Home ఆఫ్ బీట్ కూల్ కూల్ సమ్మర్

కూల్ కూల్ సమ్మర్

వేసవి ఎండలు మండేకాలం
పొద్దు పొడిచిన కొద్ది గంటలకే నిప్పులు చెరిగే సూర్యుడు
ఆ తాకిడికి పట్టపగలే చుక్కలు కనిపించే కాలమిది…
ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలా ఉంటాయోననే భయం…
అందరికీ చెమటలు పట్టేలా చేస్తోంది..
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి..
ప్రతి ఇంట్లో ఏసీలు, ఫ్యానులూ ఆగకుండా ఉన్నాయి…
మట్టి కుండల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి..
మజ్జిగ, నిమ్మరసం, చెరకు, పుదీనా రసం, పండ్ల రసాలపై దృష్టి మళ్లించారు జనం..
కూలింగ్ గ్లాస్ పెట్టుకోకుండా బయటకు రానేరావట్లేదు..
కాటన్ దుస్తులకే ఓటేస్తున్నారు నగరవాసులు..
ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తుంటే ..
వేసవిని హాయిహాయిగా గడిపేయొచ్చు…

ముదురు రంగులకు దూరం

Summer

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోత చికాకుపెడుతోంది.  దీంతో నూలువస్త్రాలవైపు మొగ్గుచూపుతున్నారు నగరవాసులు. శరీరం నుంచి వెలువడే వేడిని  సులువుగా బయటకు పంపించేందుకు నూలు వస్త్రాలే మేలు.  వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరుస్తాయివి. ఫలితంగా చెమట పట్టకుండా ఉంటుంది. నూలుతోపాటు ఫ్యాషన్‌లో రాజీపడకూడదంటే లెనిన్, రెయాన్ వస్త్రాలు కూడా తేమను గ్రహించి గాలి ప్రసరించేలా చేస్తాయి. వేసవిలో ముదురు రంగుల దుస్తులకు దూరంగా ఉండాలి. ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అందువల్ల ఎక్కువ చెమట పడుతుంది. ఫలితంగా వడదెబ్బ బారినపడే అవకావం ఎక్కువ. లేత రంగుల్లో ఉండే వస్త్రాలను ఎంపిక చేసుకోవాలి. తెలుపు అయితే మరీ మంచిది. అలాగే స్కిన్ టైట్ వస్త్రాలకు దూరంగా ఉండాలి. వదులుగా వున్నవి సౌకర్యంగా ఉంటాయి.    పసిపిల్లలకు వదులుగా ఉన్న దుస్తులు వేయాలి. ప్రతిరోజూ ఉతికిన దుస్తుల్ని వేసుకోవడం వల్ల శరీరానికే కాకుండా మనసుకూ తాజాదనపు అనుభూతి కలుగుతుంది.  మన దగ్గర ఎండాకాలంలో పెళ్లిళ్లు, రిసెప్షన్ వేడుకలు జరుగుతుంటాయి. రెండు మూడు గంటలే అయినా గ్రాండ్‌లుక్ కోసం ధరించిన వస్త్రాలు తీవ్ర ఇబ్బందిని కలుగజేస్తుంటాయి.  అందువల్ల ఎంబ్రాయిడరీ ఎక్కువ వున్నవి ధరించకపోవడం ఉత్తమం.  తేలికగా ఉండేవి, లేత రంగుల్లో ఉండే దుస్తులను వేసుకోవాలి.  అబ్బాయిలైతే షేర్వానీలకు బదులు కుర్తా పైజమా సౌకర్యంగా ఉంటుంది.

