ పురుషులకు “జండర్‌” అనే పదంతో సూచించాలని నిర్ణయించారు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను వెలికితీసేందుకు ఎందరో స్త్రీ మేధావులు నడుంకట్టారు. శ్రమకు తగిన విలువను ఇవ్వకపోవడం వంటి స్త్రీ సమస్యలెన్నో లేవనెత్తారు.
సాహితీప్రపంచం కూడా కళ్ళు తెరిచింది. 1960-70దశకంలో రచయిత్రు లు, కవయిత్రులు అనేకమైన రచనలు చేశారు. వర్ణాంతర వివాహాలు, ప్రేమ పెళ్ళిళు, చదువుసంస్కారం వంటి ఇతివృత్తాలతో నవలలు, కథలు, వ్రాశారు. వరకట్న సమస్యలు , కుటుంబాల్లో స్త్రీల కష్టాలు, అత్తాకోడళ్ళు- ఆరళ్ళు ఆరాట పోరాటాలు అన్ని కథా వస్తువులయినాయి.
ఇన్ని అంశాలు సృశించినా కానీ, స్త్రీ పురుషసంబంధాల్లో న్యూనతాభావాల విషయాలేగాని, స్త్రీ స్వేచ్ఛ, ఆర్థిక సమస్యలు, అసమానతలు, అణచివేతలు వంటివి రచనల్లో ఎక్కువరాలేదు. ‘జానకి విముక్తి ముప్పాళ రంగానాయకమ్మ నవల 1978లో వచ్చింది. స్త్రీస్వేచారాహిత్యాన్ని ఇందులో చిత్రించారు. ఐతే ఎప్పుడో 1905లోనే బండారు అచ్చమాంబ ‘అబలా సచ్చరిత్రమాల’ నవలను రాసి, స్త్రీల కష్టాలు, ఆత్మగౌరవ స్వేచ్ఛల ప్రస్థావన ,ప్రాతివ్రత్య విషయం, పురుషాధిక్యతతో స్త్రీల బాధ్యలెట్లుంటాయో అన్నీ ఆనాడే చిత్రీకరించారు.
నిజజీవితంలోగాని, సాహిత్యంలోగానీ స్త్రీల పరిస్థితికి ‘మతం’, ‘వలపు’ ఈరెండింటిలో ఏదో ఒకటి ఆమె శక్తిని పీల్చివేస్తున్నట్లు గమనిస్తాం. ప్రేమ, దేవుడు, పురుషునిపట్ల ఆరాధన, అంకితభావం వంటివే ప్రథమస్థానంలో నిలుస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వర్గసమాజపు విలువలకు స్త్రీలు కట్టుబడి తమ తమ కళానైపుణ్యాలతో సాహిత్యానికి ఆపాదిస్తూ విస్తృత రచనలు చేస్తే ఆశించిన ఫలితమివ్వవచ్చన్న అవగాహన కలిగింది. 1980 నుండి స్త్రీవాద కవిత్వంలో స్త్రీలు రాస్తేనే స్త్రీవాదం బలంగా చూపగలరన్న నిర్ణయానికి వచ్చారు.
స్త్రీ సమస్య అంతా లైంగికమని ‘ఫ్రాయిడ్’ చెప్పింది, గురజాడ ‘కన్యక’లోని పురుషాహంకార దౌర్జన్యానికి, ‘కన్యాశుల్కం’లోని స్త్రీల అమ్మకం, దురాగతాలు వంటి వాటికి అనుసంధానం చేస్తే, నిజమని తెలుస్తుంది. అట్లే, స్త్రీ సమస్య అంతా ఆర్థికమే అని వాదించిన ‘ఏంగిల్’ చెప్పిందీ సత్యమే అని అనిపించకపోదు. సోషలిస్టు సమాజం స్త్రీల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం కలిగింది. మానవ వాస్తవికతతో, మానవ హక్కులతో ముడిపెట్టి తాత్తికతతో చూస్తే 1. లిబరల్ ఫెమినిజం, 2.రాడికల్ ఫెమినిజం తెరమీదికొస్తుంది. చలం నవల ‘మైదానం’, రాయప్రోలు సుబ్బారావు దీర్ఘకవిత, స్నేహలతాదేవి, కాళ్ళకూరి నాటకం ‘వరవిక్రయం’ అన్నా స్త్రీ స్వేచ్ఛకోసం రాసినవే. భావకవులు, అభ్యుదయ కవులు ఎవరికి తోచినంత వారు వ్రాశారు. కమ్యూనిస్టు భావాలుగల చాసో, వట్టికోట వంటివారు సామాజిక దృక్కోణంలో రాసిన ఒద్దిరాజువారు వంటివారు కథల్లో స్త్రీ సమానత్వాన్ని చూపారు. చెరబండరాజు, గద్దర్, వరవరరావు వంటి విప్లవకవులు తమ రచనల్లో స్త్రీ విముక్తిని కొంతవరకు కోరారు.
