Home లైఫ్ స్టైల్ టార్గెట్ వారేనా?

టార్గెట్ వారేనా?

ఒక మైనారిటీ సమూహాన్ని టార్గెట్ చేయడం నాగరిక సమాజానికి, ప్రజాస్వామిక, లౌకిక సంస్కృతికి తీవ్రమై మచ్చ. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయత, దేశభక్తి గోసంరక్షణ పేరుతో ముస్లిం కమ్యూనిటీపై, దళితులపై దాడులు పెరిగి తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టబడుతున్నారు. పౌర సమాజం ఈ పరిస్థితి గురించి ప్రశ్నించి, ప్రజాస్వామిక సంస్కృతి, న్యాయభావన కోసం తపన పడకుంటే, దేశంలో ఉన్న పెద్ద మైనారిటీ వర్గానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ముస్లిం మతస్తులపై నెలకొన్న అనుమాన భావనను పటాపంచలు చేయడానికి ప్రజాస్వామిక వాదులుగా మన కృషిని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది.

Mumbai-Blasts

గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఎక్కడ బాంబు పేలినా, ప్రమాదవశాత్తు విధ్వంసం జరిగినా, ఆఖరుకు దీపావళి టపాకాయలు ఢామ్మన్ని వెంటనే, ఉగ్రవాదులు అని ఉలిక్కిపడుతున్నారు. ఉగ్రవాదులు అనేగానే గడ్డం, నూనూగు మీసాలు ఉండి, ఏ మసీదులో దగ్గరో, ఏ విద్యాలయంలోనో కనపడే యువకులు కొందరి మస్తిష్కంలో మెదలుతారు. అటువంటి అనుమాన భావనను గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ప్రభుత్వ అంగాలైన పోలీసులు, కోర్టులు, సైనిక బలగాలు సృష్టిస్తూ వచ్చాయి. చివరకు నిష్పాక్షింగా వ్యవహరించవలసిన న్యాయస్థానాలు, అందులో నల్లకోటు వేసుకుని వాదనలు వినిపించే న్యాయవాదులు, తలలు పండిన న్యాయమూర్తులు కూడా ఇటువంటి భావనలు కలిగి ఉండడానికి ఒక మినహాయింపు కాకుండా పోయాయి.

2007 మే 18న హైదరాబాద్‌లో, మక్కా మసీదులో ప్రార్థన పూర్తయి బయటకి వస్తుండగా జరిగిన బాంబు పేలుళ్ళు వల్ల తొమ్మిది మంది అక్కడిక్కడే చనిపోయారు. క్షతగ్రాతుల్ని హాస్పిటల్‌కు తరలిస్తుండగానే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగ్రహావేశాలతో ఉన్న యువకులు శాలిబండ వైపు పరుగెడ్తూ రాళ్ళు రువ్వుతూ షాపులు బంద్ చేయించే ప్రయత్నం చేశారు. ఒక పెట్రోల్ బంక్‌ను మాయించే ప్రయత్నంలో ఉండగా, అక్కడ గుమిగూడిన యువకులు పెట్రోల్ బంక్‌కు నిప్పుపెడ్తున్నారని తలచి పహార కాస్తున్న పోలీసులు వారిపై కాల్పులు జరుపగా సమీపంలో ఉన్నవారు సహా ఆరుగురు పోలీసు కాల్పుల్లో మరణించారు. మసీదులో బాంబు పేలిన కొద్ది సమయానికే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు చేరుకుని, ఈ సంఘటన వెనుక ఉగ్రవాదులున్నారని, పాకిస్థాన్ హస్తం ఉందని వ్యాఖ్యానాలు చేశారు. పోలీసు అధికార్లు కూడా ఎటువంటి విచారణ లేకుండానే, ఇది ఖచ్చితంగా ఇండియన్ ముజాహిదిన్ అనే తీవ్రవాద సంస్థ పి అయి ఉంటుందని, “హజి” (హర్కతుల్ జిహాద్ ఇస్లామి) లేక “లష్కర్ – ఎ- తోయిబా” పని కావచ్చు, అనే అభిప్రాయాలు కూడా టెలివిజన్‌క కెమెరాల ముందు కూర్చుని ప్రకటించారు. పోలీసులు తమ ఊహగానాలకు, వాళ్ల మస్తిష్కాల్లో ఉన్న వివిధ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి మూసారాంబాగ్ ప్రాంతంలో నివసించే షాహిద్ బిలాల్ అనే యువకుడ్ని అనుమనించారు. ఆయన బంధువులను, స్నేహితులను అదుపులోకి తీసుకొని భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. బిలాల్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పరీక్షల సమయంలో దగ్గరలో ఉన్న గుడిలో పెద్ద శబ్దంతో భజనలు చేస్తుంటే చదువుకు భంగం కలుగుతుందని అభ్యంతరం తెలిపాడు. బస్తీలో అల్లరి చేస్తూ తమను భయపెడ్తున్నాడని ఒక హిందూ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనతోపాటు ఇంకా కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకొని, తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. ఆయనతో ఉన్న వాళ్లందరూ బెయిల్ మీద విడుదల కాగా చాలా రోజుల వరకు బిలాల్‌కు బెయిల్ రాలేదు. ఈ యువకుడు జైలులో ఉండగానే బిజెపి నాయకు డు ఇంద్రసేనా రెడ్డిని చంపడానికి కుట్ర చేశాడని కేసు బనాయించారు. ఇంతకు ముందే సాయిబాబా గుడి దగ్గర జరిగిన టిఫిన్ బాక్స్ బాంబు పేలుడు కేసులో ఇరికించారు. 2005లో టాస్క్ ఫోర్స్ కార్యాలయం దగ్గర జరిగిన బాంబు పేలుడు కేసులో కూడా బిలాల్‌ను చూపించారు.

