Home సంగారెడ్డి కంటేనర్‌లో అగ్ని ప్రమాదం

కంటేనర్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident on Lorry Container In Sangareddy
కోహిర్: రోడ్డుపై వెళుతున్న లారీ కంటెనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లారీలో ఉన్న ఫర్నిచర్ కాలి బూడిదైన సంఘటన  సోమవారం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. జెపి ట్రాన్స్‌ఫోర్టుకు చెందిన లారీ కంటేనర్ (ఎంహెచ్ జిఆర్ 6544)దిద్దేవాడ నుంచి జహీరాబాద్ మీదుగా హైద్రాబాద్ వెళుతుంది. జహీరాబాద్ పట్టణం దాటిన తరువాత లారీ కంటేనర్‌లో ప్రమాదవశాస్తు అగ్గి రాజుకుంది. లారీ కంటేనర్‌లో ఫర్నిచర్ ఉండటంతో అగ్గి కాస్త రాజుకుంటూ రాజుకుంటూ పోయింది. లారీ కంటేనర్ వెనుకాల వస్తున్న ప్రయాణీకులు విషయాన్ని గమనించి లారీ డ్రైవర్‌కు సమాచారం అందించగా అప్రమత్తుడైన లారీ డ్రైవర్ మండల పరిధిలోని చింతల్ ఘాట్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై వాహనాన్ని ఆపి చూడగా లారీ వెనుకాల అగ్ని పెద్దగా మండటం గమనించాడు. లారీలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని అక్కడకు చేరుకున్న స్థానికులు అగ్ని మాపక దళానికి సమాచారం అందించగా అగ్ని మాపక దళం వారు సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని మంటలను ఆర్పే యత్నం చేశారు. అయితే ఈ లోపే లారీలో ఉన్న సామాగ్రి కాలి బూడిదయింది. విషయం తెలుసుకున్న కోహీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి లారీలో మంటలను ఆర్పుతున్న అగ్ని మాపక దళానికి తమ వంతు సహకారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము వివరించారు.