Home ఎడిటోరియల్ కొత్త జిల్లాలపై కోటి ఆశలు

కొత్త జిల్లాలపై కోటి ఆశలు

Map-of-telanganaప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు చారిత్రకంగా, రాజకీయంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రతిపాదిత కొత్త జిల్లాలకూ అంతే ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి సత్వరంగా అందుబాటులోకి రావడానికి, నిర్వహణ, తనిఖీ, నిఘా వ్యవస్థలు పటిష్టంగా పనిచేయ డానికి పరిపాలన వికేంద్రీకరణ కావాలి. అందుకు ఈ జిల్లాల పెంపు ఉపయోగపడుతుంది. ప్రజలు తమ అవసరార్థం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలకు వెళ్ళడం ప్రస్తుతం కష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం జిల్లాని, బ్లాక్‌ని (మండలం) యూనిట్‌గా తీసుకొని బడ్జెట్ కేటాయించడం, పలు పథకాలని అమలు జేస్తుండ డంతో జిల్లాల ప్రాధాన్యత, మండలాల ఆవశ్యకత పెరిగింది. దీనికి తోడు తెలంగాణ రాష్ర్ట సమితి ఉద్యమ సందర్భంలోనూ, ఆ తర్వాత ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ప్రతి ఐదు నియోజక వర్గాలకు ఒక జిల్లాని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నది. “కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేయడం వలన పరిపాలన మరింత చేరువవుతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పరిపాల నకు చేరువవుతారు. సమీప భవిష్యత్తులో 24 జిల్లాలు సమాంతరంగా అభివృద్ది చెందడానికి, జిల్లా కేంద్రాలు ముఖ్యపట్టణాలుగా ఎదగడానికి అవకాశముంటుంది” అని టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

దీనికి అనుగుణంగానే కొత్త జిల్లాలను శాస్త్రీయ పద్దతిలో రూపొందించడానికీ, ఆయా జిల్లా కేంద్రాల్లో హెలికాప్టర్ లాండింగ్‌తో సహా అన్ని ఆధునిక వసతులతో కూడిన సమగ్రమైన కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 14 లేదా 15 కొత్త జిల్లాలు దాదాపు 40 కొత్త మండ లాలు తెలంగాణ రాష్ర్టంలో నూతనంగా ఏర్పాటు కానున్నాయని వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిపిన సమీక్షా సమావేశాల్లో ముఖ్య మంత్రి చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్య పెరు గొచ్చు కూడా! ఈ కొత్త జిల్లాల ప్రకటన అధికారికంగా జూన్ రెండున రాష్ట్రావతరణ రోజున జరగనుంది. అలాగే జిల్లా కేంద్రాలు అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవం లేదా దసరా నుంచి పాలనలో భాగస్వాము లవుతాయని కూడా ప్రభుత్వం చెబుతుంది. నవ తెలంగాణ నిర్మాణానికి ఇది కచ్చితంగా పటిష్టమైన పునాదు లేస్తుందనడంలో సందేహం లేదు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఈ జిల్లాల ఏర్పాటు జరిగింది. రెండు పార్లమెంటు స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో 17 జిల్లాలుండగా అన్నే స్థానాలున్న గోవాలో రెండే జిల్లాలున్నాయి. అలాగే 11 పార్లమెంటు స్థానాలున్న ఛత్తీస్‌ఘడ్‌లో 27 జిల్లాలుండగా, పది పార్లమెంటు స్థానాలున్న హర్యానా లో 21 జిల్లాలున్నాయి. ఆరు పార్లమెంటు స్థానాలున్న జమ్ముకాశ్మీర్‌లో 22 జిల్లాలున్నాయి. అయితే 17 పార్లమెంటు స్థానాలున్న తెలంగాణలో కేవలం పది జిల్లాలున్నాయి. ప్రస్తుతం దాదాపు 12 అసెంబ్లీ స్థానాలకు కలిపి ఒక జిల్లా ఉన్నది. దీన్ని విభజించి ప్రతి ఐదు నియోజకవర్గాలకు (అంటే 10 నుంచి 15 లక్షల జనాభా) కలిపి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కచ్చితంగా అభినందిం చాల్సిందే! స్వాగతించాల్సిందే! ఈ జిల్లాల ఏర్పాటు వల్ల అగ్రకులా ల వారి ఆధిపత్యం కొంతమేరకైనా తగ్గుతుంద నడంలో సంశయం అక్కర్లేదు. రాజకీయంగా ఆ మేరకు కింది కులాల వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చే మరో అంశం ఏంటంటే ప్రస్తుతం కోటాగా ఉన్న 163 మంది ఐఎఎస్ అధికారులకు తోడుగా మరి 43 మందిని భారత ప్రభుత్వం కేటాయించింది. దీని వల్ల పరిపాలన సజావుగా సాగడానికి వీలవుతుంది.

