Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

kashmir

మృతుల్లో ఒకరు వర్శిటీ ప్రొఫెసర్
ఐదుగురు పౌరులు దుర్మరణం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్‌సహా ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ పోరులో ఐదుగురు పౌరులు కూడా మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. షోపియాన్ జిల్లాలోని బడీగామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు వారిని చుట్టుముట్టి, లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినట్టు శ్రీనగర్ పోలీస్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. కానీ, వారు కాల్పులకు తెగబడ్డారని, దీనితో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. ఛత్తాబల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చిన 24 గంటల్లోపే మరో భారీ ఎదురుకాల్పుల సంఘట చోటు చేసుకోవడం గమనార్హం. ఉగ్రవాదుల సమాచారం తెలిసిన వెంటనే భద్రతా దళాలు బడీగామ్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బలగాలు చుట్టుముట్టడంతో, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. లొంగిపోవాలని ఎంతగా చెప్పినా వారు వినిపించుకోవకపోవడంతో, భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాల్సి వచ్చింది. ఈ సంఘటనలో హిజుబుల్ ముజాహిదీన్ కమాండర్ సద్దాం పద్దెర్, కశ్మీర్ యూనివర్శిటీలో అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ మహమ్మద్ రఫీ భట్ ఉన్నారు. మృతి చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులను తౌసీఫ్ షేక్, అదిల్ మాలిక్, బిలాల్ అలియాస్ మోల్వీగా గుర్తించారు. వీరంతా దక్షిణ కశ్మీర్ ప్రాంతవాసులని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.పి. పనీ తెలిపారు. ఉగ్రవాద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రొఫెసర్ రఫీ భట్‌ను కోరినప్పటికీ వినిపించుకోలేదని అన్నారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక జావాను గాయపడ్డారని పేర్కొన్నారు.
రాళ్లదాడి : భద్రతాదళాలపై కొంత మంది అలరి మూకలు రాళ్లదాడికి దిగారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు, అధికారులు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రఫీ భట్ కూడా మృతి చెందడంలో, కశ్మీర్ యూనివర్శిటీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందఘనను కూడా ఎదురుకాల్పుల ఫలితమేనని అనుమానిస్తున్న స్థానికులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, భద్రతా బలగాలపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వుతూ, కనిపించిన వాహనాలకు నిప్పంటిస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని చెరదగొట్టడానికి పోలీస్ దశాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాగా, దక్షిణ కశ్మీర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

నాన్నా.. నన్ను క్షమించు
తండ్రికి ఉగ్రవాదిగా మారిన ప్రొఫెసర్ ఫోన్

 ‘నాన్నా నన్ను క్షమించు.. మిమ్మల్ని కష్టపెట్టివుంటే క్షంతవ్యుడ్ని’ అంటూ సోషియాలజీలో పిహెచ్‌డి చేసి, కశ్మీర్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తన కుమారుడు రఫీ భట్ ఫోన్‌చేసి చెప్పడంతో ఫయాజ్ అహ్మద్ భట్ నివ్వెరపోయాడు. అదే తనకు రఫీ భట్ నుంచి చివరి కాల్ అవుతుందని ఎన్నడూ ఊహించలేదని ఫయాజ్ వాపోయాడు. కశ్మీర్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 33 ఏళ్ల రఫీ భట్ మూడు రోజుల క్రితం నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజుబుల్ ముజాహిదీన్‌లో చేరినట్టు సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఫయాజ్‌ను సంప్రదించారు. రఫీ భట్‌కు నచ్చచెప్పి, ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని సూచించారు. అంతకు ముందే తన కుమారుడి నుంచి ఫొన్ కాల్ రావడంతో ఆందోళనకు గురైన ఫయాజ్ వెంటనే స్పందించాడు. తన భార్య, కుమార్తె, కోడల్ని వెంటతీసుకొని బడీగామ్‌కు వెళ్లాడు. అయితే, వీరు అక్కడికి చేరక ముందే ఎదురుకాల్పుల్లో రఫీ భట్ మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు. మూడు రోజుల క్రితం, శుక్రవారం యూనివర్శిటీకి వెళ్లిన రఫీ భట్ ఇంటికి తిరిగి రాలేదని, అతని కోసం వెతుకుతున్న సమయంలోనే, తనకు ఫోన్‌కాల్ వచ్చిందని ఫయాజ్ అన్నాడు. తన కుమారుడు ఆయుధం పట్టుకొని దాడులకు తెగబడతాడనిగానీ తాను ఊహించలేదని రోదిస్తూ చెప్పాడు.