Home దునియా విశ్వభారతి

విశ్వభారతి

Foreign

సంప్రదాయాలు,సామజిక అలవాట్లు ఒక్కో దేశానికి,ప్రాంతానికీ ఒక్కో రకంగా ఉంటాయి. 120 కోట్ల జనాభా గల భారతదేశంలో భాషలు,ఆచారాలు,కళలు,సంప్రదాయాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. భారతదేశానికి సందర్శన కోసం వచ్చి వెళ్ళే విదేశీయులపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. విదేశీ సందర్శకులు ఇక్కడికి వచ్చి వెళ్ళేప్పుడు ఇండియా గూర్చి జనాభా ఎక్కువ, భిన్నత్వం ఎక్కువ,అస్తవ్యస్త వ్యవస్థ ఎక్కువ… ఇలా అన్నీ ఎక్కువే అని చెప్పడం వింటూనే ఉంటాం. ఎంతగా ఎక్కువ అని చెప్పినా తిరిగి వారు ఇండియాను ఎక్కువగా ఇష్టపడడం కూడా సాధారణమే. విదేశీయులకు మన ఆచార వ్యవహారాలు కొంత ఇబ్బందిగా అనిపించినా,ఇక్కడికి సందర్శనకు వచ్చివెళ్ళే చాలామంది విదేశీయులు మన అలవాట్లను కూడా వారి దేశాలకు తీసుకువెళ్ళడం కన్పిస్తుంది. తన వస్త్ర ధారణతో ప్రపంచానికే ఫ్యాషన్ చిహ్నంగా నిలిచిన ప్రిన్సెస్ డయానా కూడా రితు కుమార్ డిజైన్ చేసిన వస్త్రాలను మన దేశం నుండి తీసుకువెళ్ళేవారు. విదేశీయులు మన దేశం నుండి తీసుకు వెళ్ళిన అయ్యో,అచ్ఛా వంటి మాటలతో పాటు కొన్ని అలవాట్లు..

చాయ్ ని సాసర్లో చల్లార్చడం – భారతదేశంలో ఉదయాన్నే చాయ్ తాగకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. చాయ్‌ని కప్పులో పోసి సాసర్ కింద ఉంచి అందించడం ప్రతి హోటల్లో సర్వసాధారణం.ఈ పద్ధతిని అమెరికాకు చెందిన సామ్మర్ షెల్స్ తన దేశానికి తీసుకువెళ్ళారు. గుజరాత్‌లో పర్యటించినప్పుడు స్థానికులను చూసి చాయ్ తాగే విధానాన్ని నేర్చుకున్నానంటున్నారు షెల్స్.ఈ పద్ధతి మా దేశంలో ఇబ్బందిగా అనిపించినా,ఇలా తాగడం వల్ల నేను నా నోటిని కాలకుండా కాపాడుకుంటున్నానని చెబుతున్నారు.

అన్నం తినడానికి ఐదు వేళ్ళు – చేత్తో చేసే భోజనం మేధస్సు,ఆత్మ,శరీరానికి శక్తినిస్తుందంటారు. భారతదేశానికి వచ్చి వెళ్ళే విదేశీయులు ఈ ఆచారాన్ని వారితో పాటు తీసుకువెళ్తున్నారు.ఇలా భోజనం చేయడం వల్ల వృధా తగ్గడమే కాకుండా తిన్న ఆహారం రుచిగా ఉండి త్వరగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన రేచల్ రుకెర్ట్ చేతి వేళ్ళ తో పప్పు అన్నం కలపడం వల్ల నాక్కావల్సిన రుచులను కావలసినంత మోతాదులో కలుపుకోగలుగుతున్నాను అని చెబుతున్నారు.

తలను రెండువైపులా తిప్పడం – మాట్లాడుతూ సున్నితంగా తల ఊపే అలవాటున్న విదేశీయులకు మనం తరచూ తల అటూ ఇటూ తిప్పుతూ చేసే సంభాషణ అర్థం కాదు.మనం ఏం చెబుతున్నాం ‘అవునా..కాదా..సరేనా’ అనేది అర్థం కాదని వారంటున్నారు.ఏదేమైనా భారతీయులు తల ఊపే విధానం మాత్రం వారికి నచ్చిందట.మన దేశంలో ఎక్కువ రోజులు బస చేసిన విదేశీయులు వారికి తెలియకుండానే తల అటు-ఇటు ఆడించడం అలవాటైపోయిందంటున్నారు.ఇలా తలాడించే వారిని చూసినప్పుడు అవతలివారు కూడా అలాగే స్పందించడం బాగుంటుందని అంటున్నారు విదేశీయుడు బెన్ వైజ్.

ముదురు రంగు దుస్తులు – ముదురు రంగులతో కూడిన భారతీయ వస్త్రధారణ సాధారణంగా విదేశీయులు ఇష్టపడరు.ఎంత ముదురు రంగు దుస్తులైనా సరే వేసుకోవడానికి వెనుకాడరు భారతీయులు.ఇక్కడకు వచ్చిన విదేశీయులు ముదురు రంగు దుస్తులు వేసుకున్నా తిరిగి వారి దేశానికి తీసుకువెళ్ళడానికి సంకోచిస్తారు,కాని ఈ రకమైన దుస్తులు ధరించినప్పుడు వారిలో ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పారు.దాంతో వారి దేశానికి ఈ దుస్తులను తీసుకుపోవడానికి ఇష్టపడ్డారనీ చెబుతున్నారు. విదేశీయురాలైన రేచల్ రుయ్‌కర్ట్ నాకు నచ్చిన రంగు పసుపు.ఇది అమెరికాలో అంతగా ఇష్టపడరు,కాని భారతదేశంలో నేను ముదురు పసుపు రంగు సల్వార్,కమీజ్ కూడా వేసుకున్నాను.అది నాకెంతో ఆత్మ స్థైర్యాన్నిచ్చింది.ఈ వస్త్ర ధారణను నేను నా దేశంలో కూడా కొనసాగిస్తున్నాను అని చెప్పారు.

ఇంటి ముందు బూట్లు విప్పడం – పాదరక్షలు ఇంటి ముందు వదలి వెళ్ళడం భారతీయ సంప్రదాయం.దీన్ని గమనించిన విదేశీయులు ఈ పద్ధతిని ఇష్టపడుతూ పాటించడం గమనార్హం. అద్భుతమైన అలవాటు ఇది.దార్లో నడిచేప్పుడు మనం దేనిమీద అడుగేశామో తెలియదు కాబట్టి పాదరక్షలను ఇంటి బయట వదలడం శుభ్రతకు చిహ్నం.ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఈ పద్ధతిని పాటిస్తున్నాను అని అంటారు బెన్ వైజ్.