Home తాజా వార్తలు కలపకు కనురెప్ప

కలపకు కనురెప్ప

 

దొంగల ఆటకట్టుకు అడవిని జల్లెడ పడుతున్న అటవీ, పోలీసు శాఖలు

20 రోజుల్లో 554 గ్రామాలు 387 సామిల్లుల్లో ఉమ్మడి తనిఖీలు

 ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో 5 పి.డి. కేసులు
 449 కేసుల నమోదు, 480 టన్నుల కలప స్వాధీనం
 అరణ్యభవన్ నుంచి అధికారులతో సమావేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: అడవితో పాటు అటవీ సంపదను కాపాడాల్సిందేన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల్లో కదిలిన అటవీ శాఖ యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ, పోలీసుశాఖలు సంయుక్తంగా 54 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించడంతో ఇప్పటికే 40 చెక్‌పోస్టులు సాయుధ పోలీసులతో ఏర్పాటయ్యాయి. నిరంతరం నిఘాను పెంచినట్లు అటవీ శాఖ యంత్రాంగం వెల్లడించింది. పూచికపుల్ల కూడా అడవుల నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ రెండు శాఖల సిబ్బంది సంయుక్త ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. గడచిన 20 రోజులుగా తనిఖీలను ముమ్మరం చేసిన ఈ రెండు శాఖల అధికారులు, సిబ్బంది అనుమానిత ప్రాంతాలతో పాటు ‘సా మిల్లు’ల్లో కూడా సోదాలను నిర్వహించారు. ఇన్‌ఫార్మర్ల నుంచి వచ్చిన సమాచారం, స్థానిక ప్రజల్లో తలెత్తిన అనుమానాలతో పాటు ఇతర మార్గాల నుంచి వస్తున్న సమాచారంతో వెంటవెంటనే దాడులను చేపడుతున్నారు.

ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభమైన సంయుక్త దాడుల్లో భాగంగా గడచిన ఇరవై రోజుల వ్యవధిలో వివిధ జిల్లాల్లోని 554 గ్రామాల పరిధిలోని పలు ప్రాంతాల్లో 387 సా మిల్లుల్లో తనిఖీలను నిర్వహించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కలప రవాణా, అడవి నరికివేతతో పాటు అడవులను నాశనంచేసేవారికి సంబంధించిన అంశాలపై కార్పెంటర్లతో మాట్లాడి కలప ఎక్కడి నుంచి వస్తుందో, ఏయే రూపాల్లో ఎక్కడెక్కడకు పోతూ ఉందో, దీని వెనక ఉన్నవారెవరు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా 309 దూగుడ మిషన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు తరచూ అటవీ నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో 33 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి వచ్చిన వివరాలకు మేరకు ఆదిలాబాద్‌లో రెండు, కొత్తగూడెంలో మూడు చొప్పున పి.డి కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు వివిధ సెక్షన్ల కింద 449 కేసులను బుక్ చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. రూ. 70 లక్షల విలువ చేసే 480 మెట్రిక్ టన్నుల కలపను అటవీశాఖ స్వాధీనం చేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు అటవీ రక్షణకు సంబంధించి 544 ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించామని తెలిపారు. ఇటీవల అటవీ చట్టాలకు మరింత పదునుపెట్టి కఠినంగా అమలు చేయాలనే ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అడవులతో కూడిన జిల్లాల్లో అటవీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు ఉమ్మడి తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. అనుమానిత ప్రాంతాలతో పాటు సా మిల్లుల్లోనూ సోదాలు చేపడుతున్నారన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ ఆదేశాలు జారీచేసింది. అటవీ సంపదను స్మగ్లర్ల నుంచి, వన్య ప్రాణులను వేటగాళ్ల నుంచి రక్షించేందుకు చర్య లను తీవ్రం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని గుర్తుచేశారు. త్వరలోనే జిల్లాల వారీగా అటవీశాఖ ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పి, డిఎఫ్‌ఓలతో ఉమ్మడిగా సమావేశాలను నిర్వహించారు. ఇకపైన ప్రతి మండలం, గ్రామాల వారీగా అటవీ ప్రాంతాలను గుర్తించి స్మగ్లింగ్‌కు, వేటకు అస్కారం ఉన్న ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయడంపై ఆయా జిల్లాల అధికారులు చర్చించారు. నాలుగు రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్స్‌రెన్స్ ద్వారా వెల్లడించిన విషయాలను ఆయా సమావేశాల ద్వారా క్షేత్రస్థాయిలోని సిబ్బంది , అధికారులకు అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే జిల్లాల వారీగా అటవీ రక్షణ ప్రణాళికలను ఫిబ్రవరి ఆరవ తేదీలోగా పంపాలని సిఎస్ ఆదేశించడంతో జిల్లాల యంత్రాంగం ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైందన్నారు. ఇందులో ప్రధానంగా అటవీ ప్రాంతం, సరిహద్దులు, ఆక్రమిత అటవీ భూములు, వ్యూహాత్మక చెక్ పోస్టుల ఏర్పాటు, ప్రయోజనకరంగా సిబ్బంది వినియోగించడం, అటవీ ప్రాంతంలో ఉన్న బేస్ క్యాంపులు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు తదితర అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు ఆరణ్య భవన్ నుంచి సమీక్షిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ అధికారులతో ఉమ్మడి సమావేశాలను నిర్వహించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Forest Police Officials Search in Kothagudem Forests