“ఆకాశంలో సగం నీవు సగం నేను
మనిద్దరం కలిసి ఉద్యమిస్తే, ఉప్పెన విప్లవిస్తే విజయం” (శివసాగర్) అని అనడం ఆలోచింపచేస్తుంది. స్త్రీలు తమ కష్టాలను తామే అనుభూతులుగా వ్యక్తపరిచే కవిత్వం కావాలి. తమ బాధలను, సానుభూతిగా పురుషులు వ్యక్తపరచడం స్త్రీవాదులు కోరుకోలేదు. కాని, త్రిపురనేని శ్రీనివాస్, చేరా వంటి పత్రికా రచయితలు స్త్రీవాదాన్ని ప్రజలదృష్టికి తేవడంతో ఈ రచయిత్రులకు ప్రోద్భలం కలిగింది. కాత్యాయిని విద్మహే, మృణాళిని వంటి స్త్రీవాద రచయిత్రులు సాహిత్య విమర్శకులుగా ఉదహరించవచ్చు.
ప్రాచీనకాలంలో మొల్ల, సుభద్ర, వెంగమాంబ, రంగాజమ్మ, ముద్దుపళని వంటివాళ్ళు, తక్కువమంది రచయిత్రులు, కవయిత్రులు దర్శనమిస్తారు. తర్వాత భావకవితా యుగంలో విశ్వ సుందరమ్మ, చావలి బంగారమ్మ, ఆ తర్వాతి కాలంలో కనపర్తి వరలక్ష్మమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వంటి కొద్దిమంది కన్పిస్తారు. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సావిత్రి అనే కవయిత్రి ‘బందిపోట్లు’ కవిత, రేవతీదేవి ‘శిలాలోలిత’ అనే కవితా సంపుటి వంటివి పాతివ్రత్యంతో కూడిన శీలం అనేది కేవలం స్త్రీకి ఒక్కదానికేనా అనే ఆలోచనతో ఉండే ద్వంద్వనీతిని ప్రస్ఫుటించడం కన్పిస్తుంది. 1990లలోనే ప్రముఖ స్త్రీవాద రచయిత్రులు కొండేపూడి నిర్మల ‘సందిగ్ధ సంధ్య’, నడిచే గాయాలు; 2001లో
వచ్చిన కల్పనా రెంటాల ‘నేను కనిపించే పదం’, ఘంటసాల నిర్మల ‘నిర్వచనం’ అనే కవితా సంకలనాలు చాలా ఆలోచనాత్మకమైనవి.

