Home కలం కథారచన రచయిత

కథారచన రచయిత

                                               poetry

కథ జీవితం కాదు.. కథ కల్పితం.. జీవితం వాస్తవం.. కథల్ని ప్రభావితంచేసేవి మానవ జీవితాలు. సమాజమే సాహిత్యం, సంస్కృతి కళలకు ప్రధాన మూలం. జీవితం కథా రచనకు వనరులు సమకూరుస్తుంది. రచయిత ముందు ‘స్వాప్నికుడు’ అయి ఉండాలి. స్వప్నించడం అంటే ఆలోచించడం.. ఊహించడం.. భావనల్ని మాలగా కట్టుకోవడం. రచయిత ఆశించేది, కోరుకునేది తెలుసుకున్నదీ ఆలోచనల్లో మథించబడి, ఊహల్లో రూపుదిద్దుకోబడి, భావనల కూర్పుగా అక్షరీకరింపబడి, అక్షరీకరింపబడుతున్నప్పుడే వస్తువుకో శిల్పం, శైలి, భాష ఏర్పడి కథగా ప్రకటితం అవుతుంది. కథకు కావాల్సింది వస్తువు.. అది సామాజిక జీవన గమనం నుండి ఏర్పడుతుంది. దైనందిన సమస్యలను కాల్పనిక దృక్పథంతో అల్లితే కథ పుడ్తుంది..

తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించడం.. అంటే బాగా పట్టించుకోవడం.. నిత్యం తను చూసే తనకెదురయ్యే సంఘటనలూ, అనుభవాలూ రచయిత ఆలోచనల్ని ఆక్రమించడం.. వాటి ఆధారంగా పాత్రల్నీ, పాత్రల స్వభావాల్నీ, వ్యక్తిత్వాల్నీ, జీవితాల్నీ.. జీవన పోకడలను కథగా కూర్చడంలో రచయిత కథా రచయితగా రూపొందడం..రచయిత మనస్తత్వం కథకు ముఖ్యం.. రచయితకు సంఘజీవిగా పరిశీలనా మనస్తత్వం, పట్టించుకునే స్వభావం ఉండాలి.. ఒక ఇతివృత్తాన్ని కథగా మలిచే తపన, సహనం, కృషీ తోడైతే కథా రచయితగా రచనా ప్రస్థానం కొనసాగుతుంది. రచయితలు కొందరు శిల్పానికి ప్రాధాన్యతనిస్తే కొందరు వస్తువుకు ప్రాధాన్యతనిస్తారు. రకరకాల ఇజాలతో రచయిత సహచర్యం చేస్తాడు.. చేయాల్సి వస్తుంది.

మానవ సమాజాల్ని అధ్యయనం చేయడం, మానవ సంబంధాలను అధ్యయనం చేయడం, సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేయడం వల్ల రచయితల్లోని రచనా ప్రవృత్తి లోపాలను పూరించబడి కథా రచనకు ఉపకరిస్తుంది.. రచయితకు తనదైన భావజాలం ఉంటుంది. ఉండాలి కూడా. భాజాలానికి లోబడి రచయిత తన వస్తువునెంచుకొని రచన చేయడం జరుగుతుంటుంది.. ఒక్కోసారి కథా వస్తువు కథాశైలిని నిర్ధేశిస్తుంది. అంటే కథను ప్రథమ పురుష, ఉత్తమ పురుష, ఉత్తరాల రూపంలో లేక వివిధ కథా ప్రయోగాలు, మ్యాజిక్ రియలిజం, సోషియో ఫాంటసీ, నాటకీయ శిల్పం లాంటి ప్రక్రియల్లో రచన వెలువడుతుంది. కథలు సమస్యల్ని చిత్రిస్తూ సమస్యల పరిణామాల్ని చిత్రిస్తూ చివరికి పరిష్కారం చెప్పాలా అంటే.. అది అవసరం లేదు.. సమస్యల్ని ముందు పెట్టడం.. కథను ముగించడం ఒక పద్ధతి.. కథను పరిష్కారం వరకూ తీసుకుపోవడం ఒక పద్ధతి..

పరిష్కారం రచయిత చెప్పడు, కథలో పాత్ర చెప్తుంది. కథలకు ప్రయోజనం కాలక్షేపం కాదు.. ఎందుకంటే కథలు ఏమీ తోచక నమిలే బఠానీలు కాదు.. కథా ప్రయోజనం అంటూ ఉంటుంది.. రచయిత ప్రధానంగా స్వాప్పికుడై తన కలల కాంక్షలను రచిస్తాడు. ఆలోచనారహితంగా బతుకుతున్న పాఠకుల్ని స్పృహలోకి తీసుకరావడం ఒక రచనాకారుని కర్తవ్యం. మనిషి స్వేచ్ఛాజీవి.. రచయిత స్వేచ్ఛాజీవి.. తన ఇష్టం వచ్చినట్లు బతుకుతాడు, తన ఇష్టం వచ్చినట్లుగా రాస్తాడు, అంటే అది రచనా రంగానికి అరాచక ధోరణి అవుతుంది.

