Home తాజా వార్తలు సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident  bamboo sticks Shop  In Siddipet

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పట్టణంలోని మెదక్ రోడ్డులో గల రైతు బజార్ ముందు ఉన్న ఓ వెదురు కర్రల దుకాణంలో ఒకేసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు పక్కపక్కనే ఉన్న 8 దుకాణాలకు వ్యాపించాయి. ఇదే క్రమంలో అక్కడే ఉన్న ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి 8 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా, సుమారు రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిన్నట్టు సమాచారం. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారంతో అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయిన మంటలు అదుపులోకి రాకపోవడంతో హుస్నాబాద్, రామాయంపేటల నుండి సైతం రెండు ఫైర్ ఇంజన్లను రప్పించి సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు.

అలాగే మునిసిపల్ శాఖ నుండి వచ్చిన రెండు వాటర్ ట్యాంకర్ల సహయంతో స్థానికులు సైతం మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చి ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వందలాది సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అడిషనల్ డిసిపి గోవిందు నర్సింహారెడ్డి, ఏసిపి రామేశ్వర్, టూటౌన్ సీఐ ఆంజనేయులు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి వరకు సహయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Fire Accident  bamboo sticks Shop  In Siddipet