Home ఎడిటోరియల్ సంపాదకీయం: పతకాల కోసం ‘కసి’ పెంచుకోవాలి!

సంపాదకీయం: పతకాల కోసం ‘కసి’ పెంచుకోవాలి!

Sampadakeeyam-Logo

రియో ఒలింపిక్స్ మన దేశానికి నిరాశ మిగిల్చాయి. మున్నెన్నటి కన్నా అధికంగా – 117మంది అథ్లెట్స్‌ను పంపితే రెండేరెండు – ఒక వెండి, ఒక కాంస్యం – పతకాలు లభించాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు మెడల్స్ లభించగా దేశం పరవశ మొందింది. ఎందుకంటే అప్పటి వరకు లభించింది 7 వ్యక్తిగత పతకాలే. రియోలో పతకాల పంట రెండంకెల్లో ఉంటుందని ఆశించటంలో తప్పు లేదు. అయితే అనుభవజ్ఞులు అత్యధికులు విఫలం కాగా తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న పి.వి. సింధు, కుస్తీ(రేప్‌ఛేజ్) పోటీల్లో సాక్షి మాలిక్ పతకాలు సాధించి భారత్‌కు పతకాల పట్టికలో స్థానం కల్పించారు. వారు ఎంతైనా అభినందనీయులు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వాటి స్థాయిని బట్టి పోటాపోటీగా వారికి సత్కారాలు, నగదు తదితర బహుమతుల వర్షం కురిపించటం వారి శ్రమకు, ప్రావీణ్యతకు విలువ కట్టటం కాదుగాని ఎనలేని ప్రోత్సాహకం, ఔత్సాహికులకు ఉత్తేజకారకం. 2000 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం తదుపరి మరో తెలుగు అమ్మాయి సింధు ఇన్నేళ్లకు మరోసారి రజిత పతకం తేవటం రెండు తెలుగు రాష్ట్రాలను పులకింపజేసింది.

అయితే పతకం చేరువకు వచ్చి ఫలితం పొందలేకపోయినవారు, ఉత్తమ ప్రదర్శన కనబరిచినవారు భారత బృందంలో ఎందరో ఉన్నారు. వారిలో ఎన్నదగిన వారిలో జిమ్నాస్టిక్స్లో పాల్గొనే అర్హత సంపాదించటమేగాక, అత్యంత క్లిష్టమైన ప్రడునోవా వాల్ట్‌లో వెంట్రుక వాసి తేడాలో కాంస్యపతకం చేజార్చుకున్న త్రిపుర యువతి దీపా కర్మాకర్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 1984లో పిటి ఉష తదుపరి వ్యక్తిగత పరుగుపోటీ ఫైనల్‌కు చేరిన లలితా బాబర్, 20 కిలోమీటర్ల నడకపోటీలో 13వ స్థానం పొందిన మనీష్‌సింగ్ రావత్, టెన్నిస్‌లో సానియా మీర్జాతో కలిసి ఆడిన అదితి అశోక్ ఉన్నారు. మహిళల విలువిద్య, పురుషుల హాకీ జట్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి. అలాగే ఇతర అన్ని విభాగా ల్లోను ప్రతిభావంతులైన ఔత్సాహికులు ఎందరో ఉన్నారు. అటువంటివారే భవిష్యత్ ఆస్తి. ఇంతపెద్ద కంటింజెంట్‌ను పంపటం డబ్బు వృధా అని వ్యాఖ్యానించిన రచయిత్రి శోభా డే లాంటి సంకుచిత మనస్తత్వాలు గలవారు మనదేశంలో చాలా పెద్దసంఖ్యలోనే ఉంటారు. ఆటల్లో గెలుపు ఓటములకన్నా పాల్గొనటం ముఖ్యం. అంతర్జాతీయ వేదికలపై పోటీపడక పోతే పోరాట తత్వం, నిర్భీతి ఎలా అలవడతాయి? మనదేశంలో లేనివి క్రీడా సంస్కృతి, ప్రభుత్వాల అండదండలు; ఉన్నవి వివిధ క్రీడా సంఘాల్లో రాజకీయాలు. వీటిని ప్రక్షాళన చేసి వృత్తిపరులకు అప్పగించాలి. అథ్లెటిక్స్, ప్రధానం గా వ్యక్తిగత ప్రతిభాపోటీలు. వారికి ఎంతో కఠినశిక్షణ, ప్రోత్సాహం, భవిష్యత్‌కు భరోసా అవసరం. పరుగులో చిరుత హుస్సేన్ బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి చొప్పున 9 పతకాలు సాధించారన్నా, మైఖేల్ ఫెల్ప్ నీటికొలనులో దాదాపు రెండు డజన్‌ల పతకాల పంట పండించుకున్నా, 5వేలు, 10వేల మీటర్ల పరుగులో మహమ్మద్ ఫరా రెండవసారి డబుల్ సాధించాడన్నా వారి వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఊహించుకోవాలి. మనదేశంలో క్రికెట్ పిచ్చి తప్ప అథ్లెటిక్స్ పట్ల ఆసక్తి తక్కువ. ప్రజాదరణ లేని క్రీడల్లో రాణించాలంటే ఎంతో వ్యక్తిగత పట్టుదల, కఠినశ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సరైన కోచ్ లభ్యంకావటం, మౌలిక వసతులున్న స్టేడియాలుండటం అవసరం.

పతకాలు రాకపోవటం నిరాశకు తావివ్వ కుండా, వచ్చే ఒలింపిక్స్‌లో మరో అడుగు ముందుకెళ్లాలన్న కసిని పెంచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన క్రీడా వసతులు కల్పించి ఆయా క్రీడాసంఘాలకు, క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలవాలి. క్రికెట్ ఎలాగూ వ్యాపారీకరణ పొందింది కాబట్టి అది ఇతరక్రీడల అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం నిరంతర ప్రాతిపదికపై నిధులు అందచేయాలి. కార్పొరేట్ కంపెనీలు తమ బడ్జెట్‌లో కొంత శాతాన్ని విధిగా క్రీడలకు వెచ్చించాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మరింతగా ఉద్యోగాలిచ్చి వారి జీవితానికి భరోసా ఇస్తే వారిలోనుంచి ప్రతిభులైన క్రీడాకారులేగాక ఎందరో కోచ్‌లు ఉద్భవిస్తారు. ఇదంతా ఒక ఎత్తు. క్రీడా సంస్కృతి ని పెంపొందించాలంటే స్కూలు స్థాయి నుండి క్రీడలను పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అందుకు కావలసిన కనీస వసతులను, పిఇటి లను ప్రభుత్వం నియమించాలి. వార్షిక క్రీడల్లో ప్రతిభావంతుల కొరకు స్పోర్ట్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. జాతిని క్రీడావేశం ఆవహిస్తే మట్టిలో నుంచి మాణిక్యాలు పుట్టుకొస్తాయి. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ పోటీల్లో ఇనుమడింప చేస్తాయి. అందువల్ల కావలసింది రియో ఒలింపిక్స్ దళం ప్రదర్శనను సమీక్షించటం, లోటుపాట్లను దిద్దుకోవటం, టోక్యో (2020) ఒలింపిక్స్‌కు ఇప్పటినుంచే సన్నద్ధం కావటం.