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కొంత కాలంగా బిలాల్ కనపడకుండా పోయాడు. బయటకు వచ్చిన తర్వాత తమ కుమారుడు బిలాల్‌ను పోలీసులే ఎక్కడో దాచిపెట్టారని హక్కుల సంఘాలతో తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు రెండు సార్లు బిలాల్ ఇంటిని సోదా చేసి, తల్లిదండ్రులను, బంధువులను ప్రశ్నించి, ఏమీ ఆధారాలు లభించకపోయినా మక్కా మసీదు పేలుళ్లకు బిలాల్ సూత్రధారుడని నిర్ధారించా రు. మక్కా మసీదు పేలుళ్ల సంఘటన జరిగిన 3 నెలల తర్వాత (ఆగస్టు 30, 2007) కరాచిలో జరిగిన ఎన్‌కౌంటర్ సంఘటనలో బిలాల్ మరణించాడని ప్రకటన వెలువడింది. ఇందులో మన రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొన్నారని, అందుకే బిలాల్ శవాన్ని గుర్తించగలి గామని పోలీసులు ప్రకటించారు. తల్లిదండ్రులు వెళ్లి శవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. మక్కా మసీదు పేలుళ్ల సంఘటనలో విచారణ నిమిత్తం విడతలు, విడతలుగా 70 మంది యువకుల్ని అరెస్టు చేశారు. వీళ్లను పోలీసు స్టేషన్లలో కాకుండా నగరం బయట ఫౌంహౌజెస్‌లో ఉన్న అతిథి గృహాలల్లో విచారణ పేరుతో నెలల కొద్ది ఉంది చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులకు వాళ్ల జాడ తెలుపలేదు. పాత బస్తీలోనేకాకుండా, నగరంలో ముస్లింలు నివసించే ఇతర ప్రాంతాల్లో పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. వాళ్లందరికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉండవచ్చు అనే అంశాన్నే పత్రికలు ప్రస్తావించాయి. ఎమ్.ఐ.ఎమ్ సహా రాజకీయ పార్టీలేవీ పోలీసుల అదుపులో ఉన్న యువకుల గురించి మాట్లాడలేదు. మానవ హక్కుల వేదిక, ఇతర హక్కుల సంఘాలు యువకల్ని అరెస్టు చేసిన వైనం గురించి, జరుపుతున్న చిత్రహింసల గురించి నివేదికలు ప్రచురించాయి. “సియాసత్‌”ఉర్దూ పత్రిక యాజమాన్యం “అన్‌హద్‌” అనే సంస్థను ఆహ్వానించి, “పబ్లిక్ హియరింగ్‌” నిర్వహించింది. అరెస్టు కాబడ్డ ముస్లిం యువకుల తల్లిదండ్రుల బంధువుల వాంగ్మూలాలు రికార్డు చేయించి, కథనాలుగా పత్రికలో ప్రచురించింది. బాలగోపాల్ చాలా కృసి చేసి జునైన్ అనే యునాని వైద్య విద్యార్థికి కోర్టు నుంచి బెయిల్ ఆర్డరు పొందగలిగాడు. అదే క్రమంలో అరెస్టులు చూపట్టబడ్డ ఇతర 20 మంది యువకుల కోసం బెయిల్ పిటిషన్లు న్యాయవాదులు కోర్టుల్లో వేసి కొందరికి బెయిల్ పొందగలిగారు. ఈ నిర్బంధ పరిస్థితికి స్పందించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్, ఎల్.రవిచందర్ అనే సీనియర్ న్యాయవాదిని, అక్రమ అరెస్టులు చిత్రహింసలపై విచారణ జరిపి నివేదిక తయారు చేయమని కోరింది. ఈ న్యాయవాది, బెయిలు పొందినవారిని, చర్లపల్లి జైలులో ఉన్న వ్యక్తుల్ని కలిసి వివరాలు సేకరించి మైనారిటీ కమిషన్‌కు సమర్పించాడు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు పూర్తి సహకారాన్ని అందించాయి. ఢిల్లీకి చెదిన అన్‌హద్ సంస్థ బాధ్యురాలైన శబ్‌నమ్ హశ్మినే కాకుండా హర్షమందిర్, నిర్మలా సీతారామన్ లాంటి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు కూడా చర్లపల్లి కారాగారం సందర్శించి, జైలులో ఉన్న యువకుల వాంగ్మూలాలు నమోదు చేసిన నివేదికలు తయారు చేశారు. అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తుండడంతో, సమాజంలో ఈ విషయాల పట్ల ప్రజాస్వామిక నిరసన వాతావరణం పెల్లుబికింది.

