Home ఆదిలాబాద్ భూ తగాదాలతో ట్రాక్టర్ కు నిప్పు

భూ తగాదాలతో ట్రాక్టర్ కు నిప్పు

Fire to the tractor with land problems

భైంసా: పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు ప్రధాన రహదారిపై ఒకరు ట్రాక్టర్‌ను దహనం చేసేందుకు నిప్పు పెట్టిన సంఘటన భైంసా పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడంతో ఏం జరుగుతుందోనని పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ గుమిగూడారు. లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామానికి చెందిన షేక్ చాంద్‌పాషాతో షేక్ మగ్దూమ్‌కు భూ తగాదాలున్నాయి. దీంతో షేక్ చాంద్ పాషా మగ్దూమ్‌కు చెందిన ట్రాక్టర్‌ను గుట్టుచప్పుడు కాకుండా యజమానికి తెలియకుండా స్వయంగా నడుపుకుంటూ భైంసా పట్టణానికి తీసుకువచ్చాడు. జన సంచారంలో సంఘటనకు పాల్పడితే తనకు న్యాయం జరుగుతుందని భావించి ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ట్రాక్టర్ కాలిపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన భైంసా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికి ట్రాక్టర్ పాక్షికంగా కాలిపోయింది. ఈ విషయమై పట్టణ పోలీసులను సంప్రదించగా భూ తగాదాతో నిప్పు పెట్టిన విషయం తెలిసిందన్నారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామన్నారు.