Home ఖమ్మం ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Five cyber criminals arrested

ఖమ్మం క్రైం: ఐదుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి తఫ్సీర్ ఇక్బాల్ వివరాలు వెల్లడించారు. కడపకు చెందిన ఐదుగురు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్‌లో దిగారు. ద్విచక్రవాహనం కొనుగోలు చేసేందుకు ఆ పరిసరాల్లో సంచరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉండడంతో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వేర్వేరు విచారణలో వారు సైబర్ నేరాలకు పాల్పడినట్టు అంగీకరించారు. వీరు కొంతకాలం క్రితం బతుకు దెరువు కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఓ కాల్ సెంటర్‌లో యజమాని సూచనలతో ఫోన్‌లో సమాచారం తెలుసుకోవడం ప్రారంభించారు. కాల్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఎటిఎం కార్డు పిన్, సివివి, ఒటిపి వంటివి తెలుసుకుని యజమానికి ఇచ్చేవారు. డబ్బులు ఎక్కువ ఇవ్వడంతో దీనిపై వీరికి ఆసక్తి పెరిగింది. కొంతకాలం తర్వాత స్వత్తగా వీళ్లే మోసం చేయడం ప్రారంభించారు. అదే విధంగా పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీల పేరుతో కాల్‌ చేసి రూ.25000 – 30000 విలువైన వస్తువు రూ.3000కే వస్తుందని నమ్మించేవారు. అందులో చెత్త, ఇటుకలు వంటివి వేసి పంపేవారు. మళ్లీ వాళ్లు కాల్‌ చేసి అడిగితే బ్యాంక్ వివరాలు చెప్పండి డబ్బులు పంపిస్తామని నమ్మించేవారు. సివివి, ఒటిపి అన్ని చెప్పిన తర్వాత సొమ్ము కాజేసేవారు. ఆ డబ్బులను మొబిక్విక్, పేటిఎం, పాయు, ఆక్సిజన్, ఎయిర్టెల్/ ఐడియా మనీ, ఓలా తదితర వాటిలోకి బదలాయించే వారు. తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ లేదా బ్యాంక్ అకౌంట్‌లోకి టాన్సర్ చేసుకునేవారు.

ఎనిమిది కేసుల్లో…
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఎనిమిది నేరాలకు పాల్పడ్డారు. ఖమ్మం త్రీటౌన్‌లో మూడు, వన్‌టౌన్‌లో రెండు, సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒక కేసు నమోదయ్యాయి. నిందితులు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ముల్లింటి సలీం మాలిక్, మైలవరం మండలం బెస్తవేముల గ్రామానికి చెందిన దండి వేణు గోపాల్, జమ్మలమడుగు మండలం వెంకటేశ్వర కాలనీకి చెందిన నారాయణ పల్లి అబ్దుల్, ముద్దనూరు మండలం కలవలి గ్రామానికి చెందిన బట్టు రామాంజనేయులు, మైలవరం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన బడిగించాల మనోహర్‌లను రిమాండ్ చేశారు. మొత్తం ఎనిమిది కేసుల్లో ఐదు కేసులకు సంబంధించి రూ.లక్షా ఏడు వేలు బాధితుల అకౌంట్ జమ చేయించారు. వీరి నుంచి నగదు రూ.లక్షా నాలుగు వేలు, పది సెల్‌ ఫోన్లు (రూ.1,39,000), 15 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రిఫండ్ అయిన రూ. లక్షా ఏడు వేలతో సహా మొత్తం రూ.3.5 లక్షలు. ఈ ఆపరేషన్ ఖమ్మం టౌన్ ఎసిపి గంటా వెంకటరావు పర్యవేక్షణలో ఖమ్మం త్రీ టౌన్ సిఐ వెంకన్నబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఎస్‌ఐలు మహేష్, చంద్ర మోహన్, ఎఎస్‌ఐ అమీర్ ఆలీ, సిబ్బంది కోటేశ్వరరావు, రాజు, సురేష్, ఖలీద్‌లు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వీరిని సిపి క్యాష్ అవార్డుతోపాటు ప్రత్యేక మెమోంటోతో అభినందించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్ కుమార్, ఖమ్మం టౌన్ ఎసిపి గంటా వెంకటరావు, త్రీటౌన్ సిఐ యు.వెంకన్నబాబు పాల్గొన్నారు.

తస్మాత్ జాగ్రత్త…
బ్యాంకు అధికారులమంటూ ప్రజలకు ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని సిపి తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. విలేకరులతో సిపి మాట్లాడుతూ… సైబర్ నేరస్తులు ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి ప్రజలకు ఫోన్‌చేసి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వొద్దని సూచించారు. ముఖ్యంగా సివివి, ఒటిపి, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ సంబంధిత వివరాలు తెలపొద్దని చెప్పారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే యుఆర్‌ఎల్ లింక్‌ను ఓపెన్ చేయ్యొద్దని పేర్కొన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయ్యొద్దని సూచించారు.