Home ఆదిలాబాద్ పల్లెల్లో పండుగ

పల్లెల్లో పండుగ

Festival-in-villege-image

నాల్గొ రోజూ అదే జోరు

చెక్కులు చూసి మురిసిపోతున్న రైతులు

సిఎం కెసిఆర్‌ను మరిచిపోలేమంటున్న రైతులు

రైతుల్లో సంతృత్తి నింపిన రైతు బంధు 

మంత్రులు, ఎంఎల్‌ఎల సుడిగాలి పర్యటనలు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ ఆదిలాబాద్ బ్యూరో : రైతన్నల ఇంట్లో కాసుల వర్షం కురుస్తోంది. గతంలో అప్పులు చేసి, పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కాలానికి ముందే చేతికి పెట్టుబడి డబ్బులు అందడంతో మురిసిపోతున్నారు. పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు  ప్రతిష్టాత్మకంగా  రైతు బంధు కార్యక్రమంలో భాగంగా పంటల పెట్టుబడి కింద చెక్కులను అందజేయడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. పెట్టుబడి డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు పిల్లలకు నూతన వస్త్రాలు  కొనుగోలు చేసి, పండగ జరుపుకుంటున్నారు.  గత నాలుగు రోజులుగా అధికార యంత్రాంగం రైతు బంధు  కార్యక్రమంలో చెక్కులను పంపిణీ చేస్తుండగా రైతులు పెద్ద ఎత్తున హజరై చెక్కులను తీసుకుంటున్నారు.

బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకున్న రైతులు  కొన్ని చోట్ల బ్యాంక్ రుణాలు, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న  అప్పులు చెల్లించి, మిగిత డబ్బులను ఎరువులు విత్తనాల కోసం దాచిపెట్టుకుంటున్నారు.  వికలాంగులు, వయోవృద్దులు నడవలేని స్థితిలో  ఉన్నవారికి అధికారులే వారి ఇంటి వద్దకు వెళ్లి పాసు పుస్తకాలను చెక్కులను అందజేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎంపి బాల్క సుమన్, విప్ నల్లాల ఓదెలు, ప్రభుత్వ సలహాదారుడు  వివేక్ , ఎంఎల్‌ఏలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య , ఎంఎల్‌సి పురాణం సతీష్‌తో పాటు జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్‌లు  రైతు బంధు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా  వ్యాప్తంగా 99.84 శాతంతో 4 లక్షల 4 వేల 638 సర్వే నంబర్‌లలో 8 లక్షల 72 వేల 874 ఎకరాల విస్తీర్ణం గల  భూమిలో పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నారు.  జిల్లాలో 1లక్ష 77 వేల 147 ఖాతాల్లో 7లక్షల 59 వేల 191 విస్తీర్ణం ఉండగా,   జిల్లాలో 1లక్ష 31 వేల 466 ఖాతాలతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరయ్యాయి. జిల్లాల్లో 1 లక్ష 17 వేల 82 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది.   దాదాపు 3.80 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా,దీనిలో దాదాపు 3 లక్షల  ఎకరాల వ్యవసాయ భూమికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా కొమురంభీం జిల్లాలో 3లక్షల 12 వేల ఎకరాలకు గాను రైతులకు రూ. 125.13 కోట్లు పంటల పెట్టుబడులకు సంబంధించి చెక్కులను అందజేస్తున్నారు.  అదే విధంగా ఇప్పటి వరకు 51 వేల 654 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. నాలుగు బ్యాంకుల ద్వారా జిల్లాలో మొత్తం 1లక్ష 26 వేల 700 చెక్కులు పంపిణీ చేయడంతో పాటు  రూ. 122 కోట్లు రైతులకు బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్నారు. ఏదిఏమైనా  రైతు బంధు పథకం  రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందని వాపోతున్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీ ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతుంది. అధికార యంత్రాంగంతో పాటు ఎంపిలు, ఎంఎల్‌ఏలు ఇతర ప్రజాప్రతినిధులు ఎండ వేడిమి సైతం లెక్క చేయక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుషారుగా పాల్గొంటున్నారు. పల్లెలకు తరలి వస్తున్న నేతలకు, అదికారులకు రైతన్నలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా  నిర్వహించేందుకు మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లను పూర్తి చేశారు. గడిచిన నాలుగు రోజులుగా అన్ని చోట్ల సందడి నెలకొంది. ప్రభుత్వం అందించే సాయాన్ని అందుకునేందుకు సంబురంగా రైతులు తరలివస్తున్నారు. వృద్దులు, మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతుండగా అనారోగ్య పరిస్థితులు, దివ్యంగులు ఇతరాత్ర కారణాలతో ఇళ్లకే పరిమితం అయిన వారికి స్వయంగా ఇళ్లకు వెళ్లి చెక్కులు అందిస్తుండడంతో అవి అందుకున్న రైతన్నలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడుగా భావిస్తు వేనోళ్ల కొనియాడుతున్నారు. ప్రతినిత్యం వందల సంఖ్యలో బృందాలు పల్లెల్లో పర్యటిస్తూ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. చెక్కుల ముద్రణలో లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు సైతం అవకాశం కల్పిస్తుండడంతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు ఎంఎల్‌ఏలు తమ తమ నియోజకవర్గాల్లో రైతు బంధు పథకంలో పాల్గొంటున్నారు.

ఈ పథకం మరో చరిత్రకు శ్రీకారం చుట్టిందని రైతులు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చూట్టు కాళ్లరిగేలా తిరిగినప్పటికీ అధికారులు కనకరించలేదు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో కొకోల్లాలు. అయితే భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రైతన్నల మోములో ఆనందం తాండవిస్తోంది. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి రూ. 4వేలు, రెండు పంటలకు రూ. 8వేలు అందించడం చారిత్రాత్మక నిర్ణయమని గతంలో ఇలా చేసిన వారు ఎవరు లేరని ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.