‘అనంత నీలాకాశంలో తమ బరువంతా లోలోపల దాచి, హాయిగా, ఆహ్లాదంగా తేలికగా మరో పనేదీ లేదన్నట్లు కనిపిస్తూ, విహారం చేసే నీలిమేఘాలు చూస్తూ చూస్తూ వుండగానే గాఢమై, దట్టమై, భీకరమై, జలరూపమై ధారాపాతమై భూమిని చేరి, జలవంతం, ఫలవంతం చేస్తాయి. ప్రజలకు ప్రాణాధారాలౌతాయి”
అనే మాటలను నాలుగవ కవరు పేజీపై వేసి, 1993లోనే ముద్రించిన స్త్రీవాద కవిత్వం ‘నీలిమేఘాలు’ అద్భుతమైన కవితాసంకలనం. నల్లజాతి కవయిత్రి ఆడ్‌ల్రార్డ్ స్మృతికిచ్చిన అస్మిత సంపాదకత్వంలో వచ్చిన నీలిమేఘాలులో వసంత కన్నభిరాన్, ఓల్గా, కొండేపూడి నిర్మల, జయప్రభ, శివలెంక రాజేశ్వరీదేవి, కె.గీత, విమల, రజియాబేగం, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, రేవతీదేవి, ఊర్మిళ, సావిత్రి, అబ్బూరి ఛాయాదేవి, శ్రీమతి, ఏలూరి పార్వతి, అంజన, ఎస్.జయ, వాణీరంగారావు, కె.వరలక్ష్మి, రావులపల్లి సునీత, పుట్ల హేమలత, మమెజబీన్, బి.పద్మావతి, కొండపల్లి కోటేశ్వరమ్మ, సుధ, శిలాలోలిత, జయప్రభ, శాంతిప్రియ, కుప్పిలి పద్మ, రత్నమాల, వకుళాభరణం లత, కవితలు ఆలోచనా త్మకంగా రాసినవి ఉన్నాయి.
“నా మీద తరాలనుంచి మోపిన అపనిందలపైట
నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్యహస్తం” అని నిర్మొహ మాటంగా రాశారు జయప్రభ.
“అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా వుంటుంది” అని రాసిన విమల, “అన్నీ తెలిసిన నరకం నుండి, నాకేమీ తెలీనితనాన్ని రక్షించండి” అని రాసిన కల్పనా రెంటాలల కవిత్వం కన్నీళ్ళు తెప్పిస్తుంది. స్త్రీల దీన పరిస్థితిని మరొకమారు ముందుకు తెస్తుంది.
ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా మారని పరిస్థితులకు కారకులెవరన్న ప్రశ్న ప్రతి స్త్రీలో ఉదయించక మానదు. ఇటువంటి వెన్నో ఉదహరించవచ్చు.
స్త్రీవాద ధోరణులను చిత్రిస్తూ అనేక కథలు, కథానికలు, నవలలూ, కవితలూ వచ్చాయి. పి.సత్యవతి ‘ఇల్లలుకగానే’, ఓల్గా ‘రాజకీయ కథలు’, ముదిగంటి సుజాతరెడ్డి ‘విసుర్రాయి’ గీతాంజలి ‘బచ్చేదాని’, వంటివెన్నో సాహిత్యలోకాన్నేలుతున్నాయి. స్త్రీవాద కథానికలు ఎంపికచేసి జయధీర్ తిరుమలరావు ఒక సంపుటాన్ని ప్రచురించారు. ‘స్త్రీవాదం ఎక్కడిది? ఎందుకు’ అనే సుజాతరెడ్డి వ్యాసం (ఆంధప్రభలోవచ్చింది) అందరినీ ఆకర్షించాయి.
1994ను యుఎన్‌ఒ కుటుంబ సంవత్సరంగా ప్రకటించి కుటుంబ ప్రాధాన్యతను తెల్పింది. సామరస్యం, సుహృద్భావంతో కొనసాగాల్సిన జీవితం కుట్రలు, కుతంత్రాలతో సాగుతున్నది. ఈ నగ్న సత్యాన్ని గ్రహించాలి. అశ్లీల కరమైన కవితలు, రచనలు సమాజాన్ని పెడత్రోవన పెట్టిస్తాయి. ఇవన్నీ వెయ్యికళ్ళతో పసిగట్టాలి. ప్రశ్నించాలి.
‘దళితస్త్రీవాదం’ తప్పని సరి స్పృశించి రాయాల్సిన వాదం స్త్రీవాదం. స్త్రీలల్లో మరీ అన్యాయంగా చూడబడుతున్న దళితస్త్రీల బాధలను, గోడును పట్టించుకోవాల్సిన ఆవశ్యకత కవయిత్రులందరిపై ఉన్నది. స్త్రీ దేవతగా కొలవబడుతుంది. అట్లాంటి స్త్రీ ఇప్పుడు సంస్కృతీ సంస్కరణల్లో పురుషునికి లొంగి, బానిస బతుకు బ్రతుకుతూ సంసారసాగరాన్ని ఈదుతుంది.
