Home ఎడిటోరియల్ మళ్ళీ పడగవిప్పిన ఉల్ఫా

మళ్ళీ పడగవిప్పిన ఉల్ఫా

Five killed in terrorist attack in Tinsukia in Assam

అస్సాంలోని టిన్సుకియాలో ఉగ్రవాద దాడిలో ఐదుగురు మరణించారు. ఈ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉల్ఫాయే ఈ దాడులకు పాల్పడిందని బలమైన అనుమానాలున్నాయి. ఉల్ఫాపై నిషేధం ఉంది. 1990 నుంచి ఉల్ఫా నిషిద్ధ సంస్థల జాబితాలో ఉంది. గత కొంతకాలంగా ఉల్ఫా దాడులకు పాల్పడవచ్చన్న భయాలు కూడా చాలా మంది వెలిబుచ్చారు. ముఖ్యంగా ఉల్ఫా నాయకుడు పరేష్ బారువా కార్యకర్తలకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సందేశం పంపాడు. ఈ విషయం నిఘా సంస్థలు పసిగట్టాయి. దాడులు భద్రతా దళాలపై కానీ, లేదా అస్సాంలోని అస్సామేతర ప్రజలపై కాని దాడులు జరగవచ్చని భయపడ్డారు. అనుకున్నట్లే దాడి జరిగింది.

ఈ దాడులకు ఉల్ఫాయే కారణమని పోలీసులు అంటున్నారు. ఉల్ఫా ఈ ఆరోపణలను ఖండించింది. తాము ఈ దాడి చేయలేదని ప్రకటన విడుదల చేశారు. అస్సాంలో బెంగాలీ హిందువులపై ఉల్ఫా ఇంతకు ముందు దాడులు చేయలేదు. అస్సాంలో ఎనభైలలో ఉల్ఫా చాలా చురుకుగా ఉండేది. అప్పట్లో కూడా ఎన్నడూ బెంగాలీ హిందువులపై దాడులు చేయలేదు. 1986లో యునైటెడ్ మైనారిటీస్ ఫ్రంట్ చైర్మన్ కాళీపాద సేన్‌పై దాడి జరిగింది. గౌహతీలో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇలాంటి సంఘటనలు అడపాదడపా కొన్ని జరిగినప్పటికీ ఉల్ఫా బెంగాలీ హిందువులపై దాడులు చేసిన ఘటనలు చాలా చాలా అరుదు. అప్పట్లో ఉల్ఫా అస్సాంలో సమాంతర ప్రభుత్వం నడిపే స్థాయిలో ఉండేది. ఇప్పుడు బెంగాలీ హిందువులను, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో విచక్షణ లేకుండా దాడులు చేసినట్లు తెలుస్తోంది.

1979 ఏప్రిల్ 7వ తేదీన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, క్లుప్తంగా ఉల్ఫా ఏర్పడింది. ఇది వేర్పాటువాద సంస్థ. పరేష్ బారువా, అరబిండ రాజ్ ఖోవా తదితరులు స్థాపించారు. ఎనభైలలో, తొంభయిలలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉల్ఫా అరాచకం సృష్టించింది. అమానుష హింసాకాండలు చోటు చేసుకున్నాయి. భారత ప్రభుత్వం ఉల్ఫాను టెర్రరిస్టు సంస్థల జాబితాలో చేర్చి 1990లో నిషేధించింది. చైనా నుంచి ఈ సంస్థకు అవసరమైన సహకారం లభిస్తుందని ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్‌లలో కూడా శిబిరాలు నడిపేది. కాని భారత ప్రభుత్వ ప్రయత్నాల వల్ల ఈ దేశాల్లో ఉల్ఫాకు చుక్కెదురైంది.

