Home తాజా వార్తలు సమారానికి సై

సమారానికి సై

First Test Is Adelaide Venue Between India and Australia

 

ఆత్మవిశ్వాసంతో భారత్, ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా, నేటి నుంచి తొలి టెస్టు

అడిలైడ్: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ జట్లుగా పేరున్న భారత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సమరానికి గురువారం తెరలేవనుంది. అడిలైడ్ వేదికగా మొదటి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా కూడా గెలుపు ధీమాతో బరిలోకి దిగుతున్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. మరోవైపు ఆస్ట్రేలియాతో పోల్చితే భారత బ్యాటింగ్ బలంగా ఉంది.

విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఇక, ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ రాణించడం కూడా జట్టుకు శుభపరిణామమే. ఇక, ఆస్ట్రేలియా జట్టుకు ఈ మ్యాచ్ సవాలు వంటిదే. కీలక ఆటగాళ్లు టిమ్ పైన్, షాన్ మార్ష్, ఉస్మాన్ ఖ్వాజా, అరోన్ ఫించ్ తదితరులు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. వీరి రాణింపుపైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో మాత్రం ఆస్ట్రేలియాకు ఎదురు లేదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. మిఛెల్ స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక నాథన్ లియాన్ వంటి మ్యాచ్ విన్నర్ స్పిన్నర్ ఉండనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి భారత బ్యాట్స్‌మెన్‌కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం.

శుభారంభం దక్కాలి..
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా లోకేశ్ రాహుల్, మురళీ విజయ్‌లు బరిలోకి దిగుతున్నారు. ఇద్దరు కూడా సన్నాహక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. విజయ్ దూకుడుగా ఆడి శతకం సాధించాడు. రాహుల్ కూడా అర్ధ సెంచరీతో అలరించాడు. ఇలా ఇద్దరు కూడా ఫామ్‌లోకి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ, కొంతకాలంగా ఇద్దరు పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై సందేహం నెలకొంది. యువ ఓపెనర్ పృథ్వీషా గాయపడిన నేపథ్యంలో రాహుల్‌కు ఛాన్స్ లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. విజయ్‌తో కలిసి శుభారంభం అందిస్తే టీమిండియాకు భారీ స్కోరు కష్టమేమి కాదు. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరి పాత్ర చాలా కీలకంగా మారింది. ఇంపలో ఎంత వరకు సఫలం అవుతారనే దానిపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.

కోహ్లి జోరు సాగాలి..
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా, జట్టు ఎంత బలంగా ఉన్న పరుగుల వరద పారించడమే కోహ్లి లక్షంగా పెట్టుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం భారత్‌కు అసాధ్యమేమి కాదు. కొంతకాలంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. టెస్టులు, వన్డేల్లో అయితే అతనికి ఎదురే లేదు. సొంత గడ్డపై, విదేశి సిరీస్‌లలో సయితం సెంచరీల మోత మోగిస్తున్నాడు. కిందటిసారి ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో కూడా పరుగుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. జట్టు గెలుపోటములు కోహ్లి రాణించడంపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు కోహ్లి కూడా ఆస్ట్రేలియా గడ్డపై జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అతను విజృంభిస్తే ఆస్ట్రేలియా బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.

ఇద్దరిపైన కీలక బాధ్యత..
మరోవైపు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన కలిగే సత్తా కలిగిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు కూడా సిరీస్‌లో కీలకంగా మారారు. జట్టుకు వీరిద్దరే చాలా కీలకమనడంలో సందేహం లేదు. ఎటువంటి బౌలింగ్‌నైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా వీరికుంది. విదేశి సిరీస్‌లలో మెరుగైన ఆటతో అలరించే రహానెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా రహానె నిలకడగా రాణించలేక పోతున్నాడు. కానీ, ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. పుజారా కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పుజారా పాత్ర వేల కట్టలేనిది. రహానె, విజయ్‌లతో కలిసి ఎన్నో చిరస్మరణీయ పార్ట్‌నర్‌షిప్‌లు నమోదు చేసిన ఘనత పుజారా సొంతం. రహానె కూడా ఇలాంటి ఎన్నో భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నాడు. ఈ సిరీస్‌లో కూడా రహానె, పుజారాల నుంచి భారీ స్కోర్లను జట్టు ఆశిస్తోంది. వీరిద్దరూ రాణించడం జట్టుకు చాలా కీలకమని చెప్పాలి.

ఛాన్స్ ఎవరికో..
కాగా, ఆరో నంబర్ స్థానం కోసం హనుమ విహారి, రోహిత్ శర్మల మధ్య గట్టి పోటీ నెలకొంది. తుది జట్టులో వీరిలో ఎవరికీ చోటు లభిస్తుందో అర్ధం కావడం లేదు. ఇద్దరు కూడా 12 మంచి జాబితాలో ఉన్నారు. అయితే ఇద్దరిలో ఒకరికి మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఎవరిని ఆడిస్తారో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రోహిత్‌తో పోల్చితే విహారికే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విహారి బౌలింగ్ కూడా చేయగలడు. రవీంద్ర జడేజాను పక్కన బెట్టిన నేపథ్యంలో విహారికి ఛాన్స్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, రిషబ్ పంత్ రూపంలో మరో మెరుగైన అస్త్రం భారత్‌కు అందుబాటులో ఉంది. విండీస్‌పై సత్తా చాటిన పంత్ ఈసారి కూడా జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. అశ్విన్ కూడా బ్యాట్‌ను ఝులిపించగలవాడే. మరోవైపు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో చోటు లభించలేదు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేక పోవడంతో అతన్ని జట్టుకు ఎంపిక చేయలేదు. ఉమేశ్‌కు కూడా జట్టులో చోటు లభించలేదు. కుల్దీప్ కూడా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. ఇషాంత్ శర్మ, బుమ్రా, షమిలు జట్టుకు ఎంపికయ్యారు.

సవాలు వంటిదే..
ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు భారత్‌తో సిరీస్ సవాలు వంటిదేనని చెప్పాలి. కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. వీరు లేక పోవడం జట్టుకు పెద్ద లోటుగా చెప్పొచ్చు. కిందటి సిరీస్‌లో స్మిత్ ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. వరుస సెంచరీలతో భారత బౌలర్లను హడలెత్తించాడు. అతను లేక పోవడంతో భారత బౌలర్లకు పెద్ద ఊరట లభించింది. ఇక, ఆస్ట్రేలియా బ్యాటింగ్ భారమంత ఉస్మాన్ ఖ్వాజా, షాన్ మార్స్, అరోన్ ఫించ్‌లపై ఆధారపడింది. ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కంబ్, కెప్టెన్ టిమ్ పైన్ కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో బలహీనంగా కనిపిస్తున్న బౌలింగ్‌లో మాత్రం ఆస్ట్రేలియా చాలా పటిష్టంగా ఉందనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించే సత్తా కలిగిన స్టార్క్, కమిన్స్, లియాన్, హాజిల్‌వుడ్ జటులో ఉన్నారు. వీరు చెలరేగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం.

జట్ల వివరాలు:

భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి/రోహిత్ శర్మ, రిషబ్ పంత్, అశ్విన్, ఇషాంత్, షమి, బుమ్రా.

ఆస్ట్రేలియా: టిమ్‌పైన్ (కెప్టెన్), అరోన్ ఫించ్, మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖ్వాజా, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కంబ్, హాజిల్‌వుడ్, కమిన్స్, నాథన్ లియాన్, మిఛెల్ స్టార్క్.

First Test Is Adelaide Venue Between India and Australia

Telangana Latest News