Home తాజా వార్తలు మత్స్యకారుల కుటుంబాలకు భరోసా…

మత్స్యకారుల కుటుంబాలకు భరోసా…

 

వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న మత్స్య సమీకృత అభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖాధికారిణి రాధారోహిణి అన్నారు. వనపర్తి జిల్లా మత్స్యశాఖాఆధ్వర్యంలో జిల్లాలోని 272 చెర్వుల్లో కోట్లలో చేప విత్తనాలు వదిలామని గత ఏడాది వేసవి నుండి జిల్లాలో చేపలు పట్టడం ప్రారంభమైందని గత ఏడాది 7,954 టన్నుల చేపల ఉత్పత్తి వచ్చినట్లు జిల్లా మత్స్యశాఖాధికారిణి రాధారోహిణి తెలిపారు. జిల్లాకు ఇచ్చిన చేపల ఉత్పత్తి టార్గెట్ చేరుకుంటామని ఇప్పటివరకు కేవలం 50 చెరువుల్లో చేపలు పడితే టార్గెట్‌లో 75 శాతం పూర్తి చేశామని 25 శాతం మిగతా చెర్వుల్లో చేపలు పడితే టార్గెట్ కు మించి చేపల ఉత్పత్తి సాధిస్తామని రాధారోహిణి తెలిపారు.

మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపవిత్తనాల పంపిణీ పథకం సత్పలితాలనిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 272 చెర్వుల్లో 1.49 కోట్ల చేప విత్తనాలను వదిలామని తెలిపారు. ఇందుకు గాను రూ. 1.96 కోట్ల నిధులు ఖర్చు చేశారు. నాడు వేసిన విత్తనం నేడు ఫలాలు అందిస్తుందని తెలిపారు. ఒక్క చేప 5 కిలోల నుండి 10 కిలోల బరువు ఉంటుందన్నారు. బంగారు తీగ, బొచ్చల రకాల చేపలు పుష్టిగా తయారయ్యాయి. ఇటీవల గోపాల్‌పేట మండల పరిధిలోని తాడిపర్తి గ్రామ శివారులో గల లక్ష్మీసముద్రంలో పట్టిన చేపలను ఆమె పరిశీలించారు. మంగళవారం జిల్లా మత్స్యశాఖాధికారిణి రాధారోహిణి మన తెలంగాణ తో మాట్లాడుతూ… జిల్లాలో పట్టిన చేపలను మత్స్యకారులు ఎక్కు వగా సుమారు 60 శాతం చేపలను హైద్రాబాద్, కర్నూల్, మహబూబ్‌నగర్, తదితర నగరాల్లోని మార్కెట్ లకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

వనపర్తి జిల్లాలో 108 మత్స్యపారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. వాటిలో 7వేల మంది సభ్యులు ఉన్నారు. 9 మహిళా పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. 800 మంది మహిళలు ఉన్నారు. రెండు మార్కెటింగ్ సంఘాల్లో 430 మంది సభ్యులు ఉన్నారు. వీరు చేపలకు ఆయా మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి అక్కడి కి తరలించి అధిక ధరకు విక్రయిస్తారు. వీరు చేపలను అధిక ధరలకు విక్రయిస్తారని ఆమె తెలిపారు.

సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లాలో మత్స్యశాఖా ద్వారా ఇచ్చిన వాహనాలను పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో వినియోగిస్తే అలాంటి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని జిల్లా మత్స శాఖాధికారిణి రాధారోహిణి తెలిపారు. గత ఏడాది సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్య కారు లకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సంచార చేపల విక్రయాలకు గాను వాహనాలను అందించ డం జరిగిందని తెలి పారు.

ఈ వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదని ఆదేశించారు. ఒక వేళ వాహనాలను వినియోగిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను జప్తు చేసుకుంటామని హెచ్చరించారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతోపాటు సహకార సంఘం నుండి వ్యక్తుల సభ్యత్వం రద్దు చేసి సంఘం నుండి తొలగిస్తు వాహ నాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరిం చారు. మత్స్య కారులు వాహనాలను సద్వి నియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సబ్సిడి వాహనాలను వినియోగించు కొని అభివృద్ధి లోకి రావాలని సూచించారు.

Fisheries Integrated Development Program