Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మంచిర్యాల నుంచి ఆకాశయానంలోకి…

దేశంలోనే తొలి బంజారా మహిళా పైలెట్ ఆజ్మీరా

ధృడసంకల్పంతోపాటు అంతకు మించిన పట్టుదల, కార్య దీక్షతో తెలంగాణ నుంచి తొలి గిరిజన మహిళా పైలట్‌గా తన కలలు సాకారం చేసుకుంది. తమ కుటుంబంలో బంధువులెవరూ కూడా ఈ రంగంలో లేకపోయినప్పటికీ గుండె ధైర్యంతో ఆకాశయానంలోకి అడుగుపెట్టింది. కలలు కనడమే కాదు సాకారం చేసుకోవడం అంతకంటే గొప్ప అని నిరూపించిన తెలంగాణ రాష్ట్ర తొలిగిరిజన మహిళా పైలట్ ఆజ్మీరా బాబీ ఏవియేషన్ రంగంలోకి రావడానికి గల కారణాలు, ఎదురైన అనుభవాలను మనతెలంగాణ యువతతో పంచుకుంది.

Pilot

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కర్ణపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఆజ్మీరా బాబీ విమాన పైలెట్ శిక్షణకు ఎంపికైంది. ఈమె దేశంలో పైలట్ శిక్షణకు ఎంపికైన తొలి గిరిజన మహిళా పైలట్‌గా శిక్షణ తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రూ. 28 లక్షల మేరకు సహాయం అందించనున్నట్లు ప్రకటించి ఆమె భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. దండేపల్లికి చెందిన ఆజ్మీరా హరిరాంనాయక్, జయశ్రీ దంపతుల కుమార్తె. తల్లిదండ్రులిద్దరూ విశ్రాంత ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా మంచిర్యాలలో స్థిరపడ్డారు. బాబీ 10వ తరగతి వరకు మంచిర్యాలలో, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో పిజి చేసి బంగారు పతకం సాధించింది. అదే విశ్వవిద్యాలయంలో ఎంబిఏ(హెచ్‌ఆర్‌సి)చేసి, ఆ తరువాత అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే పైలెట్ శిక్షణపై ఆశక్తి పెంచుకుంది. ఆమె ఆసక్తికి గమనించిన తల్లిదండ్రులు అమెరికాలో ఫ్లోరిడాలోని డీన్ ఫ్లయింగ్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ కొంత వరకు శిక్షణ పొంది, పూర్తి స్థాయిలో శిక్షణ పొందేందుకు ఆర్థిక స్థోమత లేని కారణంగా పైలట్ శిక్షణ ఆగిపోతుందని భావించిన తరుణంలో సిఎం ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.
ఆకాశంతో అనుబంధం: దుబాయ్‌లో ఉండే మేనత్తకు వీడ్కోలు చెప్పడానికి మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాను. అప్పుడే ఆకాశంతో నాకు ఏదో దగ్గర అనుబంధం ఉందని భావించాను. అదే రోజు విమానంలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. మా కుటుంబంలో దగ్గర బంధువులలో ఎవరూ ఈ రంగంలో లేరు. కాని అందరూ నాకు మార్గదర్శకంగా నిలిచారు. కుటుంబంలో ఎవరూ లేకపోవడం పెద్ద సవాల్‌గా మారింది. కలలు నెరవేర్చుకునేందుకు ఎంతగానో శ్రమించి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ధృడ నిశ్చయంతో ముందుకు సాగాను. అమ్మాయిలు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు, డాక్టర్‌లు, ఐఎఎస్ ఆఫీసర్‌లో కావాలని అంతా అనుకుంటారు. నేను మాత్రం అందరికన్న భిన్నంగా అవ్వాలని ఆలోచించాను.
ఎంబిఎ చేశాక ఒక రోజు కేబిన్‌క్రూ సిబ్బంది కోసం ఒక ఎయిర్ లైన్స్ ఇచ్చిన ప్రకటన చూసిఅప్లై చేశాను. తొలి ప్రయత్నంలోనే ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యాను. అదే నా లక్షాన్ని సాధించడంతో మొదటి మెట్టు. ఎయిర్ హోస్టెస్ అనగానే చాలా కుటుంబాలు వేర్వేరు అభిప్రాయాలతో తమ పిల్లలు ఈ రంగం ఎంచుకోవడానికి ఒప్పుకోరు. కానీ నా విషయంలో నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్నప్పుడే పైలట్ శిక్షణకు ఎంపికయ్యాను. మొదటి సారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు కిందకు చూస్తే చాలా భయం వేసేది. కాని భయాన్ని వదిలేసి, గుండె ధైర్యంతో ముందుకుసాగాను. ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది. కాని ఆ కష్టం తరువాత వచ్చే ఆనందం చాలా బాగుంటుంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది ఆజ్మీరా.

ఏవియేషన్ రంగంలోకి రావాలంటే… 

ఏవియేషన్ రంగంలోకి రావాలంటే మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం అవసరం ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతి మూడు నెలలకు ఒక సారి వివిధ సబ్జెక్టులలో పరీక్షల నిర్వహిస్తుంది,  పరీక్షలు పాస్ అయిన తరువాత ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరితే బాగుంటుంది,  లేకపోతే ఫ్లైయింగ్ లైసెన్స్ పోయే అవకాశాలు ఉంటాయి. ఈ రంగంలోకి వచ్చినప్పుడు పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదు. కానీ కులం కొన్నిసార్లు తన ప్రయాణంలో అవరోధంగా నిలిచిందని చెబుతోంది ఆజ్మీరా. తల్లిదండ్రులు, స్నేహితులు, తెలంగాణ ప్రభుత్వం తనకు ఎంతో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

 మంగపతి చంద్రశేఖర్

మన తెలంగాణ, మంచిర్యాల ప్రతినిధి

Comments

comments