summer

వేసవి తాపంలో శరీర జీవక్రియల్లో అనేక మార్పులొస్తుంటాయి. చెమట, ఉక్కపోతతో సతమతమౌతుంటారు జనం. ఎండలో ఎక్కువగా తిరిగితే అతిగా దాహం వేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీరంలోని లవణాల శాతం తగ్గుతుంది. ఫలితంగా నీరసం, నిస్సత్తువ ఎక్కువై వడదెబ్బకు దారితీస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎండ వేడిమి, వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. మార్కెటింగ్, సేల్స్‌మెన్, భవననిర్మాణ కార్మికులు ఇలా క్షేత్రస్థాయిలో పనిచేసేవారిపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎండలో స్వేదగ్రంథుల ద్వారా చెమట రూపంలో శరీరం లవణాలను ఎక్కువగా కోల్పోతుంది. శరీరం నిర్జలీకరణ స్థితికి చేరుకుంటుంది. నష్టపోయిన లవణాలను తిరిగి పొందటానికి ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలను తీసుకోవాలి. అలా చేయకపోతే కళ్లు తిరుగుతాయి. నాలుక తడారిపోతుంది. ఎక్కువగా దాహం వేస్తుంది. తీవ్రమైన ఎండలున్నప్పుడు పనులను వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఈ సమయంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేస్తే, వేడిగాలుల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకని ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించడం మంచిది. ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎండ వేడిమి పెరిగే లోపే పనులు పూర్తిచేసుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు:

వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి 106 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు చేరుతుంది.
చర్మం పొడిగా మారుతుంది.
తలనొప్పి,వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కళ్లు తిరుగుతాయి. నాలుక తడారిపోతుంది.
మూత్రం పచ్చగా కొద్దికొద్దిగా వస్తుంది.
కండరాల నొప్పులు ఉంటాయి. ఒంట్లో శక్తి తగ్గుతుంది.

వడదెబ్బకు చెక్ పెట్టేద్దాం…

ప్రథమ చికిత్స:

వడదెబ్బ తగిలిన రోగిని నీడలోకి తీసుకురావాలి. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే తడివస్త్రంతో శరీరాన్ని తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్‌కు వచ్చేవరకు అలా చేయాలి. డీ హైడ్రేషన్ నుంచి కాపాడటానికి రెండు చెంచాల పంచదార, ఒక చెంచా ఉప్పు కలిపిన ద్రావణాన్ని తయారుచేసి రోగితో తాగించాలి.  బాధితుల పరిస్థితిని బట్టి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఇలా చేయండి:

రోజుకు కనీసం 10 నుంచి 15 గ్లాసుల నీటిని తాగాలి. కొబ్బరినీరు, ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి.దీని వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఉదయం , సాయంత్రం వేళల్లో పనులు చూసుకోవాలి.
వృద్ధులు, పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకూడదు.తప్పనిసరిగా బయటకు వెళ్లాలనుకుంటే గొడుగులు, స్కార్ఫ్‌లు, టోపీలు వాడాలి. వదులుగా, సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.

చల్లని మజ్జిగతో అలసట మాయం…

ఎండలు రోజురోజుకి బాగా పెరిగిపోతున్నాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న వేడి నుంచి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. బయటికి కనిపించే అందాన్ని, లోపల దాగుండే ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఎండల్లో వెళ్తున్నప్పుడు గొడుగులు తీసుకెళ్లడం, కాస్త గాలి ఆడేలా వదులైన కాటన్ దుస్తులు ధరించడం తప్పనిసరి.

*కొబ్బరి నీళ్లను రోజుకోసారైనా తాగడం అలవాటు చేసుకోవాలి. మరీ ఎండలు ఎక్కువుంటే… రెండు మూడు తాగితే, శరీరంలోని తేమ బయటికి పోకుండా కాపాడుతుంది. డయేరియా, ఇన్ఫెక్షన్ వంటి వాటి బారినపడనీయదు. ఇందులో సహజంగా ఉండే చక్కెర్లు, ఖనిజాలు శరీరం డై హైడ్రేషన్ కి గురికాకుండా చూస్తాయి. ఎంత తిన్నా పుచ్చకాయ మేలే కానీ కీడు చేయదు. శరీరంలోని వేడిని చిటికెలో బయటికి పంపేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధులు, గర్భిణులు రోజూ కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు ఎంత తింటే అంత మంచిది.

