Home భద్రాద్రి కొత్తగూడెం పంచాయతీ పోరు షురూ

పంచాయతీ పోరు షురూ

first phase nominations

 

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
జిల్లాలో తొలివిడతలో 7 మండలాలు
174 పంచాయతీలు

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. జనవరి 9వ తేదీ బుధవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడతలో జిల్లాలోని ఏడు మండలాలు అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, ముల్కలపల్లి ,పాల్వంచ మండలాల్లోని 174 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమై, బుధవారం వరకు కొనసాగుతుంది. 174 గ్రామ సర్పంచ్‌లు, 1534వార్డులకు నామినేషన్లు స్వీకరించి, వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. 439 ప్రాంతాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ఇప్పటికే గుర్తించారు. ఈనెల 10న స్క్రూటిని అనంతరం చెల్లు బాటు అయిన అభ్యర్దుల వివరాలు ప్రకటిస్తారు.

ఉపసంహరణల అనంతరం 13 న రంగంలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటిస్తారు. 21 తొలి విడతకు పోలింగ్ నిర్వహించగా అదే రోజు పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు, వెంటనే విజేతలను ప్రకటిస్తారు. అప్పటికప్పుడే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. చేతులెత్తటం ద్వారా ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రిజర్వ్‌డ్ సర్పంచ్ అభ్యర్ధులు దరావతు రూ 1000, వార్డు సభ్యులు రూ. 250, జనరల్ అభ్యర్ధులైతే సర్పంచ్ అభ్యర్ధి డిపాజిట్ 2000, వార్డు సభ్యులు రూ.500 దరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయనున్నారు. అన్ని రకాలు ర్యాలి, సభలకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరి, అలాగే సర్పంచ్ అభ్యర్ధి మాత్రమే వాహనం వినియోగించవచ్చు. సభలు, ర్యాలిలు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటలవరకు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.

వీటికి పోలీసు శాఖ అనుమతి తప్పనిసరి. అయిదు వేల జనాభా మించి పంచాయతీ అయితే సర్పంచ్ అభ్యర్ధి రూ2.50లక్షలు, అయిదువేల లోపు జనాభా ఉంటే రూ 1.50లక్షలు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యులు అయిదువేల జనాభాకు మించి ఉంటే రూ 50వేలు, అయిదు వేల కంటే తక్కువ జనాభా ఉంటే రూ 30వేలు ఖర్చు చేయవచ్చు. పోటీ చేసే అభ్యర్ధులు వారి వారి ఎన్నికల ఖర్చుల వివరాలు ఆయా రటిర్నింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అవసరమైన చోట పంచాయతీ ఎన్నికల పోలింగ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తీ స్ధాయి దృష్టి కేంద్రికరిస్తారు.

first phase nominations start in Bhadradri kothagudem

Telangana Latest News