Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లో ఇంగ్లండ్

ff

స్వీడన్ ఇంటికి

సమరా: ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 20 గోల్స్ తేడాతో స్వీడన్‌ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయంతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ అసాధారణ ఆటతో ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ సెమీస్‌కు చేరుకుంది. రష్యాక్రొయేసియా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడుతుంది. ఫ్రాన్స్, బెల్జియంలు ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత ఆటను కనబరిచింది. దూకుడుగా ఆడుతూ ఏ దశలోనూ స్వీడన్‌ను కోలుకోనివ్వలేదు. వరుస దాడులతో స్వీడన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లండ్‌కు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వడంలో స్వీడన్ విఫలమైంది. ఇంగ్లండ్ జోరుతో స్వీడన్ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఇంగ్లండ్ 30వ నిమిషంలో మొదటి గోల్ నమోదు చేసింది. హ్యారి మగురై హెడర్‌తో అద్భుత గోల్ సాధించింది. తర్వాత కూడా ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. అయితే ప్రథమార్ధంలో ఇరు జట్లు మరో గోల్ సాధించలేక పోయాయి. మరోవైపు స్వీడన్ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రెండో అర్ధ భాగంలో కూడా ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. ఎటాకింగ్ గేమ్ ఆడిన ఇంగ్లండ్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇదే క్రమంలో 59వ నిమిషంలో రెండో గోల్ నమోదు చేసింది. డెలె అల్లి హెడర్ ద్వారా ఈ గోల్ సాధించాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యం 20కు చేరింది. తర్వాత దూకుడుగా ఆడినా మరో గోల్ సాధించలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకుంది. కాగా, ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్ సెమీస్‌కు చేరడం 1990 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
బ్రెజిల్‌కు బెల్జియం షాక్
కాజన్: రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి మరో అగ్రశ్రేణి జట్టు నిష్క్రమించింది. ఐదు సార్లు చాంపియన్ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు లో బెల్జియం చేతిలో బ్రెజిల్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 21 తేడాతో విజయం సాధించిన బెల్జియం సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే పలు అగ్రశ్రేణి జట్లు ఇంటిదారి పట్ట గా తాజాగా వాటి సరసన బ్రెజిల్ కూడా చేరింది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ లీగ్ దశలోనే వైదొలగగా, అర్జెంటీనా, స్పెయిన్, ఉరుగ్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్, మెక్సికో వంటి అగ్రశ్రేణి జట్లూ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

belgeam

ప్రారంభం నుంచే…
బ్రెజిల్‌తో జరిగిన పోరులో బెల్జియం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రారంభం నుంచే ఎటాకింగ్ గేమ్‌తో మ్యాచ్‌పై పట్టు సాధించింది. చూడచక్కని ఆటతో బ్రెజిల్‌ను కట్టడి చేసింది. బెల్జియం దూకుడుగా ఆడడంతో బ్రెజిల్ ఒత్తిడికి గురైంది. ఇదే క్రమంలో బెల్జియంకు 13వ నిమిషంలోనే సెల్ఫ్ గోల్ అందించింది. కార్నర్ కిక్‌ను అడ్డుకునే క్రమంలో బ్రెజిల్ ఆటగాడు ఫెర్నాండిన్హో సెల్ఫ్ గోల్ చేశాడు. దీంతో ప్రారంభంలోనే బెల్జియంకు 10 ఆధిక్యం అందింది. తర్వాత స్కోరును సమం చేసేందుకు బ్రెజిల్ తీవ్రంగా ప్రయత్నించింది. వరుస దాడులతో బెల్జియంను హడలెత్తించింది. అయితే బెల్జియం పటిష్టమైన డిఫెన్స్‌తో బ్రెజిల్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇదిలావుండగా 31వ నిమిషంలో కెవిన్ డు బ్రుయిన్ బెల్జియంకు రెండో గోల్ అందించాడు. లుకాకో నుంచి పాస్‌ను అందుకున్న బ్రుయిన్ దాన్ని గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. ప్రథమార్ధంలో బెల్జియం 20 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో బ్రెజిల్ దూకుడుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. బెల్జియం సమన్వయంతో ఆడుతూ బ్రెజిల్ జోరును అడ్డుకుంది. ఈ క్రమంలో రెండో హాఫ్‌లో బెల్జియంకు మరో గోల్ లభించలేదు. అయితే దూకుడుగా ఆడిన బ్రెజిల్ స్కోరును సమం చేసేందుకు సర్వం ఒడ్డింది. 76వ నిమిషంలో అగస్టో హెడర్‌తో గోల్ చేశాడు. దీంతో బెల్జియం ఆధిక్యం 21కి తగ్గింది. తర్వాత కూడా బ్రెజిల్ దూకుడుగా ఆడినా మరో గోల్ చేయడంలో విఫలమైంది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెల్జియం మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

Comments

comments