Search
Sunday 23 September 2018
  • :
  • :

దుముకుతున్న జూరాల

zoorala

పై నుంచి90వేలు, దిగువకు 38 వేలు క్యూసెక్కులు
విద్యుత్ ఉత్పాదన, గేట్లు తెరచి నీటి విడుదల
శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వస్తున్న వరద నీరు

మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్లోకి నీటి ప్రవాహం మొదలైంది. డెడ్‌స్టోరేజికి వెళ్లిన శ్రీశైలానికి ఈ సీజన్‌లో నీటి రాకడ ఇదే మొదటిసారి. గురువారం రాత్రి జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో, శ్రీశైలానికి ప్రవాహం పెరిగింది.  కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం నారాయణపూర్ గేట్లు తెరవడంతో, ఆ నీరు గురువారం నాడు జూరాలకు  చేరుకుంది. జూరాలకు 90,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొంత విద్యుత్ ఉత్పత్తి చేసి, వదులుతుండగా, మరికొంత గేట్లు తెరిచి వదులుతున్నారు. ఇదేవిధంగా తుంగభద్ర డ్యాం గేట్లు తెరిచి, 68,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా, ఈ నీరు శ్రీశైలానికి నేడు చేరుకోనుంది. దీంతో ఓ వైపు జూరాల, మరో వైపు తుంగభద్ర నుంచి వచ్చే నీరు కలిసి, శ్రీశైలానికి మరో ఒకటి, రెండు రోజుల్లో భారీగా నీటి ప్రవాహం చేరుతుంది. ప్రస్తుతం 31,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలంలో నమోదవుతుంది. ఆల్మట్టి రిజర్వాయర్‌కు 1,62,093 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129.7 టిఎంసిల సామర్థానికి గాను 113.4 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది. ఇదేవిధంగా నారాయణపూర్‌లో 37.64 టిఎంసిల సామర్థానికి గాను 33.5 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, ఇంకా 1,60,620 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుంది. ఇక్కడ 1,53,248 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల రిజర్వాయర్‌కు 90,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా దిగువకు 38,000 క్యూసెక్కుల నీరు వదుతున్నారు. జూరాలలో 9.66 టిఎంసిల సామర్థానికి గాను 7.84 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది. జూరాల ఆధారంగా ఉన్న ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో లెఫ్ట్, రైట్ కెనాల్‌లతో పాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పంపులను ప్రారంభించారు. ఈ నీటితో తొలుత చెరువులు నింపే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంలో 100.86 టిఎంసిల సామర్థానికి గాను ప్రస్తుతం 93.69 టిఎంసిల మేర నీరు ఉండగా, ఇంకా 74,000 క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి వచ్చి చేరుతుంది. ఇందులో దిగువకు 68,000 క్యూసెక్కుల మేర వదులుతున్నారు. శ్రీశైలంలో 885 అడుగుల పూర్తిస్థాయి మట్టానికి గాను ప్రస్తుతం 800.30 అడుగుల మేర నీరు ఉంది. 215.81 టిఎంసిలకు గాను కేవలం 29.13 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. ఇదేవిధంగా నాగార్జునసాగర్‌లో 590 అడుగులకు గాను 511 అడుగుల మేర నీరు ఉంది. 312 టిఎంసిల పూర్తిసామర్థానికి గాను 133.37 టిఎంసిల మేర నీరు ఉంది. శ్రీశైలం నిండి, గేట్లు తెరిస్తే గానీ నాగార్జునసాగర్‌కు నీరు చేరే అవకాశం లేదు. ఇదేవిధంగా గోదావరి బేసిన్‌లో సింగూరులో 29.9 టిఎంసిల సామర్థానికి గాను 8.12 టిఎంసిలు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం 230 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌లో 17.8 టిఎంసిల సామర్థానికి గాను 2.39 టిఎంసిల నీరే ఉంది. ఇదేవిధంగా శ్రీరాంసాగర్‌లో 90.31 టిఎంసిలకు గాను 14.02 టిఎంసిల నీరు ఉంది. ప్రస్తుతం 4,670 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 205 క్యూసెక్కులను దిగువ కెనాల్‌లకు వదులుతున్నారు. లోయర్ మానేరులో 24 టిఎంసిలకు గాను 3.47 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. కడెం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండగా, ప్రస్తుతం 1646 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. 3441 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లిలో 20.18 టిఎంసిల సామర్థానికి గాను 12.52 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది. ఇంకా 788 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుంది.
ఇదే స్థాయిలో నీరొస్తే కృష్ణా బేసిన్‌కు నీటి గండం తప్పినట్లే…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో మొత్తం 55 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 15.49 లక్షల ఎకరాలు తెలంగాణలో ఉంది. తుంగభద్ర, జూరాల మీదుగా, శ్రీశైలానికి నీరు రావడంతో ఈ ఆయకట్టు సాగుదారుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం నిండితే, నాగార్జునసాగర్‌కు కూడా నీరొస్తుంది. మరో రెండు నెలలు వర్షాకాలం ఉండడం, ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండడంతో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలోని కృష్ణా బేసిన్‌లో మేజర్ ప్రాజెక్టులపై ఆధారపడి 8.73 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదేవిధంగా మీడియం ప్రాజెక్టులపై 1.2 లక్షల ఎకరాలు ఉంది. మొత్తంగా సుమారు 10 లక్షల ఎకరాలు మేజర్, మీడియం ప్రాజెక్టులపై ఆధారపడి సాగు చేస్తుండగా, 5.5 లక్షల ఎకరాలు కేవలం చెరువులపైనే ఆధారడి సాగవుతోంది. అయితే మేజర్ ప్రాజెక్టుల ఆధారంగా చెరువులు నింపాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఆ మేరకు అధికారులు యాక్షన్ మొదలైంది. దీంతో చెరువుల కింద సాగుకు కూడా వీలైనంత మేర నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి అదనంగా భీమా పథకం కింద మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 39.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, మేజర్, మీడియం ప్రాజెక్టులపై ఆధారపడి 38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

Comments

comments