Home తాజా వార్తలు ఏకగ్రీవ హవా

ఏకగ్రీవ హవా

 gram panchayat election

 

మొదటి విడత ఎన్నికలు జరిగే 4,468 పంచాయతీల్లో 600కి పైగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం

ఏకగ్రీవాల్లో 90% టిఆర్‌ఎస్ మద్దతు కలిగిన వారే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి విడతలో జరిగే 4468 పంచాయతీల్లో 600కు పైగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో దాదాపు 90శాతం టిఆర్‌ఎస్ మద్దతు కలిగిన అభ్యర్థులే. ఈ నెల 7న ప్రారంభమైన తొలి విడత నామినేషన్ల ప్రక్రియలో ఉపసంహరణ గడువు ఆదివారం మధ్యా హ్నం మూడు గంటలకు పూర్తి కావడంతో ఏకగ్రీవాలపై ఒక మేరకు స్పష్టత వచ్చింది. అయితే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. పోటీ ఉన్న పంచాయతీలలో నామినేషన్లను ఉపసంహరణ చేయించేందుకు స్థానిక రాజకీయ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేసి కొన్నింటిని ఏకగ్రీవం చేయడంలో సఫలీకృతులయ్యారు. దీంతో దాదా పు అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్‌లోనే సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. మొదటి విడతలో మొత్తం 4479 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో 4468 పంచాయతీల్లోనే సర్పంచ్ పదవికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

పదకొండు పంచాయతీల్లో నామినేషన్లు వేయకపోవడం, వేసినా అవి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. అందువల్ల ఈ 11 చోట్ల ఎన్నికలు జరగడంలేదు. ఆదివారం సాయంత్రం నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 50, నిర్మల్‌లో 31, మంచిర్యాలలో 8 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సిరిసిల్లలో 13, ఖమ్మంలో 22, కొత్తగూడెంలో 19, వనపర్తిలో 15, గద్వాల జోగులాంబ జిల్లాలో 28, మెదక్‌లో 29, నల్లగొండలో 52, సూర్యాపేటలో 10, యదాద్రి భువనగిరి జిల్లాలో 21, రంగారెడ్డిలో 16, వికారాబాద్‌లో 32, మేడ్చల్‌లో 04, వరంగల్‌లో అర్బన్‌లో 10, రూరల్‌లో 51, మహబూబాబాద్ జిల్లాలో 34, భూపాలపల్లిలో 25, జనగాం జిల్లాలో 18 చొప్పున పంచాయతీలకు సర్పం చ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

అయితే నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఒకే నామినేషన్ వచ్చిన పంచాయతీల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. నర్సంపేట నియోజకవర్గంలో ఏకగ్రీవమైన సర్పంచ్‌లను స్థానిక ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి అభినందించారు. గ్రామ ప్రజల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్‌లు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కోరారు. ఇదిలా ఉండగా రెండో విడతలో 4135 పంచాయతీలకు సర్పంచ్ పదవికి, 36, 602 వార్డులకు ఆదివారంతూ నామినేషన్ దాఖలుకు గడువు ముగిసింది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 17వ తేదీ వరకు రెండో విడతకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది.

First phase 4468 panchayats unanimous in gram panchayat election