Home Default పవన్ వ్యాఖ్యలపై గరంగరం

పవన్ వ్యాఖ్యలపై గరంగరం

Chinni-Krishna

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా సినీ నటుడు పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కెసిఆర్ పాలనపై కితాబు ఇచ్చిన పవన్ ప్రస్తుతం ఎన్నికలను పురస్కరించుకొని ఇలా మాట్లాడడం సరికాదని వారు పేర్కొంటున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిపై దాడులకు పాల్పడ లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులతో పాటు హీరోలు, హీరోయిన్లు హైదరాబాద్ ప్రాంతమే సురక్షితమని గతంలో చాలాసార్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నివాసం ఉండడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కెసిఆర్‌పై ఆరోపణలు చేయని పవన్‌కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో ఇలా మాట్లాడడం సరికాదని దీనివలన ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి, భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని ఇప్పటికే నటుడు పోసాని కృష్ణమురళీ పేర్కొన్న విషయం తెలిసిందే.

ఆయన బాటలోనే మరికొంత మంది పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కెసిఆర్ తీసుకున్న పలు పథకాల వలన కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో నివసించే సెటిలర్లు సైతం లబ్ధిపొందారని వారు గుర్తు చేశారు. చివరకు మాగంటి గోపినాథ్, మాధవరం కృష్ణారావు లాంటి వారితో పాటు పలువురు సెటిలర్లకు టిఆర్‌ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి కెసిఆర్ వారిని గౌరవించారని ఈ విషయం పవన్‌కళ్యాణ్ మరిచిపోవడం హాస్యాస్పదం వారు పేర్కొంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిపై దాడి చేసినట్టు రుజువులు ఇవ్వాలని శనివారం విలేకరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్‌కు ప్రశ్నలు సంధించారు. అయినా ఇప్పటివరకు దానిపై పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడం చూస్తే ఆయన ఎన్నికల వేళ తాను లబ్ధిపొందడానికి ఇరు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహారిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. తెలంగాణ 29 రాష్ట్రాల ప్రజలకు శాంతి నిలయమని శనివారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాటలు ప్రజల్లోకి తప్పుడు సూచనలు తీసుకెళ్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విధమైన వ్యాఖ్యాలు అవాంఛనీయ ఘటనలు సృష్టించే విధంగా ఉన్నాయని కూడా పవన్‌కు కెటిఆర్ సూచించారు.

రాజకీయాల కోసం ప్రజలను విడదీయవద్దు
పవన్‌కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై ఆదివారం ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల బంధం 70 ఏళ్లుగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. తామంతా ఇక్కడ హ్యాపీగా బ్రతుకుతున్నామని మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఇండియాలోనే నెంబర్‌వన్ సిఎంగా కెసిఆర్ సుస్థిర స్థానం సాధించుకున్నారని అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని ఆయన పవన్‌కళ్యాణ్‌కు సూచించారు. రాజకీయాల కోసం ప్రజలను విడదీయవద్దని చిన్నికృష్ణ పవన్‌కు సూచించారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన ఆరోపించారు. తాను కూడా కాపు బిడ్డనేనని, పవన్ జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.
-చిన్నికృష్ణ

 film writer Chinni krishna Comments On Pawan Kalyan