కాఠ్మాండూ: నేపాల్ రాజధాని కాఠ్మాండూలో సోమవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కాఠ్మాండూకు వచ్చిన యూఎస్-బంగ్లా ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయి పక్కనే ఉన్న ఫుట్బాల్ మైదానంలో దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 17 మందిని సహాయక సిబ్బంది రక్షించింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.