Search
Sunday 23 September 2018
  • :
  • :

మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం

accident

97 మందికి గాయాలు

దురంగో: మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని ప్రయాణికులందరూ ప్రాణాలతో బైటపడ్డారు. విమానంలో నలుగురు సిబ్బంది సహా 101 మంది ఉండగా అందులో దాదాపు 97 మంది గాయపడ్డారు. అయితే వీరిలో చాలా మందికి స్వల్పగాయాలే అయ్యాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఏరో మెక్సికోకు చెందిన విమానం దురంగోనుంచి మెక్సికో నగరానికి వెళ్లడం కోసం  టేసం అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. క్రాష్ లాండింగ్ అయిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలోనే విమానాన్ని దింపేశారు. ఆ సమయంలో భారీ వడగళ్ల వాన పడుతూ ఉందని అధికారులు తెలిపారు. విమానం మంటల్లో చిక్కుకున్నప్పటికీ అందులోని వారంతా ప్రాణాలతో బైటపడ్డారు. విమానంలో 88 మంది పెద్దవాళ్లు, ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని మెక్సికో రవాణా శాఖ మంత్రి గెరార్డో రూయిజ్ స్పష్టం చేశారు. గాయపడిన వారిలో 49 మందిని ఆస్పత్రిలో చేర్చారని, వీరిలో ఇద్దరికి మాత్రం తీవ్రగాయాలయ్యాయని ఆయన చెప్పారు. మిగతా వారికి చిన్న గాయాలు తగలడంతో చికిత్స అనంతరం వారిని ఇళ్లకు పంపించివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానంలోంచి దిగి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో విమానం పూర్తిగా కాలి బూడిదయింది. ప్రయాణికులు ఒకరికొకరు సహకరించుకొని ఎమర్జెన్సీ ద్వారాలగుండా బైటికి వచ్చినట్లు  ఒక ప్రయాణికురాలు చెప్పారు.1981లో ఏరో మెక్సికోకు చెందిన విమానం ఇలాగే వాతావరణం అనుకూలించక కూలిపోవడంతో 32 మంది చనిపోయారు.

Comments

comments