Home కలం అలీనత ఎరుగని అగ్నిశిఖ

అలీనత ఎరుగని అగ్నిశిఖ

Poet

జ్వాలాముఖి దిగంబర కవిత్వంలో ఎగసిన ఒక ఉద్యమ సాహితీ తరంగం. అది అనేక ఎత్తు పల్లాలను, సంఘర్షణలను చవిచూసింది. ఆకారం వీరవెల్లి రాఘవాచార్య దిగంబర జ్వాలాముఖియై ‘ఓటమి- తిరుగుబాటు’ కవియై, ‘వేలాడిన మందారపు నవలై, సాహిత్య విమర్శా – విశ్లేషకుడై’, సినిమాల సమీక్షకుడై, శరత్ సాహితీ జీవితంపై విష్ణు ప్రభాకర్ పండితుని గ్రంథానువాదియై, ఆంధ్ర రాష్ట్రమంతా ఆయన రాకకై ఎదురు చూచిన ఉపన్యాస చక్రవర్తియై తన బహుముఖీన సామర్థాలను 40 ఏళ్లకు పైగా ప్రదర్శించాడు.

కరడు గట్టిన సంప్రదాయాలను పాటించే ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కాలం చెల్లిన ఆచారాలతో సరిపెట్టుకోలేక వాటిని ధిక్కరించి; దోపిడీ పీడనల ఎగుడు దిగుడుల అవినీతి సమాజంతో రాజీపడలేక దానిపై తిరగబడటం; నమ్మిన సామాజిక విముక్తి మార్గాలలో పొడసూపిన సంస్కరణ వాద ధోరణులతో తలపడటం, విప్లవ వర్గాలలో పొడసూపిన వర్గ శత్రు సంహారక ఒంటెత్తు వాదంతో అంతర్గత, బహిరంగ ఘర్షణలకు సిద్ధపడటం; తాను నమ్మిన మార్కిజానికీ, వర్గ పోరాట సిద్ధాంతానికీ వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన మహిళా వాదం, దళితవాదం, ప్రత్యేక తెలంగాణ వాదం తదితర పోస్టుమాడర్నిస్టు ధోరణులను ఎదుర్కొనటం; భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతులపై, రాజ్యహింసపై నిప్పులు చెరగటం; జీవిత కాలమంతా చెదరని ఆశయ నిబద్ధుడై నిలవటం… జ్వాలాముఖి జీవన యానంగా సాగింది.

1947 నాటికి బాల్యదశలో వుండిన తరం, 1960వ దశకం నడిమికి యువకులై తమ స్వీయానుభవంతో, జాతీయోద్యమ ఆదర్శాలతో, జీవితాన్ని పరిశీలించటం మొదలిడే సరికి, ఈ దేశ స్వాతంత్య్రం అశేష ప్రజానీకానిది కాక పిడికెడు స్వార్థపర వర్గాలదిగా అర్థమైంది. బోధింపడిన ఆదర్శాలు, ఆశయాలు తలకిందులుగా ప్రశ్నార్థక మై నిలిచాయి. దానితో ఆగ్రహం కట్టలు తెచ్చు కుంది. దుష్ట సమాజంపై మర్యాదలు నిరర్థక మనిపించింది. చిత్తం వచ్చిన సాహితీ రీతిలో తిరగబడిన, పోటెత్తిన ఆగ్రహావేశాల వ్యక్తీకరణే దిగంబర కవిత్వం. నక్సల్‌బరీ, శ్రీకాకుళం ప్రభావాలతో తమ సాహితీ తిరుగుబాటుకు ఒక నిర్ధుష్ట సామాజిక సంఘటిత ఉద్యమ రూపాన్నివ్వవలసిన ఆవశ్యకతను ఆరుగురిలో నలుగురు గుర్తించారు. అందుకొక ప్రాపంచిక చింతన- మార్కిజంను జోడించుకున్న దాని ఫలితంగా దిగంబర కవులు, గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్లుగా, విప్లవ కవులుగా పరిణామం చెందారు. నాటి విప్లవ సాహితీ చారిత్రక సంఘటనల చలనాలకు తాము స్వయంగా కారకులుగా నిలిచారు.

