Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కోనేరులో పడి ఐదుగురు హైదరాబాదీల మృతి

కార్తీక పౌర్ణమి పూజల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు…

Stateగోషామహల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కర్నాటక రాష్ట్రం బళ్లారిలోని ఆలయానికి వెళ్లిన నగరానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ వాసులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతిచెందారు. ఈ ఘటనలో కోఠి బడీచౌడీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నీటిలో మునిగి దుర్మరణం చెందడంతో బడీచౌడీ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుల బంధువులు, స్థానికుల కథనం ప్రకారం… కోఠి బడీచౌడీలో కూరగాయల మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ జీవనం సాగించే ప్రకాష్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పూజల కోసం 4 రోజుల క్రితం తన భార్య, ముగ్గురు కూతుళ్లు అయిన ప్రవల్లిక(17), పవిత్ర(15), పావని(13)లతో కలిసి కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని గంగావతికి వెళ్లారు. పౌర్ణమి రోజున పూజలు చేసిన ప్రకాష్ కుటుం బ సభ్యులు సోమవారం సమీపంలోని నదిలో స్నానానికి వెళ్లారు. ముందుగా స్నానం చేసేందుకు వెళ్లిన ప్రవల్లిక నీటిలోని ఊబిలోకి కూరుకుపోయింది. దీంతో ఆమెను రక్షించేందుకు వెళ్లిన పవిత్ర, పావనిలతో పాటు బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆశీష్, రాఘవేందర్‌లు సైతం నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటనలో కోఠి బడీచౌడీ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు దుర్మరణం చెందారన్న వార్త బడీచౌడీ వాసులను తీవ్రంగా కలచివేసింది. కోఠి బడీచౌడీలో గత కొంత కాలంగా ప్రకాష్ అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తూ వ్యాపారులు, స్థానికులతో ఎంతో కలుపుగోలుగా ఉండేవారని, ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు కూతుళ్లు ఒకేసారి మృతిచెందడం పట్ల వారు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వీరి మృతదేహాలు నగరానికి చేరుకోవ చ్చని ప్రకాష్ బంధువు ప్రదీప్ పేర్కొన్నారు.కాగా మరణించిన వారిలో ప్రవల్లిక స్థానికంగా డిగ్రీ చదువుతుండగా, పవిత్ర ఇంటర్మీడియట్,పావని పదో తరగతి చదుతున్నారు.
బడీచౌడీలో విషాదఛాయలు : ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి వార్తతో కోఠి బడీచౌడీలో విషాదఛాయలు అలమున్నాయి. ఒకేసారి ముగ్గురు అమ్మాయిలు మృతిచెందడం పట్ల వారు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురు అమ్మాయిల స్నేహితులతో పాటు స్థానికులు వారితో తమకు గల సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. ప్ర వల్లిక, పవిత్ర, పావనిలు మరణించారన్న విషయం తెలుసుకున్న ప్రకాష్ బంధువులు బడీచౌడీలోని అతని ఇంటికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.

Comments

comments