అజ్మీర్ షరీష్ దర్గాలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనపై దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్, ఎ.టి.ఎస్ (ఆంటి టెర్రరిస్ట్ స్కాడ్) సంస్థ, ఏప్రిల్ 27,2007 నాడు దేవేంద్రగుప్తా అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను అక్కడ అరెస్టు చేసింది. దర్యాప్తులో దేవేంద్ర గుప్తా హరిద్వార్‌కు చెందిన స్వామి అసీమానంద్, సునీల్ జోషీలు తనపై చేసిన వత్తిడి వల్ల తానే అజ్మీర్ షరీఫ్ దర్గాలో, హైదరాబాద్ మక్కా మసీదులో పథకం ప్రకారం బాంబు పేలుళ్ల కార్యక్రమం నిర్వహించానని ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోలు ఆధారంగా సిబిఐ 19 నవంబర్ నాడు స్వామి అసిమానంద్‌ను అదుపులోకి తీసుకొని విచారించింది. సిబిఐ ఆయనను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, హరిద్వార్ ఆశ్రమం నుండి అరెస్టు చేసింది. ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు సంజోతా ఎక్స్‌ప్రెస్, అజ్మీర్ షరీఫ్ దర్గా, మక్కా మసీదుల్లో బాంబు పేలుళ్ల చేసింది, ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగిన “జై వందేమాతరం”, “అభినవ్ భారత్‌” సంస్థలు అని స్వామి అసిమానంద్ ఒప్పుకున్నాడు. ఈ రెండు సంస్థలను సమన్వయ పరిచి “బాంబుకు బాంబుతోనే సమాధానం” అనే ఆర్‌ఎస్‌ఎస్ పాలసీలో భాగంగా తానే ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది విజయవంతం చేశానని ప్రకటించాడు. 2014లో ఫిబ్రవరి 14న “కారవాన్‌” అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కూడా తాము నిర్వహించిన బాంబు పేల్చివేత కార్యక్రమాలకు అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ, దాని కార్యదర్శి మోహన్‌భగవత్ సమ్మతి, మద్దతు లభించిందని కూడా తెలిపాడు. నిజానికి 2008వ సంవత్సరంలో, మహారాష్ట్ర ఎటిఎస్ అధిపతి హేమంత్ కర్కర్, తన విచారణలో భాగంగా తాను స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లో అభినవ్ భారత్ దేశంలో నిర్వహించిన 20 సమావేశాలకు సంబంధించిన సమాచారం లభించిందని చెప్పాడు. సైన్యం నుంచి పదవీ విరమణ పొంది ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి సలహాదారుడిగా వ్యవహరిస్తున్న లెఫ్ట్‌నెంట్ కల్నల్ పురోహిత్, తాను జమ్మూ- కశ్మీర్‌లో, 2006లో విధులు నిర్వహిస్తున్నపప్పుడు ఆర్‌డిఎక్స్ సంపాదించి, రహస్యంగా దాచుకున్నట్లు సమాచారం ఉందని, హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ అంశం పరిగణించమని, రాష్ట్ర నిఘా వర్గాలకు లిఖిత పూర్వకంగా తెలిపాడు. అయినా హైదరాబాద్‌లోని పోలీసు వర్గాలు హేమంత్ కర్కర్ ఇచ్చిన సమాచారాన్ని విచారణలో భాగంగా పరిశీలించక ప్రక్కన పెట్టాయి. అప్పటికే 21 మంది ముస్లిం యువకులపై చార్జిషీట్లు పెట్టారు. కాబట్టి, హైదరాబాద్‌లోని నిఘా వర్గాలు వాస్తవాలు తెలుసుకోవడం అనవసరం అని భావించినట్టున్నారు. 2010 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మక్కా మసీదులో కేసులో అసలు వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న వారందరూ నిర్దోషులని, ప్రభుత్వం తరపున క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. కాని అది అందరికీ సవ్యంగా అందలేదు. ఈ ఒక్క సంఘటన పరిశీలిస్తే పోలీసు నేర విభాగం విచారణ ఇష్టారాజ్యంగా చేసిందో అర్ధమవుతుంది. ఈ యువకులను తీవ్ర హింసలపాలు చేశారు. వాళ్ల కుటుంబాలు పూర్తిగా విధ్వంసం అయిపోయాయి. వాళ్లు, వాళ్ల బంధుమిత్ర కుటుంబాలు అప్రతిష్ట పాలైనాయి. చాలా మంది తమని చంపేస్తే బాగుండు అని తలంచినట్టు పోలీసు అదుపులో ఉన్నప్పుడు అనుకున్నామని తెలిపారు. నమాజ్ చేసినా ‘అల్లా’ అన్నా వీపులపై లాఠీలతో కొట్టేవారట. కొందరు పోలీసులు ‘జై శ్రీరామ్’ ‘పాకిస్థన్ డౌన్‌డౌన్’ అనే నినాదాలు ఇవ్వాలని హింసించారట. ఈ సమయంలో చట్టపరమైన హెబియస్ కార్పస్ పిటిషన్‌లు, సెర్చివారంట్, రాజ్యాంగపరమైన ఏ రక్షణలు పనిచేయలేదు. మలేగావ్ సంఘటనలో హిందూ సంస్థల ప్రమేయం ఉందని పరిశోధించి వాస్తవాలు బయటపెట్టిన హేమంత్ కర్‌కరే నిఘా శాఖ అధికారి ముంబై దుర్ఘటనలో మరణించడం యాదృచ్ఛికం కాదనే అనుమానం వ్యక్తమయినా పత్రికలుగాని, ఎలక్ట్రానిక్ మీడియా గాని పరిశోధించే ప్రయత్నం చేయలేదు. గుజరాత్ మారణహోమం మొదలు హిందూత్వ శక్తులు, సంస్థలు ప్రతి సంఘటనలోనూ గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు, సిమ్ కార్డులు, సరియైన లైసెన్సులు లేని ఎటువంటి ఆయుధాలు ఉపయోగించినా, ప్రభుత్వాలు, నిఘా వర్గాలు ఎప్పుడూ పట్టించుకోలేదు.