అస్సాంలో ఉల్ఫా క్రమేణా పట్టుకోల్పోయింది. ఆ తర్వాత ఈ సంస్థ పేరు కూడా చాలా కాలంగా వినబడలేదు. ఇప్పుడు నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్, సిటిజన్ షిప్ బిల్లులు నేపథ్యంలో ఉల్ఫా మరోసారి ఉనికిలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈ దాడులు. అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో సిటిజన్ షిప్ బిల్ 2016కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోను నిరసన వెల్లువెత్తుతోంది. ఈ పరిస్థితులు ఉల్ఫా తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ బిల్లు ప్రకారం పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర ప్రవాసులకు పౌరసత్వం లభిస్తుంది. ఈ బిల్లు పట్ల అస్సాంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారా లేదా అన్నది కూడా ఇప్పటి వరకు తెలియదు. కాని కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో పాలనా యంత్రాంగానికి పౌరసత్వ నమోదుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రయిస్తవులను భారతపౌరులుగా నమోదు చేయాలని జారీ చేసిన ఉత్తర్వులివి. ఈ ఉత్తర్వుల తర్వాత బ్రహ్మపుత్ర లోయలో బెంగాలీ హిందువుల జనాభా పెరిగిపోతుందన్న అనుమానాలు పెరిగాయి. ఈ ప్రవాసులకు విదేశీయుల చట్టం 1946లోను, పాస్‌పోర్టు చట్టం 1920లోను మినహాయింపులు కూడా ప్రభుత్వం ఇంతకు ముందు రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇవన్నీ అస్సాంలో ఆందోళనలకు కారణమయ్యాయి.

ఉల్ఫాలోనే పనిచేసే థో ముంగ్ అలియాస్ భాస్కర్ బోరా భారత నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నాడన్న ఆరోపణతో ఉల్ఫా నిర్బంధించింది. దీనికి సంబంధించి పత్రికలకు సమాచారాన్ని కూడా ఉల్ఫా పంపించింది. భారత నిఘా సంస్థలను అస్సాంలో అడ్డుకోడానికి ఉల్ఫా చేస్తున్న ప్రయత్నాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు జరిగిన దాడి కూడా ఇంటిలిజన్స్ సంస్థలకు హెచ్చరిక జారీ చేయడం వంటిదేనని కొందరు భావిస్తున్నారు. అస్సాంలో భారీగా భద్రతాదళాలున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లున్నాయి. కాని ఇప్పుడు టిన్సుకియా తదితర ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా ఉల్ఫా రిక్రూట్‌మెంట్లు పెద్దస్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, డేరాగాంవ్ యూనిట్ ఉపాధ్యక్షుడు పంకజ్ ప్రతీమ్ దత్తా ఉల్ఫాలో చేరిన వార్తలు వచ్చాయి. ఒక వీడియోలో ఆయన ఉల్ఫాలో చేరడాన్ని సమర్ధించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఉల్ఫా నాయకత్వం బలంగా లేదన్న సమాచారం కూడా ఉంది. ఉల్ఫా నాయకుడు పరేష్ బారువా తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నాడని, ఇటీవల చైనాలోని యునాన్ ప్రాంతం లో, రూయిలీ వద్ద ఆయనకు ప్రమాదం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన నాయకత్వం బలహీనమవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. తన నాయకత్వం గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, లేదా ఉల్ఫా ఉనికిని చాటి చెప్పాలనుకున్నప్పుడు బారువా ఇలాంటి దాడులు ఇంతకు ముందు కూడా చేయించడానికి పలువురు విశ్లేషిస్తున్నారు.

అస్సాంలో నిన్నటి వరకు ఎన్నార్సీపై విమర్శలు, ప్రతివిమర్శలు, నిరసనలు కొనసాగాయి. ఎన్నార్సీలో చోటు దొరకని 40 లక్షల మందికి మళ్ళీ దరఖాస్తు చేసుకుని పేరు నమోదు చేయించుకునే అవకాశం కల్పించారు. ఆ వెంటనే పౌరసత్వం సవరణల బిల్లు అస్సాంలో కొత్త ఆందోళనలకు కారణమైంది. ఒక్క అస్సాం మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాలన్నింటా ఆందోళనలకు కొనసాగుతున్నాయి. అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నిరసనలు జరుగుతున్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ధర్నాలతో హోరెత్తిస్తోంది. ఈ పరిస్థితులను ఉల్ఫా ఇప్పుడు తనకు అనుకూలంగా మలచుకోడానికి, అస్సాంలో మరోసారి తలెత్తడానికి ప్రయత్నాలు చే స్తోంది. ముఖ్యంగా బెంగాలీ హిందువులు ఉన్న ప్రాంతాల్లో విద్వేషా న్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవాలని చూ స్తోంది. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను నిశితంగా పరిశీలించవలసి ఉంది. ఈ ఉగ్రవాద సంస్థకు మళ్ళీ తలెత్తే అవకాశాలు ఇవ్వరాదు.

                                                                                                                                    –  రాజీవ్ భట్టాచార్య (ఫస్ట్ పోసట్ల్)

Five killed in terrorist attack in Tinsukia in Assam

Telangana Latest News