నేడు స్పెయిన్‌తో నాకౌట్ పోరు
మాస్కో: స్పెయిన్‌తో జరిగే ప్రిక్వార్టర్ సమరం ఆతిథ్య జట్టు రష్యా జట్టుకు సవాలుగా మారింది. లీగ్ దశలో ప్రారంభ రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించిన రష్యా చివరి మ్యాచ్‌లో మాత్రం ఉరుగ్వే చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. కాగా, ఆదివారం స్పెయిన్‌తో జరిగే మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు లీగ్ దశలో అంతంత మాత్రంగానే రాణించి అతి కష్టం మీద నాకౌట్ బెర్త్‌ను సాధించిన స్పెయిన్‌కు కూడా ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. మొరాకోతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే గ్రూపులో స్పెయిన్ అగ్రస్థానంలోనే నిలువడం విశేషం. కాగా, లీగ్ దశలో ఎలా ఆడినా నాకౌట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు స్సెయిన్ సిద్ధమైంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సవాలుగా మారింది. ఇస్కో, లాగో అస్పాస్ తదితరులపై స్పెయిన్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా కీలక ఆటగాళ్లు రాణిస్తే స్పెయిన్‌కు విజయం కష్టమేమి కాదు. అయితే గతంతో పోల్చితే స్పెయిన్ ఈ ప్రపంచకప్‌లో ఆశించిన ఆటను కనబరచలేదనే చెప్పాలి. ఇరాన్‌పై మాత్రమే ఏకైక విజయం సాధించింది. పోర్చుగల్, మొరాకోలతో జరిగిన మ్యాచ్‌లలో డ్రాతోనే సరిపెట్టుకోక తప్పలేదు. రష్యాతో జరిగే మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు డిగో కోస్టా, నాచోలు రాణించాల్సిన అవసరం ఎంతైన ఉంది. వీరిద్దరూ చెలరేగితే జట్టు కష్టాలు చాలా వరకు తీరుతాయి. మరోవైపు రష్యాను కూడా తక్కువ అంచన వేయలేం. డెనిస్ చెరిసేవ్, అర్టెమ్ తదితరులు ఈ ప్రపంచకప్‌లో నిలకడగా రాణించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వీరిద్దరూ జట్టుకు కీలకంగా మారారు. అంతేగాక మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. దీంతోపాటు సొంత అభిమానుల మధ్య ఆడనుండడం రష్యాకు అదనపు బలాన్నిస్తోంది. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో నాకౌట్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.
జోరుమీదున్న క్రొయేసియా…
మరోవైపు డెన్మార్క్‌తో జరిగే మరో ప్రిక్వార్టర్ సమరానికి క్రొయేసియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన క్రొయేసియా నాకౌట్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. లీగ్ దశలో బలమైన అర్జెంటీనాను చిత్తు చేసి ప్రకంపనలు సృష్టించింది. అంతేగాక నైజీరియా, ఐస్లాండ్లను కూడా చిత్తు చేసింది. డెన్మార్క్‌తో జరిగేమ్యాచ్లో కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఎటిబొ, మోడ్రిక్, రాకిటిక్ తదితరులతో క్రొయేసియా చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో క్రొయేసియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, లీగ్ దశలో అంతంత మాత్రంగానే రాణించిన డెన్మార్క్‌కు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. లీగ్ దశలో ఒక్క పెరూపైనే విజయం సాధించింది. చివరికి ఆస్ట్రేలియా వంటి బలహీన జట్టుతో డ్రా చేసుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను నిలువరించడం ఒక్కటే డెన్మార్క్‌కు ఊరటనిచ్చే అంశం. ఏదీ ఏమైనా ఈ మ్యాచ్‌లో క్రొయేసియాను ఓడించి ముందుకు సాగడం డెన్మార్క్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పొచ్చు. కానీ, సంచలన ఆటకు మరో పేరుగా చెప్పుకునే డెన్మార్క్‌ను ఏమాత్రం తక్కువ అంచన వేసినా క్రొయేసియా మూల్యం చెల్లించుకోక తప్పదు.