Search
Monday 24 September 2018
  • :
  • :

అనాథల ఆత్మీయ కిచెన్

లక్ష్యం, అభిరుచి ఉంటే చాలు. మనం చేయాలనుకున్నది చేస్తాం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి చేయాలనుకున్న పనిని పూర్తిచేస్తాం. అలాంటి కోవలోనే పయనిస్తున్నారు  శ్రీనాథ్‌రెడ్డి, భగత్‌రెడ్డి, కాజా మొయినుద్దీన్‌లు. ‘నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫాన్స్’ పేరుతో యూట్యూబ్ చానెల్ ద్వారా కొత్త వంటలు చేసి అనాథ పిల్లలను ఆదుకుంటు న్నారు. ఛానల్‌లో రెండులక్షల మందికి పైనే వీక్షకులకు చేరువయ్యారు.

Food-Kitchen

వేరు వేరు ప్రాంతాలకి చెందిన వీరు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. ఓ సంస్థలో ఎడిటింగ్, కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. అలా కలిసి పనిచేస్తూ మంచి స్నేహితులయ్యారు. వారు ముగ్గురూ కలిసి మనం సమాజానికి ఏం చేస్తున్నాం అని ఆలోచించారు. జవాబు దొరకలేదు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు.

వీరికి వంటలంటే ఆసక్తి. అనాథాశ్రమాల్లో ఉండేవారికి సరుకులు, ఆహారపదార్థాలు ఇస్తుండేవారు. దీనికంటే వంటకాన్ని తయారు చేసి దాన్ని అనాథాశ్రమాల్లో పంచితే చిన్నారులు ఎక్కువ సంతోషపడతారని గ్రహించి “నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫాన్స్’ ఒక ఛానల్‌ను ప్రవేశపెట్టారు. ముగ్గురూ కలిసి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు.

హైదరాబాద్‌లోని నార్సింగ్ దగ్గర చక్కటి వాతావరణంలో రకరకాల వంటలు చేసే బాధ్యతలు తీసుకున్నారు. మొయినుద్దీన్ వంటలు బాగా చేస్తాడు. దాంతో వీడియోలో వంటలు చేసే చెఫ్ బాధ్యతలు తనే తీసుకున్నాడు. భగత్ వీడియోలు తీస్తాడు. శ్రీనాథ్ ఎడిటింగ్ చేస్తాడు. వండిన పదార్థాన్ని పిల్లలు ఆనందంగా తింటూ మమ్మల్ని అన్నయ్యా అని ఆత్మీయంగా పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉందని శ్రీనాథ్‌రెడ్డి చెప్పాడు.

వీరి ఆసక్తిని గమనించి విదేశాల్లో ఉన్నవారు కూడా విరాళం పంపించి తమ వంతుగా ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం వండి అనాథపిల్లలకు పెట్టమని చెపుతున్నారు. ప్రవాసులూ, విదేశీయులు సైతం స్పందిస్తున్నారు. అలా ఆరునెలల నుంచీ విరాళాలతోనే కొత్త వంటకాలను తయారు చేస్తున్నారు. ఈ మధ్య లిచీతో జ్యూస్ చేశారు. ఖర్చుకు వెనకాడకుండా కొత్తరకాన్ని చేసి పెడుతున్నారు. వారానికి మూడు వీడియోలు తీస్తారు. ఇప్పటివరకు ఇలాంటి వెరైటీ వంటల
వీడియోలు 105 తీసి పోస్ట్ చేశారు.

Comments

comments