Home జాతీయ వార్తలు ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలిపై ఎఫ్‌ఐఆర్

ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలిపై ఎఫ్‌ఐఆర్

Swati-Maliwalన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. మహిళా కమిషన్‌లో ఉద్యోగులను నియమించటంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు రావటంతో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆమెపై ఐపిసి సెక్షన్ 13(డి), 409, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎసిబి అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 85 మందిని అక్రమంగా నియమించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై సోమవారం ఆమెను ప్రశ్నించారు. మరో 27 ప్రశ్నలను ఆమెకు ఇచ్చి వాటికి వివరణ ఇవ్వాలని కోరినట్లు అధికారులు చెప్పారు. విచారణ అనంతరం స్వాతి విలేకరులతో మాట్లాడుతూ… 27 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తనకు వారం రోజులు గడువిచ్చారని తెలిపారు. ‘ఇంతమందిని ఎలా నియమించుకున్నారని వాళ్లు అడిగారన్నారు. దీని అర్థం మేము ఇంతపని ఎలా చేశామనే కదా? ఢిల్లీ మహిళా కమిషన్ 2016లో ఇప్పటివరకు 11,500 కేసులను పరిష్కరించింది. 181 హెల్ప్‌లైన్‌కు వచ్చిన 2.25లక్షల ఫోన్లు తీసుకుంది. కానీ గత అధ్యక్షురాలు తన పదవీ కాలంలో ఒక్క కేసు మాత్రమే విచారించినా పలువురు సిబ్బందిని నియమించారని విమర్శించారు.