Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఫైనల్లో ఫ్రాన్స్

sp

సెమీస్‌లో బెల్జియంకు షాక్

సెయింట్ పీటర్స్‌బర్గ్: రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెల్జియంతో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో ఫ్రాన్స్ 10 తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమిటిటి సాధించిన హెడర్ గోల్‌తో ఫ్రాన్స్ విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1998, 2006 ప్రపంచకప్‌లలో కూడా ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. ఇందులో స్వదేశంలో జరిగిన 1998 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. అయితే జర్మనీ వేదికగా జరిగిన 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ చేతిలో పరాజయం చవిచూసింది. మరోవైపు ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకున్న బెల్జియంకు నిరాశే మిగిలింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు అద్భుత విజయంతో ఫ్రాన్స్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌క్రొయేషియా జట్ల మధ్య జరిగే సెమీస్ విజేతతో ఫ్రాన్స్ ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ ఆదివారం చారిత్రక లుజ్నికి స్టేడియంలో జరుగుతుంది.
హోరాహోరీ…
ఊహించినట్టే ఫ్రాన్స్‌బెల్జియం జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు అద్భుత ఆటతో ఆకట్టుకున్నాయి. ఒకరి గోల్ పోస్ట్‌వైపు మరోకరూ దాడులు చేస్తూ ముందుకు సాగారు. బెల్జియంతో పోల్చితే ఫ్రాన్స్ కాస్త దూకుడుగా ఆడింది. అయితే పటిష్టమైన డిఫెన్స్ బెల్జియం ప్రత్యర్థి జట్టు దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. రెండు జట్లు కూడా గోల్స్ కోసం తీవ్రంగా పోరాడాయి. అయితే ఇరు జట్ల గోల్ కీపర్లు సమన్వయంతో వ్యవహరిస్తూ గోల్స్‌ను అడ్డుకున్నారు. దీంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కాగా, పటిష్టమైన బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అసాధారణ ఆటతో చెలరేగిన బెల్జియం ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ దూకుడును కనబరచలేక పోయింది. ఫ్రాన్స్ కూడా తీవ్రంగా పోరాడినా తొలి హాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక పోయింది.
ఉమిటిటి సంచలనం…
ఇక, ద్వితీయార్ధంలో కూడా ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. ఈసారి ఫ్రాన్స్ దూకుడును మరింత పెంచింది. వరుస దాడులతో బెల్జియంపై ఒత్తిడి పెంచింది. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమిటిటి పెను సంచలనం సృష్టించాడు. బెల్జియం ఆటగాళ్లను, గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ హెడర్‌తో కళ్లు చెదిరే గోల్ సాధించాడు. ఊహించని రీతిలో స్పందించిన ఉమిటిటి చిరస్మరణీయ గోల్‌ను నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో నమోదైన అత్యుత్తమ గోల్‌లలో ఇది చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. తర్వాత కూడా రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడాయి. బెల్జియం వరుస దాడులతో ఫ్రాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే అందివచ్చిన అవకాశాలను బెల్జియం ఆటగాళ్లు వృథా చేశారు. కనీసం రెండుసార్లు గోల్స్ చేసే సువర్ణ అవకాశం లభించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఫ్రాన్స్ డిఫెన్స్‌కే పరిమితమైంది. ఎటాకింగ్ గేమ్‌కు పోకుండా ఆధిక్యాన్ని కాపాడుకునే అంశంపైనే దృష్టి పెట్టింది. బెల్జియం ఆఖరి నిమిషం వరకు స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరుకుంది.
సంబరాల్లో ఫ్రాన్స్…

sprts

తమ జట్టు ఫైనల్‌కు చేరడంతో ఫ్రాన్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో, పట్టణాల్లో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలారు. పలు నగరాల్లో అభిమానులు బాణాసంచా పేల్చుతూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. అంతేగాక ఆటపాటలతో కనువిందు చేశారు. పలు చోట్ల పెద్ద పెద్ద టివి తెరలను ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది మ్యాచ్‌ను తిలకించారు. తమ జట్టు ఫైనల్‌కు చేరగానే వారి ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కళ్లు చెదిరే విన్యాసాలతో డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది మంది ఫుట్‌బాల్ ప్రేమికులు రోడ్లపై వచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో ఫ్రాన్స్‌లో ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపించింది.
అక్కడ విలాపం..
మరోవైపు బెల్జియంలో విషాద వాతావరణం నెలకొంది. తమ జట్టు ఫైనల్‌కు చేరడం ఖాయమనే నమ్మకంతో ఉన్న అభిమానులకు నిరాశే మిగిలింది. అసాధారణ ఆటతో సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఇక్కడ మాత్రం విజయం సాధించలేక పోయింది. దీంతో బెల్జియం అభిమానుల్లో నిరాశ నెలకొంది. చివరి వరకు తమ జట్టు గెలుస్తుందనే నమ్మకంతో ఉన్న అభిమానులు ఓటమిని జీర్ణించుకోలేక పోయారు. ఫైనల్‌కు చేరే సువర్ణ అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోక పోవడంపై అభిమానుల గుర్రుగాఉన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పలు నగరాల్లో విషాద భరిత వాతావరణం కనిపించింది. ప్రతి చోటు అభిమానులు బోరున విలపిస్తూ కనిపించారు.

Comments

comments