Home తాజా వార్తలు ఫించ్ @ 172

ఫించ్ @ 172

finch

టి-20లో కొత్త రికార్డు

హరారే: ఆస్ట్రేలియా క్రికెటర్ అరొన్ ఫించ్ ట్వంటీ20 క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ట్వంటీ20 క్రికెట్‌లో 76 బంతుల్లోనే పది సిక్సర్లు, 16 ఫోర్లతో 172 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో గతంలో టి20లలో తన పేరిటే ఉన్న 156 పరుగుల రికార్డును తిరగ రాశాడు. ముక్కోణపు ట్వంటీ20 టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఆతిథ్య జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన ఫించ్ 76 బంతుల్లోనే 172 పరుగులు చేసి పెను సంచలనం సృష్టించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన ఫించ్ పరుగుల సునామీ సృష్టించాడు. అతని ధాటికి జింబాబ్వే బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అతన్ని కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మరో ఓపెనర్ షార్ట్ (46)తో కలిసి తొలి వికెట్‌కు 223 పరుగులు జోడించాడు. ఫించ్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆల్‌రౌండ్ షో అదరగొట్టిన ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.