Search
Sunday 23 September 2018
  • :
  • :

ఎత్తిన గేట్లు జూరాల ఉరకలు

zoorala

మునిగిన  సంగమేశ్వర ఆలయం 

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతంలోని జూరాల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి వరద వస్తుండడంతో జూరాల వద్ద 16 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,51,787 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇప్పటికే జూరాల నిండుకుండలా ఉండడంతో జలకళ సంతరించుకుంది. ఫలితంగా ప్రాజెక్టు వద్ద సందర్శకు ల తాకిడి పెరిగింది. కృష్ణానదికి వరద తాకిడి పెరగడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ 37.65 టిఎంసిలు కెపాసిటి ఉండగా, 37.87 టిఎంసిలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 1,84,500 క్యూసెక్కులు నమోదు కాగా, ఔట్ ఫ్లో 1,77,818 క్యూసెక్కులుగా ఉంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి వస్తున్న వరద నీటిని జూరాల వద్ద 16 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,57,960 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇందులో 1,51,787 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. మరోవైపు తుంగభద్ర నది నుంచి సుంకేసులకు ఇన్ ఫ్లో 70,271 క్యూసెక్కులుగా ఉంది. దీంతో సుంకేసుల నుంచి కూడా దిగువ శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తు తం శ్రీశైలం సామర్థం 215 టిఎంసిలు కాగా, 88.27 టిఎంసిల నిల్వ ఉంది. శ్రీశైలం వద్ద 1,83,826 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జిల్లాలోని వరదనీటితో అన్ని రిజర్వాయర్లకు జలకళ సంతరించుకుం ది. ఖరీఫ్ సీజన్‌లో రైతులు వేసుకున్న పంటలకు కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు సాగునీటి అధికారులు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఐడిబి సమావేశాన్ని ఏర్పాటు చేసి జూరాల ప్రధాన కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని రైతుల పొలాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా పంపుల ద్వారా ర్యాలంపాడు నుంచి నీటిని కాలువలకు మళ్లించారు. దీంతో దిగువ ప్రాంతంలోని ఆయకట్టు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే విధంగా భీమా, కోయలసాగర్ రిజర్వాయర్ల ద్వారా కూడా నీటిని అందించే చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కింద నిర్మించిన చెరువులు, కుంటలను వరద నీటితో నింపుతున్నారు. చాలా చోట్ల కుంటల్లో కూడా నీరు చేరడంతో హర్షాతిరేకం వ్యక్తం అవుతున్నాయి.
నీట మునిగిన సంగమేశ్వర ఆలయం : అటు జూరా ల, ఇటు తుంగభద్ర నది నుంచి భారీగా వరద తాకిడి పెరగడంతో సోమశిల సమీపంలో కృష్ణా, తుంగభద్ర సదులు కలిసే చోట ఉన్న సంగమేశ్వర ఆలయం నీట మునిగిపోయింది. ప్రతి ఏడాది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు కనిపించే ఈ పవిత్ర ఆలయం వరదల కారణంగా ఈ సారి కూడా వరద తాకిడికి గురైంది. చివరి సారిగా అర్చకులు సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

comments