అన్ని బాంబు పేలుళ్ల కేసుల్లో ఉగ్రవాదులుగా అరెస్టయి, అక్రమ నిర్బంధంలో, అన్యాయంగా జైలు శిక్షలనుభవించిన ముస్లిం యువకులు నిర్దోషులుగా బయటకు వచ్చారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత రైళ్లలో జరిగిన మూడు పేలుళ్ల కేసుల్లో ఉరిశిక్ష బడ్డ ముగ్గుర్ని కూడా సుప్రీం కోర్టు సరియైన సాక్షాధారాలు లేవని విడుదల చేసింది.

అహ్మదాబాద్ దగ్గర అక్షరధామ్‌పై జరిగిన బాంబు దాడి కేసులో 2002వ సంవత్సరంలో అబ్దుల్ ఖయ్యూంతో బాటు ఇంకా నలుగురిపై కేసు నడిపించారు. కింది కోర్టుల్లో నలుగురికి ఉరిశిక్ష పడింది. 2014 మే నెలలో సుప్రీంకోర్టు వాళందర్ని నిర్దోషులుగా విడుదల చేస్తూ పోలీసుల దర్యాప్తు కేసు నడిపించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల్లో ఒకరైన అబ్దుల్ ఖయ్యూమ్ ప్రచురించిన “గ్యారసాల్ సలాంకోంకీ పీచే” (పదకొండు సంవత్సరాలు కటకటాలవెనుక) అనే పుస్తకం చాలా వివరంగా ముస్లింపట్ల పోలీసులు, నిఘా వర్గాలు, ప్రభుత్వాలు ప్రవర్తించిన తీరును బహిర్గత పరిచింది. 20 ఏళ్ల వయసులో ఉండగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని 1998లో అరెస్టు కాబడి, ఆయనకు 43 సంవత్సరాలు నిండిన తర్వాత నిర్దోషిగా విడుదలైన మహమ్మద్ అమీర్ ఖాన్ కథ వింటే మనం ఎటువంటి పాలనలో జీవిస్తున్నామో అర్థం కాక షాక్‌కు గురవుతాం. 18 సంవత్సరాల వయస్సు గల అమీర్ ఖాన్‌ను పాత ఢిల్లీలో రోడ్డుపై నడుస్తుం డగా సాదా దుస్తుల్లో ఉన్న పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. వివిధ పోలీసు స్టేషన్లలో భయంకరమైన చిత్ర హింసలు అనుభవించాడు. ఆయన వయస్సు కన్నా ఎక్కువ సంఖ్యలో 24 కేసుల్లో ముద్దాయిగా చూపెట్టారు. వేళ్లగోర్లు బలవంతంగా పీకేశారు. బెయిల్ కూడా లభించలేదు. 13 సంవత్సరాల 10 నెలలు భయంకరమైన జైలు జీవితం అనుభవించి ఆయన 41వ ఏట (2012లో) నిర్దోషిగా విడుదల చేయబడ్డాడు. గత సంవత్సరం ఆయన ప్రచురించిన “ప్రేమ్ డ్ యాస్ ఎ టెర్రరిస్టు” అనే పుస్తకంలో ఆయన అనుభవించిన నరకాన్ని వర్ణించాడు. ‘అసిమావాచ్’ అనే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ దాని 2011వ సంవత్సరం నివేదికలో దేశంలో ముస్లింపై అన్యాయంగా బనాయించిన కేసుల వివరాలను నమోదు చేసింది. అమీర్‌ఖాన్ విడుదలై ఆయన రాసిన పుస్తకం ప్రాచుర్యం పొందిన తర్వాత, జాతీయ మానవ హక్కుల కమిషన్, అమీర్‌ఖాన్‌ను అన్యాయంగా జైలులో పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేసినందుకు ఎందుకు నష్టపరిహారం చెల్లించలేదని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు.

