Home తాజా వార్తలు సచివాలయం బ్లాకులపై కేంద్రానికి ఫిర్యాదు

సచివాలయం బ్లాకులపై కేంద్రానికి ఫిర్యాదు

 Five blocks allotted to the state of Andhra Pradesh

మన తెలంగాణ / హైదరాబాద్ : నగరంలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐదు బ్లాకులు చాలా కాలంగా ఖాళీగానే ఉండిపోయాయని, కనీస మరమ్మత్తులు, నిర్వహణకు నోచుకోకపోవడంతో భవనాలు పాడైపోతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన గత శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం (హోం వ్యవహారాలు) సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకూ హైదరాబాద్ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అన్ని శాఖలనూ అమరావతికి తరలించడంతో వారికి సచివాలయంలో కేటాయించిన ఐదు బ్లాకులు ఖాళీగానే ఉన్నాయని, ఆ రాష్ట్రం వాడుకోవడంలేదని, కొన్ని గదులను మాత్రమే వాడుకుంటూ ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా సచివాలయంలోని మొత్తం పది బ్లాకుల్లో ‘జి బ్లాకు’ వారసత్వ భవనం కావడంతో నాలుగు బ్లాకులను తెలంగాణ (ఎ,బి,సి,డి), మిగిలినవాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకునేలా కేటాయింపు జరిగింది.

సుమారు పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో సుమారు 15.21 ఎకరాల విస్తీర్ణం కలిగిన 5.31 లక్షల చ.అ.లతో కూడిన ఐదు బ్లాకులను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలా విభజన జరిగింది. అయితే గతేడాది తన పరిపాలనను అమరావతి నుంచి నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ఐదు బ్లాకుల్లో ఉన్న మంత్రిత్వశాఖలు, విభాగాలు అక్కడకు వెళ్ళిపోయాయి. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం, ‘విభజన కమిటీ’ తదితర రెండు మూడు విభాగాలు మాత్రమే పదిలోపు గదుల్లో ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వివరించిన తెలంగాణ ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న, నిర్వహణకు నోచుకోకుండా ఉన్న భవనాలను తెలంగాణ పరిపాలనా అవసరాలకు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన పార్లమెంటరీ కమిటీ, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ బ్లాకులను వాడుకోడానికి ఎలాంటి వివాదమూ లేదని, అయితే వినియోగించకుండా పడావుగా ఉంచడానికి బదులుగా తెలంగాణకు ఇవ్వడమే మేలైన నిర్ణయంగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని ఆ భవనాలు పాడుకాకుండా ఉండేలా చొరవ తీసుకోవాలని హోంశాఖ అధికారులకు స్పష్టం చేసింది.
ఎపి అధికారుల క్వార్టర్లదీ అదే పరిస్థితి
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నగరంలో ఉన్న ఐఏఎస్ తదితర ఉన్నతాధికారుల నివాసం నిమిత్తం నిర్మాణమైన క్వార్టర్లలో కూడా ఏపీ అధికారులు నివాసం ఉండకపోవడంతో చాలా ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు తెలంగాణ అధికారులకు తగిన నివాస వసతి లేక ప్రైవేటు అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని ఉండాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధాన కార్యదర్శి జోషి నగరంలోని ఎర్రమంజిల్, బంజారాహిల్స్, కుందన్‌బాగ్, పంజాగుట్ట, పాటిగడ్డ, సైఫాబాద్, మాదన్నపేట, కాలడేరా, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ నివాస గృహాల్లో ఖాళీగా ఉండిపోయినవాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరి, కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ భవనాలకు కనీసమైన నిర్వహణ కూడా లేకపోవడంతో చెడిపోతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 586 ఇళ్ళను కేటాయించగా, ప్రస్తుతం 368 ఖాళీగానే ఉన్నాయి.

ఏపీ అధికారులు అమరావతికి వెళ్ళిపోవడంతో ఇవి ఖాళీగా ఉండి ఆలనాపాలనా కరువైంది. పిచ్చిమొక్కలు పెరిగిపోయి చాలాచోట్ల డ్రైనేజీ పైపులకు ఆటంకం కలిగి నిత్యం మురుగు చేరుకుంటూ ఉంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. మరమ్మత్తుపై శ్రద్ధ పెట్టకపోగా కనీసమైన నిధులను కూడా విడుదల చేయడంలేదు. కొన్ని ఇళ్ళకు, భవనాలకు విద్యుత్, కరెంటు బిల్లుల్ని కూడా చెల్లించడంలేదు. ఆవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉండడంతో తెలంగాణ ఎస్టేట్ ఆఫీసర్ సైతం తగిన చొరవ చూపలేకపోతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ చిదంబరం ‘ఈ భవనాలు కేవలం వారు వినియోగించుకోడానికి, పాలనాపరమైన అవసరాల కోసం కేటాయించబడ్డవే. వాటిని వాడుకోకున్నా అవి తమ అధీనంలోనే ఉండిపోతాయి అనే ప్రాతిపదికన మరో రాష్ట్రానికి స్వాధీనం చేయకుండా తాళాలు వేసి ఖాళీగా ఉంచడం మంచిది కాదు’ అని అభిప్రాపయడ్డారు.
ఈ వివరాలను లోతుగా అధ్యయనం చేసి ఈ నెలాఖరుకే కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన సిఫారసులతో కూడిన నివేదికను అందజేస్తామని కమిటీ ఆ సమావేశం సందర్భంగా ప్రకటించింది.