రచయిత బాధ్యత గల బుద్ధిజీవి.. రచయిత మానవతను పరిమళించే పట్టుకొమ్మ.. రచయిత సమాజానికి దిశానిర్దేశం చేసే నాయకుడు.. మార్గదర్శకుడు.. దార్శనికుడు.. తాత్వికుడు.. రచయితలో ఈ దినుసులన్నీ ఉండాలి.. అవి రచనల్లో గుబాళించాలి.. రచయితకు సిద్ధాంతాలుండాలి.. రాద్దాంతాలు చేయరాదు. రచయిత కలంవీరుడిలా కవనం చేయాలి. రచయిత వ్యక్తిత్వం సాహిత్యతత్వంలో ప్రవహించాలి.. సమాజం పట్ల నిజాయితీ.. సామాజిక బాధ్యత.. రచనా నిబద్ధత ఒక్కటి కావాలి..ప్రతి రచనా రచయితను ప్రక్షాళనం చేస్తుంటుంది.. రచయితలోని రచనా ప్రయోజనం రచయితను నిలబెడుతుంది.. రచయితకు రచనా రంగం ప్రవృత్తిగా ఏర్పడాలి.. సమాజం.. సమాజ జీవితం ప్రధానంగా ప్రామాణికంగా కనిపించే రచనలు రచయిత నిజాయితినీ, నిలకడనూ ప్రతిబింబిస్తాయి. రచయితను అక్షర సేవకుడిగా సమాజ ప్రేమికుడిగా నిలబెడుతాయి..

రచయిత హృదయం నిత్య కల్లోలితం.. వేదనా ఆవేదనా ఆవహించిన రచయిత అంతరంగం అశాంతికి నిలయం.. ఆ అశాంతీ అలజడీ రచన చేయిస్తుంది.. రచయిత మనోసముద్రం నిత్యం ఒక అల్లకల్లోలిత గానాన్ని కూరుస్తుంటుంది.. రచయిత జ్ఞానగర్భంలోంచి ఒక రాగం ప్రాణం పోసుకొని ఆలాపన చేస్తుంటుంది..సాహిత్య సృష్టి ఒక ప్రతిసృష్టి లాంటింది. ప్రతి రచనకూ ఒక జీవన్మరణ వేదన నేపధ్యమై ఉంటుంది.. తన సమస్తాన్నీ చీల్చుకొని ఒక రచనకు జన్మనివ్వడమే సాహిత్య రచనంటే.. ఈ జన్మనిచ్చే పని రచయితను నిరంతర చైతన్యంతో ఉండేలా చేస్తుంది. నిజానికి రచయిత రాసే పెన్ అనేది తన మనసుకు నాలిక లాంటిది.“ The pen is the tongue of the mind” అంటాడు డాన్ క్విక్జోట్. ఒక కవి అన్నట్లుగా మనిషికి మనిషి చేసిన అన్యాయమే మానవ చరిత్ర. అయితే ఆ అన్యాయాన్ని రూపుమాపి మానవ చరిత్రను పునర్లిఖించేందుకు రచయిత చేసే రచనలు దోహదపడాలి. చివరగా ఫ్రాంజ్ కాఫ్కా మాటల్ని గుర్తుచేసుకుంటూ “మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పని పక్షంలో అసలు చదవటం ఎందుకు? మంచి పుస్తకం ఒక దుస్సంఘటనలాగా మనల్ని ప్రభావితం చేయాలి.

మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆత్మీయుల మరణంలాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మన లోపల గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిగా పగులగొట్టాలి”. ఏ సాహిత్య ప్రక్రియైనా దాని లక్ష్యం, పరమార్థం మనుషుల్లో అలజడి కలిగించడమే.. మనిషిని తీవ్రంగా ఆలోచించేలా, తనతో తాను యుద్ధం చేసేలా ప్రేరేపించడమే.. ఒక రచన చదువర్ని వెంటాడాలి.. అనుక్షణం డిస్టర్బ్ చేస్తుండాలి. ఎక్కడో ఏదోలే అని రాజీపడటం జరిగేలా చేయకూడదు. కలిచివేయాలి.. మనలో గడ్డకట్టిన స్వార్థాలను, స్వభావాలాను, కాలుష్యాలను, కాఠిన్యాలను గొడ్డలిలా పగులగొట్టి చిట్లగొట్టి మనల్ని మనలా మారేలా చేయాలి.

మనిషికి ప్రతిరోజూ ఒక జీవితకాలమే.. రచయితకు ప్రతిక్షణం ఒక రచనాకాలమే.. షోపెన్ హావర్ ఉచిత సలహా ఇచ్చినట్లుగా మూర్ఖుల కోసం రాస్తానంటే పాఠకులకేమీ కొదువ ఉండదు. రచయిత తానెవ్వరికోసం రాసేది స్పష్టత కలిగి ఉండాలి. వ్యక్తి రచయితగా రూపొందే క్రమం ఉంటుంది. రచయిత తనను తాను నిలబెట్టుకునే నిత్య ప్రక్రియ అగ్నిప్రవేశం లాంటిది. అందుకు రచయితలు తమను తాము సంసిద్ధం చేసుకోవడమే రచనకు ప్రథమ సూత్రం.. రచనా సమగ్రతకు కట్టుబడి ఉండే రచయిత సమాజానికి మంచి రచనలు అందించగలుగుతాడు.. మంచి రచయితలు కావడానికే మనందరం ప్రయత్నిద్దాం.. పట్టుదలతో ఆ మహాసంగ్రామంలో గెలుపుతీరం చేరుకుందాం.. అందుకు నిలబడి రచనలు చేద్దాం.. నిలబడే రచనలు చేద్దాం..

అనిశెట్టి రజిత
9849482462