Home అంతర్జాతీయ వార్తలు బ్రెజిల్‌లో ఘోర అగ్నిప్రమాదం

బ్రెజిల్‌లో ఘోర అగ్నిప్రమాదం

Brazilరియో: బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. రియో డిజాన‌రోలో ఉన్న ఓ ట్రైనింగ్ కాంప్లెక్స్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్లెమింగో సాక‌ర్ టీమ్ అక్క‌డ ఉంటుంది. ఈ ప్ర‌మాదంలో 10 మంది మ‌ర‌ణించారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉద‌యం 5 గంట‌ల‌కు మొద‌లైన మంట‌లు ఆరున్న‌ర వ‌ర‌కు చెల‌రేగాయి. అగ్ని ప్ర‌మాదంలో మృతి చెందిన వారందరూ యూత్ టీమ్ స‌భ్యులు అని పోలీసులు  తెలిపారు. చ‌నిపోయిన‌వారిలో ఐదుగురు 14 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఉన్నారని వారు వెల్లడించారు.  ఆటగాళ్లు  ఉండే రూమ్‌లోనే అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. శవ పరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Fire Accident at Brazil