నిజానికి ఈ ఎన్నికల హామీని గతంలోనే అమలు పరుస్తారని భావించారు. అయితే అసెంబ్లీ సీట్ల పెంపు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండడంతో అది సాధ్యం కాలేదు. త్వరలో అసెంబ్లీ సభ్యుల సంఖ్యను పెంచడానికి పార్లమెంటులో తీసుకురానున్న సవరణ బిల్లు ఆమోదం పొందినట్లయితే ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సభ్యుల సంఖ్య 153కు పెరగనుంది. అంటే కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలుంటాయి. దీనివల్ల పాలన వికేంద్రకరణై ప్రజలకు చేరువవుతుంది. అంతేగాకుండా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కలెక్టర్, పోలీస్ సూపరిం టెండెంట్, మెడికల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలొస్తాయి. కొత్త కార్యాల యాలంటే కొత్త ఉద్యోగాలు, ఉన్న వారికి ప్రమోషన్లు. వీటన్నింటికి తోడు ఆయా జిల్లా కేంద్రాల్లో రియల్‌ఎస్టేట్ యాక్టివిటీ పెరగడమే గాకుండా నేరుగా హైదరాబాద్‌కు నాలుగులేన్ల (కనీసం) కనెక్టివిటీ రోడ్డు ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పుంజుకుంటుంది. జిల్లా కేంద్రాలతో పాటుగా 40 మండలాలు కూడా కొత్తగా వస్తాయంటే ఇప్పటికే మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలు కొత్త కేంద్రాలుగా మారు తాయి. వీటివల్ల ఇప్పటి వరకు రెసిడెన్షియల్ కాలేజీలు, గురుకులాలు లేని ప్రాంతాలకు కొత్తగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటయ్యే అవకాశ ముం టుంది. మండల కేంద్రంలో ప్రస్తుతముండే ఎంఆర్‌ఒ, ఎంపిడివొలతో పాటుగా ప్రభుత్వ రంగంలోని వివిధ కార్యాలయాలు మారుమూల గ్రామాలకు కూడా వచ్చే అవకాశముంటుంది. దీంతో గ్రామస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.