“తిరుగుబాటు ప్రకటిస్తునా కుటుంబంలోని కుళ్ళుని
కడిగి, సమాజంలోని దురహంకారాన్ని ఇక
ఉతికి ఆరేస్తా…” అంటుంది జాజుల గౌరి! గోగుశ్యామల, జూపాక సుభద్ర, కొలకలూరి మధుజ్యోతి, జల్లి ఇందిర వంటి రచయిత్రులు, దళిత వాద స్త్రీ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గోగుశ్యామల ‘నల్లపొద్దు’ అందరినీ ఆలోచింపచేసిన సంకలనం.
మైనారిటీ స్త్రీవాదం ముస్లిం స్త్రీల గొంతునెత్తుకుంది. తమ సంస్కృతిలో ఉన్న అవిద్య, బుర్ఖా, తలాఖ్ వంటి గృహహింసను తమ తిరుగుబాటు గళాలద్వారా నిరసించారు. వెతలే కథలై, గాయాలే గేయాలై పుస్తకాలు ప్రచురించిన అమృతలతగారు స్త్రీవాదం బలంగా వినిపిస్తూ రచయిత్రులనూ, కవయిత్రులను బాగా ప్రోత్సహిస్తున్నారు. ముస్లింవాద రచనలు చేసే షాజహానా ఆ సమాజానికి ఎన్నో సవాళ్ళు విసురుతుంది.అని శెట్టి రజిత, హిమజ, నెల్లుట్ల రమాదేవి, ఐనంపూడి శ్రీలక్ష్మి, కొండపల్లి నీహారిణి, శైలజామిత్ర, దేవులపల్లి వాణి, కొలిపాక శోభారాణి, లావణ్య, నాంపల్లి సుజాత, అడవాల సుజాత, జ్వలిత, భండారు విజయ, త్రివేణి, కృష్ణవేణి, రేణుక…సరోజన, రత్నమాల, భాగ్యలక్ష్మి, కిరణ్‌బాల, శోభారాణి, జలజ, స్వాతి, శ్రీపాద వంటి రచయిత్రులు, కవయిత్రులు ఎందరో తెలుగు సమాజాన్ని తట్టి లేపుతున్నవాళ్లు. సమాజంలో స్త్రీలపాత్ర మహాముఖ్యమైన పాత్ర. జీవన శకటాన్ని, భార్య, భర్త ఇద్దరూ సరిసమానంగా నడుపుతున్న వారూ కాబట్టి అన్యాయమై పోతున్న స్త్రీలపట్ల అందరు గళాలు ఎత్తాలి, కలాలు సంధించాలి.
ప్రేమపేరుతో మోసం చేస్తున్నవారి నెట్లా పసిగట్టాలో చెప్పి, యువతను చైతన్యపరచాల్సిన బాధ్యత కవయిత్రులపై ఉన్నది. అట్లే అసభ్యకర సన్నివేశాలను చిత్రిస్తున్న సినిమారంగాన్ని బుల్లితెరనూ అభ్యంతరకర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యసమాజాన్ని (కవితలు, రచనలు ద్వారా) నిలదీయాలి.
ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న కవయిత్రులు ఇంకా వసివాడని తెలంగాణ ఉద్యమ చేతనాన్ని మదిలో ఉంచుకొని స్త్రీతత్వం ఎంత సున్నితమో అంతటి సునిశితమని తెలియచేయాలి. ఆ ఉద్యమాల్లో స్త్రీలంతా ఎంత ధైర్యంగా పాల్గొన్నారో మరవద్దు. అదే స్ఫూర్తితో కవిత్వోద్యమం రావాలి. స్త్రీజాతిపై జరిగే ప్రత్యక్ష, పరోక్ష దాడులను ఖండించాలి, అసమానతలు తొలగించాలి. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురిగా స్త్రీని ఈ సమాజం ఎట్లా ఇబ్బందులకు గురిచేస్తుందో కవిత్వంతో తెలియచేయాలి. స్త్రీకి స్త్రీ పరోక్షంగా ఎట్లా శత్రువు అవుతుందో గమనింపచేయాలి. ఈ సమాజం స్త్రీ నెట్లా చూడాలో కవితాగర్జనలతో తెలియచేయాలి. ఇది ఒక బాధ్యత!!

FEMINIST