*వేసవిలో కాఫీలకు, టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎండలో నుంచి వచ్చాక చల్లని మజ్జిగ తాగితే… అలసట మొత్తం ఎగిరిపోతుంది. వడదెబ్బ కొట్టే అవకాశం తక్కువ. అలాగే కూరలు, మాంసాహారం తినడం తగ్గించాలి. చల్లని పెరుగున్నం తింటే మంచిది. కీరదోసను టిఫిన్ రూపంలో తీసుకుంటే పోషకాలు అందుతాయి. డీహైడ్రేషన్ దరిచేరదు. మలబద్దకాన్ని నివారిస్తుంది. పుదీనా ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలి. నీళ్లలో వాటి ఆకులు వేసుకుని తాగడం, చట్నీల్లో కలుపుకోవడం వంటివి చేయాలి. రోజూ పుదీన తినడం వల్ల శరీరం నుంచి వేడి బయటికి పోతుంది.

*పుచ్చకాయల్లో పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం నీటి కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచు పదార్థాలు బాగా ఉన్నాయి.

* వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతి సిద్ధమైన పానీయం. వీటి వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకుపోతాయి. కొబ్బరి నీళ్లలో పీచుపదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

*చల్లటి పాలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య పోతుంది. పొట్టలోని ఆమ్లాలను పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. కడుపులో ఎసిడిటీతో బాధపడుతున్నా, ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తినా పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి.

*అరటి పండులోని పొటాషియం పొట్ట అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపళ్లలో పీచు పదార్థాలు కూడా బాగా ఉన్నాయి. అందుకే వేసవిలో మిగలపండిన అరటిపండును తింటే ఎసిడిటీ సమస్య తలెత్తదు.

అతినీలలోహిత కిరణాల పంజా 

Sunstroke

నగరంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్యూఈవో) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూవీ సూచిక మార్చిలోనే పదికి చేరుకుంది. దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థలో భాగమైన డబ్యూఈవో భారత్ సహా ఇతర దేశాల్లోని ప్రధాన మెట్రో నగరాల్లో యూవీ కిరణాల తీవ్రతను ప్రతిరోజూ నమోదు చేస్తోంది. దీని ఆధారంగా సూచికను రూపొందిస్తారు. 7 వరకు అంటే ఫరవాలేదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సూచిక 11దాటితే మాత్రం పర్యావరణానికి ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుంది. తీవ్రత పెరిగే కొద్దీ ఓజోన్ పొర మందం తగ్గుతుంది. అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరుకుని మానవ శరీరంలోకి చొచ్చుకొని పోతాయి. ఫలితంగా చర్మసంబంధిత ఎలర్జీలు, కళ్ల రుగ్మతలకు కారణమౌతాయి. ఇదే పరిస్థతి దీర్ఘకాలికంగా కొనసాగితే చర్మక్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అతినీలలోహిత కిరణాల తీవ్రత వేసవిలో ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ పరిస్థితి కొంతవరకు ఆందోళనకరంగా ఉంటుంది. మార్చి మొదట్లోనే ఎండ ప్రతాపాన్ని తీవ్రంగా ఉంది. యూవీ సూచిక ఫిబ్రవరిలో 8, మార్చిలో 9 ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈసారి మాత్రం మార్చిలోనే అతి ఎక్కువ కేటగిరీలోకి చేరినట్లుగా డబ్యూఈవో గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మార్చిన 4న యూవీ సూచిక 10గా ఉంది. ఈ నెల 11 వరకు ఈ తీవ్రత ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 12మార్కును దాటి ప్రమాదకరమైన జోన్‌లోకి వెళ్లే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

పచ్చదనం కరువు: యూవీ కిరణాల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం పచ్చదనం లోపించడమే అని పర్యావరణవేత్తలు స్పష్టంచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మెట్రో నగరంలో మొత్తం విస్తీర్ణంలో 16 శాతం పచ్చదనం ఉండాలి. కానీ మన దగ్గర మాత్రం 5 శాతమే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొక్కలు నాటేందుకు ఖాళీస్థలం కరువవుతోంది.

యూవీ కిరణాల సూచిక – తీవ్రత

1-2 తక్కువ
3-5 మధ్యస్తం
6-7 ఎక్కువ
8-10 అత్యధికం
11-ఆపైన ప్రమాదకరం

మల్లీశ్వరి వారణాసి