Home తాజా వార్తలు సర్వం సిద్దం

సర్వం సిద్దం

మెగా సంగ్రామానికి సర్వం సిద్దం

14 నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్

foot-ball
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడగా పేరొందిన ఫుట్‌బాల్ విశ్వ కప్ సంగ్రామానికి రష్యా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 32 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా క్రీడా పండుగకు గురువారం తెరలేవనుంది. ఒలింపిక్స్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన మెగా ఈవెంట్ ఇదే అనడంలో సందేహం లేదు. అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల ఫుట్‌బాల్ జట్లు కప్పు కోసం సిద్ధమయ్యాయి. రష్యా రాజధాని మాస్కోలోని చారిత్రక లుజుంకి స్టేడియంలో గురువారం ఈ మెగా క్రీడా సంబురానికి తెరలేస్తోంది. జూన్ 14న ప్రారంభమయ్యే ఈ ప్రపంచకప్ జులై 15న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. మొత్తం 65 మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. 12 వేదికల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. ప్రారంభ, ముగింపు వేడుకలను కనుల పండవగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 80వేల మంది అభిమానుల సమక్షంలో ప్రారంభ, ముగింపు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రఖ్యాత సంగీత కళాకారుడు రాబీ విలియమ్స్‌తో పాటు రష్యన్ తార అయిడా గరిపుల్లినా కూడా గొంతు కలపనుంది. అంతేగాక దాదాపు 500 మంది డ్యాన్సర్లు, జిమ్నాస్ట్‌లు, సాహస క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో కనువిందు చేయనున్నారు. కాగా, ప్రారంభ వేడుకలకు బ్రెజిల్ స్టార్ రొనాల్డొ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్ జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. నెల రోజుల పాటు ఫుట్‌బాల్ ప్రేమికులను తమ విన్యాసాలతో అలరించేందుకు దిగ్గజ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డొ, వార్నర్, పౌలో దైబాలా, ఎంబాపె తదితరులు సిద్ధమయ్యారు.

మాస్కో: కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సాకర్ పండగకు సర్వం సిద్దమైంది. రష్యా వేదికగా జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ సమరానికి గురువారం తెరలేవనుంది. రష్యా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా క్రీడా సంగ్రామంలో మొత్తం 32 జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్లను మొత్తం 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కొ గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి. ఈ మెగా టోర్నీ కోసం రష్యా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు విస్త్రృత ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ఆతిథ్యం ఇస్తున్న అన్ని నగరాల్లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయా జట్లు ఇప్పటికే రష్యా చేరుకున్నాయి. అయితే తొలిసారి ఇటలీ ఈ విశ్వకప్‌కు దూరమైంది. ప్రపంచకప్ అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. దీంతో తొలిసారి ఆ జట్టు లేకుండా ప్రపంచకప్ జరుగనుంది. ఈసారి కూడా దక్షిణ అమెరికా, యూరప్ జట్ల మధ్య ట్రోఫీ కోసం హోరాహోరీ తప్పెలా లేదు. బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, కొలంబియా, కొస్టారికా, పెరూ, మెక్సికో తదితర అమెరికా జట్లు సంచలనం కోసం పరితపిస్తున్నాయి. మరోవైపు యూరప్‌కు చెందిన జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు కూడా కప్పుపై కన్నేశాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతి జట్టులో ఉండే నాలుగు జట్లు ప్రత్యర్థితో ఒక్కొసారి తలపడుతుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, ఆసియా నుంచి ఈసారి దక్షిణ కొరియా, సౌది అరేబియా, ఇరాన్, జపాన్ జట్లు అర్హత సాధించాయి. గురువారం ఆతిథ్య రష్యాసౌది అరేబియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ సంగ్రామానికి తెరలేస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. 2006 తర్వాత యూరప్ సాకర్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా, ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రష్యా సర్వం ఒడ్డుతోంది. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఈ విశ్వ కప్‌ను నిర్వహించి సత్తా చాటాలని తహతహలాడుతోంది.
ఆరంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు
గురువారం జరిగే ప్రపంచకప్ ఆరంభ వేడుకలకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనుల పండవగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కళ్లు చెదిరే విన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను కనువిందు చేయనున్నాయి. ప్రారంభ వేడుకలకు లూజింకి స్టేడియం సర్వంగ సుందరంగా సిద్ధమైంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సేపు ముందు ఈ వేడుకలు జరుగుతాయి. కాగా, ప్రపంచకప్‌కు మొత్తం 12 వేదికలను సిద్ధం చేశారు. ఈసారి విశ్వకప్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రారంభ, ముగింపు వేడుకలకు లూజింకి స్టేడియం వేదికగా నిలువనుంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ స్టేడియంలో 80 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంటుంది. రష్యాలో ఇదే అతి పెద్ద స్టేడియం.

పాల్గొంటున్న జట్లు ఇవే..

గ్రూప్‌ఎ: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే
గ్రూప్‌బి: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్
గ్రూప్‌సి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్
గ్రూప్‌డి: అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రోయేసియా, నైజీరియా
గ్రూప్‌ఇ: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కొస్టారికా, సెర్బియా
గ్రూప్‌ఎఫ్: జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా
గ్రూప్‌జి: బెల్జియం, పనామా, ట్యూనిసియా, ఇంగ్లండ్
గ్రూప్‌హెచ్: పోలండ్, సెనగల్, కొలంబియా, జపాన్