Home ఎడిటోరియల్ ఆగని ఎరువుల సబ్సిడీ‘మేత’!

ఆగని ఎరువుల సబ్సిడీ‘మేత’!

              Farmer

దేశంలో రైతులకు అందించే వార్షిక ఎరువుల సబ్సిడీ సొమ్ము పక్కదారి పట్టడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కడ తప్పుదొర్లింది అన్నది తెలియకుండా ఉంది. అయితే సుమారు రూ. 70,000 కోట్ల వార్షిక మొత్తంలో రైతుకు చేరుతున్నది సగం కంటే తక్కువే. ప్రతి ఏటా స్థూల దేశీయ ఉత్పత్తిలో 1 శాతాన్ని ఎరువుల సబ్సిడీకి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ సబ్సిడీలో 35 శాతం మాత్రమే రైతుకు దక్కుతోందని 2015-16 సంవత్సరపు ఆర్థిక సర్వేతెలిపింది. ఈ లీకేజీని అరికట్టడానికి ఎరువుల సబ్సిడీ పథకాన్ని సమూలంగా మార్చాలని ఎన్‌డిఎ ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ సారథ్యంలోని గత యుపిఎ ప్రభుత్వం ఈ దిశగా కొన్ని చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని వాడుకోవడం ద్వారా కావలసిన ఆఖరి అడుగువేయాలని ప్రభుత్వం ప్రస్తుతం తలపెట్టింది. ఇందుకు 16 అంకెల ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్‌ను కూడా వాడుతారు.

ఎంపిక చేసిన 19జిల్లాల్లో ఎరువుల సబ్సిడీ పథకం పని తీరును పరీక్షించడాన్ని 2016లో ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దేశవ్యాప్తం గా సబ్సిడీ నిధుల విడుదల ఆరునెలలు ఆలస్యమయింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎరువుల తయారీ కర్మాగారాలకు అధిక ధరలు చెల్లించాయి. అవి రైతులకు తక్కువ ధరలకు ఎరువులను సరఫరా చేస్తాయని ప్రభుత్వాలు ఆశించాయి. ఈ పద్ధతి పెద్ద ఎత్తున లీకేజిలకు ఆస్కారం ఇచ్చిందని రుజువయింది. వాటిని అరికట్టడానికి రైతులకు నేరుగా సబ్సిడీని అందించాలని, అందుకు లభ్ధిదారులైన రైతులను గుర్తించాలని తాజాగా ప్రభుత్వం అనుకొంది. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలను 2016 జూన్‌లో ఎంపిక చేసింది. ఎరువుల చిల్లర దుకాణాలకు అమ్మకాలను కొలిచే యంత్రాలను ప్రభుత్వం సరఫరా చేసింది. వేలిముద్రల స్కానర్లను కూడా ఇచ్చింది.

ఆ రాష్ట్రానికి చెందిన బాబూరావు అనే రైతు ఈ పరీక్ష సంగతి తెలియకుండానే మామూలుగా తన 20 ఎకరాల పొలానికి ఎరువులు కొనడానికి దుకాణానికి వెళ్లాడు. రైతు వేలిముద్రలు స్కాన్ చేసి బాబూరావు గుర్తింపును నిర్ధారించడానికి చిల్లర దుకాణదారు యంత్రాన్ని వాడాడు. ఈ ప్రక్రియలో ఆధార్ డేటాబేస్‌ను వినియోగించాడు. భూమి స్వంతదారు నిర్ధారణకు డిజిటైజ్ అయి ఉన్న రికార్డులను ఆ యంత్రం పరిశీలించింది. వ్యవసాయ క్షేత్రం భూసారాన్ని కూడా ఆ రికార్డులు తెలిపాయి. ఆ భూమి తాలూకు అన్ని వివరాలను పరిశీలించాక బాబూరావు భూమికి వాడాల్సిన ఎరువును కూడా యంత్రం నిర్ధ్ధారించింది. ఇదే పద్ధతిని దేశమంతటా పరీక్షించి చూచారు. ఎరువుల సబ్సిడీపై దాదాపు రూ.45,000 కోట్ల లీకేజీలు అరికట్టగలం అన్న ధైర్యాన్ని నూతన పద్ధతి ప్రభుత్వానికి కలిగించింది. కానీ ఏమైందో తెలియదుగాని ఆ నూతన పద్ధతిని ప్రభుత్వం ముందుకు తీసుకుపోకుండా పక్కన బెట్టింది. అసలు ఆ లీకేజిలను అరికట్టే మాటే వినపడటం లేదు. హఠాత్తుగా ఏమయింది, ఎక్కడ ఏ తప్పు దొర్లింది అన్నది అంతుబట్టకుండా ఉంది.

ఎరువుల సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయన్నది అనేక ఏళ్ల కిందటే రుజువైన బహిరంగ రహస్యం. సమస్య వ్యవస్థలోనే ఉంది. మొట్టమొదటి లోపం ఏమిటంటే సబ్సిడీలను నేరుగా రైతులకు ఇవ్వకుండా ఎరువుల కంపెనీలకు ఇవ్వడం. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆ కంపెనీలు నత్రజని ఆధారిత ఎరువులను, ఫాస్ఫేట్ ఆధారిత ఎరువులను కూడా ఉత్పత్తి చేయాలి. తొలివిడత చెల్లింపు కింద 85శాతం నుంచి 95శాతం దాకా సబ్సిడీ డబ్బును ప్రభుత్వం కంపెనీలకు చెల్లిస్తుంది.

