Home స్కోర్ ఇద్దరే కీలకం..

ఇద్దరే కీలకం..

five match against England, India's hopes on two cricketers

అందరి కళ్లు రహానె, పుజారాలపైనే

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఆశలన్నీ ఇద్దరు క్రికెటర్లపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. వారే స్టార్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు. విదేశి పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లుగా వీరికి పేరుంది. ఇద్దరు కూడా టెస్టుల్లో భారత్‌కు చాలా కీలకం. ఇక, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో కూడా ఇద్దరు జట్టుకు కీలకంగా మారారు. ఇంగ్లండ్ గడ్డపై వీరిద్దరి ప్రదర్శనపైనే భారత్ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఇద్దరు టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరికి కూడా విదేశి గడ్డపై మంచి రికార్డే ఉంది. ఈ సిరీస్‌లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఇద్దరు ఉన్నారు. చాలా కాలంగా టెస్టుల్లో ఇద్దరు జట్టుకు ప్రధాన అస్త్రాలుగా నిలుస్తున్నారు. ఈసారి కూడా ఇద్దరిపైనే జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన ఇచ్చే సత్తా వీరికుంది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా తమపై పెట్టుకున్న ఆశలను నిలబెట్టాలనే ఉద్దేశంతో రహానె, పుజారాలు ఉన్నారు. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరితే ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసే బాధ్యతను తీసుకోవడం పుజారారహానెలకు వెన్నతో పెట్టిన విద్య. ఇంగ్లండ్ గడ్డపై కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఇద్దరు ఉన్నారు. సాధారణంగా రహానె విదేశి పిచ్‌లపై మెరుగ్గా ఆడతాడనడంలో సందేహం లేదు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. రహానె రాణిస్తే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక కౌంటీ క్రికెట్ ఆడడం పుజారాకు కలిసి వచ్చే అంశం. కొంతకాలం వరకు పుజారా కౌంటీ క్రికెట్‌ను ఆడాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో ఇది పుజారాకు ఎంతో ఉపయోగపడే అంశమని చెప్పొచ్చు. వన్‌డౌన్‌లో వచ్చే పుజారా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొవడం ఖాయం. ఇక, మిడిలార్డర్‌లో సమర్థంగా రాణించే సత్తా రహానె సొంతం. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అందరి కళ్లు వీరిద్దరిపైనే నిలుస్తాయనడంలో సందేహం లేదు.

సిరీస్ గెలిస్తే రికార్డే…
ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు టెస్టుల్లో పేలవమైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఆడుతున్న భారత్ రికార్డు అంతంత మాత్రమే. ఇంగ్లండ్ గడ్డపై కేవలం ముగ్గురి సారథ్యంలోనే భారత్ టెస్టు సిరీస్‌లు గెలుచుకుంది. అజిత్ వాడేకర్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రవిడ్‌ల సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. ఇక, ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిల సారథ్యంలో కూడా భారత్ ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవలేక పోయింది. అయితే తాజాగా విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ ఇక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత్‌కే మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా కోహ్లి కెప్టెన్సీలో భారత్ స్వదేశంలో, విదేశాల్లో నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై కూడా సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో కోహ్లి సేన ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా చాలా బలంగా ఉంది. శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, విరాట్ కోహ్లి, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. ఈ సిరీస్‌లో వీరంత రాణిస్తే బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, అశ్విన్, జడేజా, కుల్దీప్‌లతో కూడా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉండచే ఉంది. వీరింత ఇంగ్లండ్ గడ్డపై మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కోహ్లి సారథ్యంలో టెస్టు సిరీస్‌ను గెలవడం భారత్‌కు కష్టమేమి కాదని చెప్పాలి.

మూడు సార్లే…
ఇంగ్లండ్ గడ్డపై భారత్ మూడుసార్లు మాత్రమే టెస్టు సిరీస్‌లను సాధించింది. ఇంగ్లండ్‌లో తొలిసారిగా అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో భారత్ టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు ఇదే మొదటి సిరీస్. ఇక, 1986లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత్ రెండోసారి టెస్టు సిరీస్‌ను సాధించింది. భారత్‌కు ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా కపిల్ నిలిచాడు. ఇక, చివరి సారిగా భారత్ 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను సాధించింది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత్ దీన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ భారత్ ఒక్కసారి కూడా ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకోలేదు. ఇక, 2014 ఇంగ్లండ్ పర్యటనలో భారత్ అవమానకర రీతిలో ఓటమి చవిచూసింది. ధోని సారథ్యంలోని భారత జట్టు ఈ సిరీస్‌లో చిత్తుగా ఓడి పోయింది. అయితే ఈసారి కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించడం ఖాయమని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా బలంగా ఉన్న భారత్‌కు సిరీస్ గెలవడం కష్టం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక, తమపై ఉంచిన నమ్మకాన్ని కోహ్లి సేన నెరవెరుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సింది. కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఆగస్టు ఒకటిన తెరలేవనుంది.