Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

క్యూ4 ఫలితాలపైనే దృష్టి

bs

 అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలను పరిశీలించాలి
 ఈ వారం మార్కెట్‌పై నిపుణులు సూచన

న్యూఢిల్లీ : గత వారం మంచి లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ఈవారం కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్ధిక గణాంకాలపై దృష్టిపెట్టాలని ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్నారు. వారాంతం చివరి రోజు శుక్రవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి 34,192 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10,480 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. దేశీయ రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాలను  శుక్రవారం(13న) మార్కెట్లు ముగిశాక ప్రకటించింది. ఇన్ఫీ లాభాలను అంచనాలను అందుకుని అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో నేడు (16న) ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ కౌంటర్‌పై ఫలితాల ప్రభావం కనిపించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే బుధవారంనాడు సిమెంట్ రంగ దిగ్గజం ఎసిసి క్యూ4 ఫలితాలు వెల్లడించనుంది. ఇంకా దేశంలో నంబర్ వన్ ఐటి సంస్థ టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఈ నెల 19న ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇక ఈనెల 16న మార్చి నెలకు గాను టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్లుపిఐ) గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో డబ్లుపిఐ 2.48 శాతం  పుంజుకోగా.. ఈసారి ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.  ఈనెల 17న జిడిపి గణాంకాలను చైనా వెల్లడించనుంది. ఇదే రోజున ఫిబ్రవరి నెలకు జపనీస్ పారిశ్రామికోత్పత్తి వివరాలు విడుదల కానున్నాయి. ఇవికాకుండా ప్రపంచ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐలు) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయ కదలికలు వంటి ఇతర అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మరోవైపు సిరియాపై అమెరికా దాడులు అంతర్జాతీయంగా మార్కెట్లను ఆందోళన కల్గిస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్‌లతో కలసి అమెరికా శుక్రవారం సిరియాపై దాడులకు దిగింది. సిరియా ప్రెసిడెంట్ బషర్ అస్సద్ ప్రజలపై రసాయనిక ఆయుధాలు వినియోగించడంపై సీరియస్ అయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధ స్థావరాలపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇకపై పౌరులపై రసాయనిక దాడులకు దిగకుండా మిలటరీ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. ఈ దాడులపై రష్యా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Comments

comments