జిల్లా స్థాయి గిడ్డంగులకు కంపెనీలనుంచి ఎరువులు చేరగానే ఈ చెల్లింపు జరుగుతుంది. ఎరువుల నిల్వలను జిల్లా వ్యవసాయాధికారులు తనిఖీ చేశాక తక్కిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఆ గిడ్డంగులనుంచి ఎరువులు చిల్లర దుకాణాలకు పంపిణీ అవుతాయి. ఆ దుకాణాలనుంచి రైతులు వాటిని ప్రభుత్వం నియంత్రించిన ధరలకు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వానికి కంపెనీలు అమ్మిన ధరకంటే చాలా తక్కువకు దుకాణాలు రైతులకు అమ్మాలి. ఈ పద్ధతి కాగితాలపై అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కానీ రూ.70,000కోట్ల వార్షిక సబ్సిడీలో సగం వృధా అవుతోం ది.

ఎరువులను అక్రమంగా పరిశ్రమలకు తరలిస్తున్నారు. ప్లై వుడ్, పెయింట్ల తయారీ కేంద్రాలకు ఎరువులు తరలిపోవడంతో వాటికి కొరత ఏర్పడి రైతులకు తక్కువ ధరకు లభించటం లేదు. సరిహద్దులు దాటించి ఆ ఎరువులను బంగ్లాదేశ్, నేపాల్‌లలో విక్రయించడం కూడా సాగుతోంది. ఆ దేశాలలో యూరియా ఎరువులు చాలా ఖరీదు. 2015-16 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. మరో పక్క ఎరువుల కర్మాగారాలు తమకు చెల్లింపులలో ఆలస్యం జరుగుతోందని మొరపెడుతున్నాయి. 2012-15మధ్య ప్రభుత్వం ఆ కంపెనీలకు సుమారు రూ.3,500కోట్లు బకాయిపడింది. దీనితో ఆయా కంపెనీల లాభాలకు గండిపడింది. అంతేకాకుండా రైతులు చౌకధరకు లభించే తక్కువరకం ఎరువులను వాడడంతో దేశంలోని చాలాచోట్ల పంటల నాణ్యత దెబ్బతింది.

ఎరువుల సరఫరా వ్యవస్థను సంస్కరించడానికి 2007లో కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం నాంది పలికింది. ఎరువుల పర్యవేక్షణ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతికింద టోకు వ్యాపారులకు జరిపిన అమ్మకాలను ఎరువుల కంపెనీలు ఆన్‌లైన్‌ద్వారా విధిగా తనిఖీ చేయాలి. ఈ పద్ధతి వల్ల జిల్లాల్లో ఎరువులు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో ఎప్పటికప్పుడు గమనించే వీలుకలిగింది. ఆ తరువాత 2012 నవంబర్‌లో ప్రభుత్వం మొబైల్ ఆధారిత ఎరువుల యాజమాన్య వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాని కిందకు ఎరువుల చిల్లర వర్తకులు వచ్చారు. టోకు వ్యాపారులనుండి ఎరువులు అందినట్లు వారు ఎప్పటికప్పుడు సందేశాలు పంపే వ్యవస్థ అది. ఆ సందేశాల ఆధారంగానే ఎరువుల కంపెనీలకు ప్రభుత్వంనుంచి చెల్లింపులు అందేవి.

చిల్లర వర్తకులనుంచి రైతులకు విక్రయించే ఎరువులపై పర్యవేక్షణ ఉండాలని 2013లో ఒక టాస్క్‌ఫోర్సు సిఫార్సు చేసింది. ఇది కనుక జరిగితే ప్రభుత్వం రైతులకు సబ్సిడీని కంపెనీల ద్వారా బదిలీ అయ్యేలా చేయగలదు. ముందుగా ఉత్పత్తిదారునుంచి టోకు వ్యాపారికి, రెండవ దశలో టోకు వ్యాపారినుంచి చిల్లర వర్తకుడికి, మూడవ దశలో చిల్లర వర్తకుని నుంచి రైతులకు అందే ఎరువులపై నిఘా ఏర్పడుతుంది. మార్కెట్ ధరకు రైతులు చిల్లర వర్తకుని నుంచి ఎరువులు కొనాలన్నది లక్షం. నేరుగా వారికి సబ్సిడీ అందుతుంది కనుక మార్కెట్ ధర భరించ గలుగుతారు. అయితే 2014లో నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఆధార్‌కు అనుసంధించిన ఎరువుల పంపిణీ వ్యవస్థను ప్రతిపాదించారు. ఇందులో రైతులను గుర్తించడం కీలకం. అందుకు గల అడ్డంకులు భవిష్యత్తులో తొలగనిదే ఈ ఆలోచన సరిగా పనిచేయదు. ఎరువుల సబ్సిడీ పథకాన్ని సరిగా ఆలోచించి గాడిలో పెడతారని రైతులోకం ఆశిస్తోంది.
* మృదులాచారి, కుమార్ సంభవ్ శ్రీవాస్తవ