Home ఆఫ్ బీట్ ఒలింపిక్స్ పతకం!!

ఒలింపిక్స్ పతకం!!

sp

అంతిమలక్షం ఒలింపిక్స్ పతకం!!
తన లక్షాన్ని దిశా నిర్దేశం చేసిన తండ్రి హఠాత్తుగా దూరమైనా… ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయక .. ఎన్నో ఆటు
పోట్లను ఎదుర్కొంటూ..అనుకున్న విజయాన్ని సాధించిందో యువ క్రీడా కారిణి. ఆమే ప్రపంచకప్ జిమ్నా స్టిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణా రెడ్డి.

కామన్వెల్త్ నుంచి ఆసియా క్రీడల వరకూ, ఆసియా చాంపియన్‌షిప్ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్ వరకు అన్నింట్లో పాల్గొంది అరుణారెడ్డి. పతకానికి దగ్గర కాకపోయినా పట్టుదలను మాత్రం వీడలేదు. ప్రపంచకప్‌లో పతకంతో మెరిసి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న క్రీడను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధస్తానంటోంది. తన లక్షం మాత్రం ఒలింపిక్ పతకం మాత్రమే అంటోంది 22 ఏళ్ల అరుణ. చార్టెడ్ అకౌంటెంట్ అయిన తండ్రి నారాయణరెడ్డి కోరిక మేరకు చిన్నతనంలోనే కరాటే నేర్చుకుంది. ఆ తర్వాత కరాటే మాస్టర్ సలహాతో జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. ఎల్బీస్టేడియంలో కోచ్‌లు స్వర్ణలత, రవీందర్, బ్రిజ్ కిశోర్ నేతృత్వంలో చాలా నేర్చుకున్నానని వినయంతో గుర్తుచేసుకుంటుంది. ప్రాథమికాంశాల నుంచి అనేక ఈవెంట్లలో పోటీపడేవరకు కష్టపడింది. ఫలితాలు అందుకుంది. సబ్‌జూనియర్ స్థాయి మొదలు ఇంటర్ యూనివర్సిటీ, సీనియర్ నేషనల్స్ వరకు వరుసగా పతకాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.అనంతరం అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన ఫలితాలు రాకపోవడంతో పెద్దగా గుర్తింపు లభించలేదనే నిరాశ మాత్రం ఆమెను వెంటాడేది.
2010లో తండ్రి మరణంతో మరింత కుంగిపోయింది. ఆటలో ప్రాక్టీస్‌కి, గేమ్స్‌కి, శిక్షణ శిబిరాలకు తండ్రే స్వయంగా తీసుకెళ్లేవాడు. ఒక్కసారిగా ఆయన్ని కోల్పోవడంతో ఇబ్బందులు పడింది. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. మానసికంగా కుంగిపోయింది. అమ్మ సుభద్ర, అక్క పావని, బావ జనార్థన్‌రెడ్డి నిరంతరం ప్రోత్సహించి అరుణలో ఆత్మవిశ్వాసాన్ని నిలిపారు. వారి ప్రోద్బలంతో ఆటలో మళ్లీ విజృంభించింది.
జాతీయ స్థాయిలో రాణిస్తూ అనేక పతకాలు గెలుచుకుంది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆమెకు అండగా నిలిచింది.ఈ క్రమంలో 2014లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడలు, 2013లో ప్రపంచ చాంపియన్‌షిప్, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లలో వరుసగా పాల్గొంది. కానీ పతకానికి చేరువకాలేకపోయింది. ఇలాంటి టోర్నీలలో పాల్గొనడం వల్ల క్రీడలో లోటుపాట్లు, నైపుణ్యం తెలుసుకునే అవకాశం లభించిందని అంటుంది. ప్రపంచ కప్ టోర్నీలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ప్రత్యేకంగా తాష్కెంట్‌లో శిక్షణ పొందింది. ఆమెకు గ్రీన్‌కో గ్రూప్‌తోపాటు వ్యాపారవేత్త, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్‌లు ఆర్థికసాయం చేశారు. వాల్ట్ ఈవెంట్‌లో అరుణ తన సహజశైలిలోనే ఆడింది. కొన్ని విన్యాసాలు కష్టంగా ఉన్నా …సాధనతో వాటిని అధిగమించి పతకం సాధించింది. తర్వాతి రోజు ఫ్లోర్ విభాగంలో బాగా ఆడినా పతకం మాత్రం దక్కించుకోలేక పోయింది. జిమ్నాస్టిక్స్‌కు ఉత్తర భారతంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ పెద్దగా గుర్తింపులేదంటూ విచారం వ్యక్తం చేస్తుంటుంది. ఇప్పటికైనా జిమ్నాస్టిక్న్ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే ఆశను వ్యక్తం చేస్తోంది అరుణ.
వచ్చే నెలలో కామన్వెల్త్ క్రీడలు, అనంతరం ఈ ఏడాదిలోనే ఆసియా క్రీడలు రానున్నాయి. వీటిలో పతకాలు గెలుచుకోవడమే తన ముందున్న ఏకైక లక్షం అంటోంది. అంతిమ లక్షం మాత్రం ఒలింపిక్స్ పతకం సాధించడమే అని తెలుపుతోంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడానికి కృషి చేస్తున్నట్లు చెబుతోంది. అదేవిధంగా కేంద్రప్రభుత్వ పథకం ‘టాప్’లో ఉండటంతో ఆర్థికపరంగా కూడా పరిస్థితి మెరుగైనట్లు చెబుతోంది.