Home లైఫ్ స్టైల్ పూలు, బొట్టు, గాజులే సమస్యా?!

పూలు, బొట్టు, గాజులే సమస్యా?!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న కర్మ భూమి, మహిళల పట్ల వివక్షలో మాత్రం తిరోగమనాన్ని ఎందుకు కోరుకుంటున్నదో అర్థం కాదు. ఆనాడు మా నాన పవిత్రమని చెప్పిన గంగ, భాగీరథీ నదులు కలుషితమైనా పట్టించుకోని మగ సమాజం, భర్తను పోగొట్టుకున్న మహిళ మరో వివాహం చేసుకుంటానన్నా, తనకు నచ్చిన వ్యక్తితో సహ జీవనం చేస్తానన్నా మాత్రం అభద్రతకు లోనవుతుందెందుకో. భార్య చనిపోయిన భర్త తన శారీరక వాంఛ మరో మహిళతో తీర్చుకోవడం తప్పు పట్టని పుణ్య భూమి, అదే పని మహిళలు చేస్తే ఉప్పుపాతరేస్తామని తీర్పులివ్వడం విస్మయపరుస్తుంది. శారీరక వాంఛల విషయంలో మహిళలకు, పురుషులకు తేడాలుంటాయని ఏ అనాటమీ చెబుతుందో తెలుసుకోవాలనుంది.

Flowers-Bangles

‘గంగా భాగీరథీ సమానురాలైన’ అత్తకు నమస్కరించి వ్రాయునది… నా చిన్నప్పుడు, మా నాన ఇన్‌లాండ్ లెటర్‌లో అమ్మమ్మను సంబోధిం చేవాడు, ఆ చిన్న వయసులో నాకది అర్థం కాకపోయ్యేది, నానను అడిగే దాన్ని ఎందుకు అట్లా రాస్తున్నారని. అమ్మమ్మకు భర్త లేడు, కాబట్టి అట్లా రాస్తున్నానని చెప్పేవారు నాన, నా చిన్న మెదడులో మళ్లీ ప్రశ్న ఉదయించి అడిగేది భర్త లేకుంటే అట్లానే ఎందుకు పిలవాల్నని, దానికి నాన సమా ధానం గంగ, భాగీరథీ నదులు ఎంత పవిత్రమైనవో అంతే పవిత్రమైంది మీ అమ్మమ్మ అని. మళ్లీ ప్రశ్న పవిత్రత అంటే అని, కాని ఆ సందేహాన్ని తీర్చమని ఎవర్నీ అడగలేదు ఎందుకంటే తల వెంట్రుకలు కత్తిరించి, తెల్లని చీర, రవికతో ఒక్క పూట భోజనం చేస్తూ తన జీవితాన్ని కుటుంబం కోసం, దేవుడి అర్చనకు అంకితం చేసిన అమ్మమ్మ రూపం నా కళ్లముందు ఆవిష్కృ తమైంది, ఆ రకమైన జీవనవిధానాన్నే పవిత్రత అన్నారేమో నాన అని అనుకున్నా, ఈ సంఘటన 30 ఏళ్ల నాటిది. అయితే ఆనాడు ఇంటికి సంబంధించి ఏవిధమైన నిర్ణయం తీసుకున్నా అమ్మమ్మ ఆమోదం అవసర మయ్యేది. పెళ్లిండ్లు, శుభకార్యాలు తన ప్రమేయం లేకుండా జరిగేవి కావు, అంటే కుటుంబ సభ్యులందరు కలిసి నిర్ణయాధికారం  అమ్మమ్మకు వదిలే వారు. సామాజిక, శారీరక కట్టుబాట్లు ఎదుర్కొన్నది నాడు అమ్మమ్మ, అయితే కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉండడం నేను గమనించాను.
నేడు అంటే 30 సంవత్సరాల తరువాత వైధవ్యం అనుభవిస్తున్న మహిళల పరిస్థితి చూస్తే, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా ఉన్నది. బాల్య వివా హాలు నేటికీ కొనసాగుతున్న నేపథ్యంలో తమ 25 సంవత్సరాల వయసులో, ఇద్దరు పిల్లల తల్లులుగా, భర్తను కోల్పోయిన మహిళలు సామాజిక, ఆర్థిక, కుటుంబపరమైన కట్టుబాట్లతో పాటు, అదనంగా లైంగిక వేధింపులు, సాంఘికపరమైన హద్దులను ఎదుర్కొంటున్నారు.
భర్త చనిపోయిన మహిళల పై కుటుంబ సభ్యులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు నేడు చూస్తున్నాం. వైధవ్యం అనుభవిస్తున్న మహిళల జీవితాల్లోకి తొంగి చూసి వారి జీవితాలకు స్ఫూర్తినివ్వాలనే తలంపుతో అంతర్జాతీయ వితంతు దినోత్సవం (23, జూన్) సందర్భంగా, బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలో పదివేల మంది వితంతులతో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు కూడా ఓ అడుగు మందుకువేసి వారి కష్టనష్టాల గూర్చి మాట్లాడుతూ, వారికి భరోసానిస్తామ న్నారు. నాలుగ్గోడల మధ్య ఉన్న సమస్యను నలుగురిలోకి తీసుకురావడంలో సఫలీకృతమైన ఈ సభ స్ఫూర్తిగా వారి కష్టాలు మరింత పెరగకుండా పరిష్కారం కావాలని ఆశిద్దాం. ఈ విషయంలో చర్చ మరింత జరిగి సామాజిక మార్పుకు దోహదపడాలి. సభకి వచ్చిన వితంతు మహిళలు చాలామందిని కదిలిస్తే, కన్నీళ్ల పర్యంతమ వుతూ కష్టాలను ఏకరువు పెట్టారు. వారిలో కొందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి…

ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నేత రావి నారాయణ రెడ్డి తన వీలునామాలో తన మరణానంతరం భార్య సీతాదేవి బొట్టు తొలగించడం, చేతులకు గాజులు తీసేయడం, తలకు పూలు పెట్టుకోకూడదన్న ఆచారాలను అనుసరించకూడదని కోరారు. దేశ ప్రథమ లోక్ సభ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ప్రధాని పండిట్ నెహ్రు కన్న అధిక మెజారిటీలో లోక్‌సభ సభ్యులుగా విజయం సాధించిన వ్యక్తి.

– రావి నారాయణ రెడ్డి

మా ఆయిన వ్యవసాయం జేసేటోడు, అనారోగ్యంతోటి చనిపోయిండు. చిన్న ప్పుడే పెండ్లి అయింది, ఇద్దరు పిల్లలు. అత్తమామ మంచిగనే చూస్తరు కాని వాళ్లు ముసలోళ్లయిపోయిండ్రు, వాళ్ల కు వచ్చే పెన్షన్ వాళ్లకే సరిపోత లేదు. నేను కూలి పనిచేస్కోని బతుకు తాన, పెద్దోడు సదువుతలేడు కాని చిన్నోడు సదువుకుపోతాండు. నాకు వచ్చే వెయ్యి రూపాల పెన్షన్ దేనికి సరిపోతలేదు. ఇగ సమాజ పరిస్థితులంటె ఎవరేమన్నా విన, ఎన్ని తిప్పలైనా మనుసుల పెట్టకుంట కాని ఎవ్వలకు చెప్ప, చేసేటిది గూడ ఏం లేదాయె. చిన్నోడి చదువుకు సాయమం దించాల్నని ప్రభుత్వాన్ని కోరుతున్న.

– మారపల్లి వనిత, జమ్మికుంట.

నాకు 18 సంవత్సరాలకే పెండ్లయింది, మా ఆయినను పార్టీ గొడవల్లో చంపేసిండ్రు. నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసున్నం. అత్తగారు ఏం సహకారం అందించలేదు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బిడ్డ, కొడుకు. ఇద్దరు పిల్లల బాగోగులు చూస్తూ ఒంటరి జీవితం గడపాల్సి వస్తున్నది. ఎవరూ ఆర్థిక సహకారం అంది స్తలేరు. జాకిట్లు కుట్టుకుంట సంపాదిస్తున్న, మొదట్లో ముండబొడ్డి దగ్గర ఎందుకని నా దగ్గరికి ఎవ్వరు కుట్టించుకోను రాకపోదురు. తర్వాత గాజుల దుకాణం పెట్టిన, ఎవ్వరు రాలేదు. చుట్టాలల్లో నేనిచ్చే పైసలు తీసుకుంటరు కాని శుభకార్యాలల్ల దగ్గరికి రానీయరు, మస్తు బాధైతది. బయిటికి పోతే ‘లైసెన్స్’ (మంగళసూత్రం) లేదనే మాటలతో చిత్రహింసలు పెడ్తరు, ఈ సాకుతోటి లైంగిక వేధింపులు కూడా చేస్తరు. ఎవ్వరికి ఎదురు తిరిగినా తిరుగుబోతని ముద్ర వేస్తరు. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కుంటున్న, పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటె మించిగుంటది.

– మహేశ్వరి, రేపల్లి గ్రామం, మహబూబాబాద్.

మా ఆయిన కూలిపనికి పోతూండేది, బ్యాంకులకెల్లి డబ్బులు తెద్దామనిపో యి యాక్సిడెంట్‌లో చచ్చిపోయిండు. నాకు 13 సంవత్సరాలకు పెండ్లయిం ది, 18 సంవత్సరాలకు ముండమోసిన. ఇద్దరు కొడుకులు నాకు. మా తల్లిగా రోల్లే నా మంచి చెడ్డ చూస్తున్నరు. పెద్ద కొడుకును వాళ్లే చదివిస్తున్నరు. పొద్దగల లేసి వాకిలూడుస్తుంటే ఎదురింటోళ్లు తిడుతరు, ఇంట్లోళ్లు కూడా ఎదురుపడద్దని తిడుతరు. కూలిపనిజేస్కోని బతుకు తాన, పనిల ముందుపడితె గూడ ముండ రాలివి, దరిద్రపుదానివని తిడ్తరు. ఊళ్లె మొగోళ్లు కూడ తక్కువజేసి, చెడ్డగ మాట్లాడ్తరు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అందుతున్నా అది దేనికి సరిపోతలేదు, ఇట్లగాకుండ మా పిల్లగాళ్ల చదువులకు సాయమం దిస్తే బాగుంటదని కోరుతున్న.

– పోలు రజిత , మహబూబాబాద్.