పోలీసు వ్యవస్థలో, నిఘా వర్గాలలో, సైన్యంతో సహా పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు, అధికార్లు హిందుత్వ భావ ఆలోచనలు కలిగి ఉన్నారనేది నిర్వివాద అంశం. దేశంలో జరిగిన అన్ని మత సంఘర్షణల్లో ఈ పరిస్థితిని చూశాం. ఏదైనా సంఘటన జరగగానే అంతర్జాతీయంగా అలర్లర్లు సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు అయి ఉండాలి అనే అభిప్రాయంతోనే విచారణ మొదలౌతుంది. అరెస్టులు జరిగి విచారణ పూర్తయిన తర్వాత, అరెస్టు కాబడ్డవాళ్లు నిర్ధోషులని తెలుస్తుంది. దేశంలో టాడా చట్టం కింద 77,000 మందిని అరెస్టు చేస్తే 72,000 మంది నిర్దోషులుగా విడుదల చేయబడ్డారు. ఇందులో ఎక్కువ శాతం ముస్లింలు, విప్లవ సంస్థలకు చెందిన కార్యకర్తలే. ‘టాడా’ చట్టం రద్దయిన తర్వాత కూడా చాలా మంది జైళ్లల్లోనే ఉంచబడ్డారు. దేశంలోని 18 రాష్ట్రాలలో దాదాపు 3 వేల మంది పైనే టాడా రద్దయిన తర్వాత కూడా చాలా కాలం వరకు విడుదలకు నోచుకోలేదు. గుజరాత్‌లో టాడా చట్టం కింద, ఆ చట్టం అమలులోకి వచ్చినప్పుడు అరెస్టు కాబడ్డ వారందరు ముస్లింలే. ఒక దశలో మహారాష్ట్ర జైళ్లలో ఉన్న 32.4 శాతం మంది నిందితుల్లో 10.6 శాతం మంది ముస్లింలే. గుజరాత్‌లో ముస్లిం జనాభా 9.06 శాతం. ఇందులో నాలుగో వంతు జైలుకు వెళ్లి నిర్దోషులుగా బయటికి వచ్చినవారే జమ్మూకాశ్మీర్ తర్వాత అస్సాంలో ఎక్కువ సంఖ్యలో ముస్లిం జనాభా (30.9 శాతం) కలిగి ఉంది. ఇందులో జైళ్లలో 28.1 శాతం ముస్లింలే కనపడ్తారు. కర్నాటకలో ముస్లిం జనాభా 12.23 శాతం అందులో 17 శాతం మంది జైలులో గడిపి వచ్చిన వారే. ఈ గణాంకాలు గమనిస్తే అనుమాన భావన ఏవిధంగా ఒక కమ్యూనిటిని నేరస్తులుగా చిత్రిస్తుందో అర్థం అవుతుంది.

ఒక మైనారిటీ సమూహాన్ని టార్గెట్ చేయడం నాగరిక సమాజానికి, ప్రజాస్వామిక, లౌకిక సంస్కృతికి తీవ్రమై మచ్చ. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయత, దేశభక్తి గోసంరక్షణ పేరుతో ముస్లిం కమ్యూనిటిపై, దళితులపై దాడులు పెరిగి తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టబడుతున్నారు. పౌర సమాజం ఈ పరిస్థితి గురించి, ప్రశ్నించి, ప్రజాస్వామిక సంస్కృతి, న్యాయభావన కోసం తపన పడకుంటే, దేశంలో ఉన్న పెద్ద మైనారిటీ వర్గానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ముస్లిం మతస్తులపై నెలకొన్న అనుమాన భావనను పటాపంచలు చేయడానికి ప్రజాస్వామిక వాదులుగా మన కృషిని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది.

S.Jeevan-Kumar

– ఎస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల వేదిక
9573 405 551