అందులో జ్వాలాముఖి వ్యక్తిగత పాత్ర మిక్కిలి చొరవతో కూడినట్టిది. జ్వాలాముఖి మేనమామ (రంగా చార్య అని గుర్తు) కమ్యూనిస్టు ఉద్యమంలో, వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో చురుకైన కార్యకర్తగా ఉంటూ అమరుడైనారు. ఆయన ప్రభావం జ్వాలాముఖిపై బాల్యం నుండి ఉండేది. ఎం.టి.ఖాన్ జ్వాలాముఖికి బాల్యమిత్రుడు, సహాధ్యాయి. వీరిరువురిపై మగ్దూం మొహియుద్దీన్ వ్యక్తిగత ప్రభావం బలీయంగా ఉండేది. ఆ విధంగా దిగంబర కవిత్వపు కాలం నాటికే మార్కిస్టు చైతన్యం జ్వాలాముఖిలో పిండరూపంలో వుండేది. అది నక్సల్‌బరీ, శ్రీకాకుళం తిరుగుబాట్ల ప్రభావాలు, ప్రపంచ వ్యాపితంగా ఫ్రాన్సులో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, చైనా దేశాలలో యువతరం తిరుగుబాట్ల ప్రభావాలతో జ్వాలని మడమ తిప్పని విప్లవ భావుకునిగా మార్కిస్టు చింతనా పరునిగా స్థిరపరిచింది. శ్రీశ్రీ షష్టి పూర్తి సభలలో విప్లవం వైపు మొగ్గును రప్పించటంలోనూ, 1970జులై 4న విరసం స్థాపించటంలోనూ జ్వాలాముఖి క్రియా శీలపాత్ర ఉంది. విప్లవ భావాలను వ్యాప్తి చేస్తున్నారన్న కారణంగా, 1971 నడిమధ్యన జ్వాలాముఖి, చెర బండరాజు, నిఖిలేశ్వర్‌లను ఆనాటి బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది. వ్యక్తిగత విశ్వాసాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టే హక్కు రాజ్యానికి వుండదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ చిన్నపరెడ్డి న్యాయమూర్తిగా యిచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం వారిని విడుదల చేయక తప్పింది కాదు. బూర్జువా కోర్టుల్ని బహిష్కరించాల నీ, వర్గ శత్రువు రక్తంలో చేతులు ముంచినవాడే విప్లవ కారుడనే తరహా వ్యక్తిగత హింసావాదపు చారు మజుందార్ బోధనలపై నక్సల్‌బరీ ప్రభావిత సరికొత్త తరాలలో అపవిశ్వాసం పెరిగింది.

విప్లవ కమ్యూనిస్టు నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల పరిచయంతో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లు విప్లవ ప్రజాపోరాట పంథాను తమ మార్గంగా ఎంచుకున్నారు. తొలి నుండీ విరసంలో ముఖ్యపాత్రను పోషించిన వీరిరువురిలో మారిన వైఖరులతో అప్పటికే విరసంలో అంతర్గతంగా సాగుతుండిన సంఘర్షణ తీవ్రతరమైంది. సివిల్ కేసు క్రిమినల్ కేసు అయినట్లు సిద్ధాంత, రాజకీయ భిన్నాభిప్రాయాలు నిర్మాణ సమస్యలుగా మారాయి. అనంతపురంలో 1975 జనవరిలో జరిగిన విరసం 5వ రాష్ట్ర మహాసభారంభంగా జరిగిన ఊరేగింపులో చారు వర్గీయులు, మజుందార్ ఫొటోను ముందు పెట్టి ఊరేగింపు చేయటంతో ఇక విరసంతో కలసి పనిచేయటం అసాధ్యమనే నిర్ణయానికి జ్వాలాముఖి, కొత్తపల్లి రవిబాబు తదితరులు వచ్చారు.

వీరిని వదిలించుకు నేదెలాగనే ఆలోచనలో చారు వర్గీయులున్నారు. ఫలితంగా విరసం చీలిపోయింది.  1981 నుండి జ్వాలాముఖి ఏ రచయితల సంఘంలో సభ్యునిగా లేడు. వ్యక్తిగతంగా, విప్లవ సాహిత్యోద్యమ కారునిగా నిరంతరంగా కృషి సాగిస్తున్నాడు. జ్వాలాముఖి తెలుగులో ఎంత అనర్గళంగా గంగా ప్రవాహ సదృశ్యంగా మాట్లాడ గలడో ఉర్దూ (హిందీ)లలో కూడా అంత నిర్ధుష్టంగా ఉపన్యసించగలిగేవాడు. ప్రేమ్ చంద్ శత జయంతికి లమ్హీ గ్రామానికి నిర్మలానంద తదిత రులతో కలసి వెళ్లారు. గుజరాత్ ఘోర దుర్మార్గాలు తెలిసి అక్కడికి వెళ్లిన 28 మంది రచయితలలో ఆయనా, నేనూ కూడా ఉన్నాం. ఆయన హిందూ – ముస్లిం ఐక్యతను, లౌకిక సంస్కృతిని ప్రగాఢంగా వాంఛించాడు. భారత-చైనా మిత్రమండలికి నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. రెండు దఫాలుగా చైనా సందర్శించి వచ్చారు.

హైదరాబాద్‌లో పుట్టి, హైదరాబాద్‌లోనే పెరిగి, హైదరాబాద్‌లోనే ఆఖరు శ్వాస విడిచిన జ్వాలాముఖి- పోరు తెలంగాణను తప్ప వేరు తెలంగాణాను ఏనాడూ సమర్థించలేదు.
నిర్దుష్టమైన అభిప్రాయాలు ప్రకటించటంలో తన భావాల్ని సమర్థించుకుంటూ వాదించటంలో అలీన వాదాన్ని ఆయన ఏనాడూ పాటించలేదు. శరీరం సహకరించినంతకాలం రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి, అనేక సభా వేదికల నుండి ప్రసంగించడానికి అలసట ప్రదర్శించలేదు. కొడవ టిగంటి కుటుంబరావు 1970లో రాస్తూ “దిగంబర కవులు, కవులుగా కంటె ఉద్యమకారులుగా బాగా ఎదిగారు” అన్నమాట జ్వాలాముఖికి పూర్తిగా వర్తిస్తుంది.

దివి కుమార్ 9440167891