Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

సంతలో కాల్పుల కలకలం

hyd

 నాటు తుపాకీతో గాలిలోకి కాల్పులు
ఉల్లిగడ్డలు విక్రయించే స్థలంపై వివాదం
పోలీసుల అదుపులో నిందితుడు

చర్లపల్లి : కూరగాయల సంతలో వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం తుపాకీ కాల్పులకు దారి తీసిన సంఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో జరిగింది. మాల్లాపూర్(నాచారం) పరిధిలోని మర్రిగూడకు చెందిన గజరాజుసింగ్ (50) తన తోటి వ్యాపారులను హెచ్చరించడంలో భాగంగా తుపాకీని తీసి చూపిస్తూ కాలుస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఇది గమనించిన అక్కడే ఉన్న పెట్రోలింగ్ వ్యాన్ పోలీసు అయిన చక్రపాణి అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఒక రౌండ్ కాల్పులు గాలిలో జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాప్రా మునిసిపల్ సర్కిల్ పరిధిలో నిర్వహించే వారాంతపు సంతలో గజరాజసింగ్ ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. అదే మర్రిగూడ వాసులైన శంకర్, చంద్రశేఖర్, పవన్, తులసీదాస్‌లు కూడా ఈ వారాంతపు సంతలోనే కూరగాయలను విక్రయిస్తుంటారు. అయితే, శుక్రవారం సాయంత్రం చర్లపల్లి డివిజన్‌లో జరుగుతున్న వారంతపు సంతలో తాము కూర్చునే స్థలం విషయంపై గజరాజసింగ్‌కు, ఈ నలుగురికి మధ్య వాగ్వావాదం జరిగింది. అక్కడే పైపులైన్‌ల కోసం రోడ్డుకు ఒకవైపు తవ్వకాలు జరగడంతో ఆ రోడ్డు మార్గం కుచించుకుపోయింది. అయితే నేనంటే నేనే ఈ స్థలంలో కూర్చుంటామని వీరి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తులసీదాస్, బాబు, శంకర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గజరాజు తాను ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి తిరిగి నాటు తుపాకీతో వచ్చి వాదనకు దిగినవారికి చూపిస్తూ హెచ్చరించాడు. అక్కడే ఉన్న పెట్రోల్ వ్యాన్ పోలీసు కానిస్టేబుల్ చక్రపాణిరెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో నాటు తుపాకి చేయి పైకి లేచి ఒక రౌండ్ గాలిలో కాల్పులు జరిగాయి. వెంటనే పోలీసులు గజరాజసింగ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments