Home తాజా వార్తలు కలప స్మగ్లింగ్ కు అటవీశాఖ చెక్!

కలప స్మగ్లింగ్ కు అటవీశాఖ చెక్!

 

కార్డన్ సెర్చ్ తరహా దాడులకు అటవీశాఖ కసరత్తు
అటవీ సమీప గ్రామాల్లో ఇకపైన ముమ్మర కూంబింగ్
ప్రాథమిక సమాచారణ పూర్తి
450 మంది కలప నిందితుల జాబితా సిద్ధం
30 మంది అరెస్టు చేసిన అధికారులు
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న తరహాలో అటవీ శాఖ కూడా ఇకపై కలప స్మగ్లింగ్ నిరోధానికి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో కార్యాచరణ ప్రణాళికను అటవీశాఖ సిద్ధం చేసింది. ఇందుకు పోలీసు శాఖ సహకారాన్ని కూడా తీసుకోనుంది. అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో కార్డన్ సెర్చ్ తరహా దాడులను నిర్వహించి ఈ వృత్తిపైనే ఆధారపడుతున్న క్షేత్రస్థాయి స్మగ్లర్లను ఏరివేయాలనుకుంటోంది. ప్రభుత్వం ఒకవైపు అడవులను పెంచాలని భావిస్తూ పెద్ద ఎత్తున హరితహారం లాంటి కార్యక్రమాన్ని అమలుచేస్తూ మొత్తం మొక్కలో సుమారు 50% మేర అడవుల్లోనే నాటే ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు స్మగ్లర్ల కారణంగా ఏపుగా పెరిగిన చెట్లు కనుమరుగు కావడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అందువల్లనే త్వరలో పోలీసుశాఖ సహకారంతో అటవీ గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ తరహా దాడులను నిర్వహించి ఇప్పటికే నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకోవడంతోపాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పలు గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లోని పరిస్థితులపై అటవీశాఖ అధికారులు అధ్యయనాన్ని కూడా పూర్తిచేశారు.

కలప స్మగ్లింగ్‌కు ఎలాంటి మార్గాలను అనుసరిస్తున్నారు, ఏయే రూపాల్లో రవాణా అవుతోంది, ఎక్కడకు తరలుతోంది, స్మగ్లర్ల నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉంది తదితర వివరాలన్నింటిని ఒక మేరకు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. కలప స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న గ్రామాల్లోని ప్రజలను గుర్తించే పని ముమ్మరంగా జరుగుతోంది. కలప అక్రమ రవాణాకు సహకరించే అటవీ, పోలీసుశాఖల్లోని సిబ్బంది వివరాలు, రవాణాకు సిద్ధంగా నిల్వ చేసిన ప్రాంతాలు తదితర వివరాలను కూడా అటవీశాఖ సేకరించింది. సుమారు 450 మంది స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. కలప వ్యాపారమే లక్షంగా పనిచేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.

ఇప్పటికే 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేసిన అటవీ అధికారులు వారి నుంచి 75 లక్షల రూపాయల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిరుపయోగంగా ఉన్న గోదాములతో పాటు పాడుబడిన భవనాలు, మూతపడిన పరిశ్రమలు తదితర ప్రాంతాలను నిల్వ కోసం వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక సిమెంట్ కంపెనీ ప్రాంగణాన్ని కూడా కలప నిల్వకోసం వినియోగిస్తున్నట్లు గుర్తించింది. ఇటీవల కలప రవాణాతో పాటు జంతువులను వేటాడే వారికి సహకరించిన పలువురు అధికారులు, సిబ్బందిపై అటవీశాఖ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇక అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చిన్న పట్టణాల్లోని సా మిల్లులతో పాటు కార్పెంటర్ల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సా మిల్లులకు కలప ఎక్కడ నుంచి వస్తోంది, కార్పెంటర్లు ఎవరికి ఎలాంటి ఫర్నీచర్‌ను తయారుచేస్తున్నారు తదితర సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. ఇప్పటికే ఒక అటవీ శాఖ ఉద్యోగిపై పి.డి యాక్డును ప్రయోగించారు. త్వరలో కార్డన్ సెర్చ్ ప్రారంభం కానుంది.

Forest Department reveals 450 timber smugglers list