జిల్లాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో 1953లో వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు నల్లగొండ జిల్లాలో భాగమైన జనగామ ప్రాంతాన్ని ఇదే కాలంలో వరంగల్ జిల్లాలో చేర్చడం జరిగింది. దాని తర్వాత మర్రి చెన్నారెడ్డి పూనిక మేరకు 1978 ఆ ప్రాంతంలో గతంలో అత్రాఫ్‌బల్దా పేరిట ఉన్న ప్రాంతంతో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జిల్లాల ఏర్పాటు జరగలేదు. అప్పటికి ఇప్పటికీ జనాభా రెండింతలు పెరిగింది. నిజానికి హైదరాబాద్ రాష్ర్టం ఏర్పాటు జరిగిన సమయంలో దాదాపు పది లక్షల మందికి ఒక జిల్లా ఉండింది. ఇప్పుడు కొత్తగా 10-12 లక్షల మంది జనాభాకు ఒక జిల్లా ఏర్పాటు కానుంది.
ప్రస్తుతమున్న జిల్లాలకు తోడుగా సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, కొత్తగూడెం, భువనగిరి, మంచిర్యాల/ఆసిఫాబాద్, జగిత్యాల, కామా రెడ్డి, చార్మినార్, గోలకొండ, సికింద్రాబాద్, జనగామ, భూపాలపల్లిలు కొత్తజిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. వీటిలో ఒక్కో జిల్లాలో నాలుగు నుంచి ఆరు వరకు అసెంబ్లీ నియోజక వర్గాలుంటాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు అంటే బయటికి పరిపాలన పరమైన సౌలభ్యం గా కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం రాజకీయ శక్తులు కన్సాలిడేషన్ (సంఘటితం కావడా నికి)కు ఇది తోడ్పడుతుంది. యుపిలో మాయావతి కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయంగా నిలదొక్కుకున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పడ్డ ప్రదేశాల్లో బిఎస్‌పి రాణించింది. రాజకీయంగా బలోపేతం కావడానికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుత ప్రభుత్వానికి తోడ్పడుతుంది. అన్నీ సాఫీగా సాగితే జిల్లాల ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు సాధిస్తుంది. కాని ప్రస్తుతమున్న పరిస్థితిలో అది అంత సులభమేమీ కాదు. బలమైన నాయకుడున్న ప్రతి ప్రాంతమూ తమ నియోజక వర్గమే/పట్టణమే జిల్లా కేంద్రం కావాలని దాని చుట్టూత ఉన్న నియోజక వర్గా లు అందులో చేరాలని డిమాండ్ చేసే అవకాశ ముంది. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు అంటే తేనె తుట్టెను కదిలించడమే! ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమిది. ఎంత పకడ్బందీగా, శాస్త్రీయంగా ఈ జిల్లాల ఏర్పాటు జరిగినా ఏదో ఒక ఉప ప్రాంతానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. దానికి తోడు ఈ జిల్లాలకు ఏం పేరు పెట్టాలి? ఎవరి పేరు పెట్టాలి అనే విషయంలో కూడా భిన్నభిప్రాయా లేర్పడతాయి.

ఎంత శాస్త్రీయత మంత్రం జపించినా ప్రభుత్వం సూచనలు, సలహాలు, రికమండేషన్లు కచ్చితంగా అమలు జరపాల్సి ఉంటుంది. ఇక కొత్త జిల్లాలకు రోజు రోజుకు డిమాండ్ కూడా పెరుగుతోంది. జనగామతో పాటుగా, ములుగును కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలని మాజీ మంత్రి అక్కడి ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రభుత్వానికి వినతి పత్రం ఇదివరకే సమర్పించారు. ఆలేరుని జనగామలో కలుపకుండా యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేయాలి. లేదంటే భువనగిరిలో కలుపాలె అనే డిమాండ్ కూడా ముందుకొస్తుంది. జిల్లా కేంద్రమేదైనా తాము కోరుకున్న ప్రాంతంలోనే తమ నియోజక వర్గం ఇంకా చెప్పాలంటే మండలం ఉండాలని ప్రజలు కోరుకుంటారు. పలానా జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని కొందరు, కలపకూడదని మరి కొందరు ఉద్యమాలు చేపట్టే అవకాశముంది. ఇట్ల ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయుధంగా భావిస్తున్న జిల్లాలు/మండలాల ఏర్పాటు టిఆర్‌ఎస్‌కు బూమరాంగ్ కూడా కావచ్చు. ఎదురు తిరగొచ్చుకూడా. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు అంటున్నారు. దీనికి మండలాలు, నియోజక వర్గాలు, జనాభా, జిల్లా కేంద్రంలోని ప్రస్తుత వసతులు, భవిష్యత్తులో అభివృద్ధికి వెసులుబాటు, రవాణా సదుపాయాలు, నియోజక వర్గాల నుంచి జిల్లా కేంద్రం దూరం, ప్రజల డిమాండ్ అన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాలు/మండలాల ఏర్పాటు జరగాలె.

కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో ఆసిఫాబాద్/ మంచిర్యాలకు కొమరం భీవ్‌ు, వరంగల్ జిల్లా భూపాలపల్లికి జయశంకర్ సార్ పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. చాలా కాలం తాను ప్రాతినిధ్యం వహించిన భువనగిరికి కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు, సికింద్రాబాద్‌కు సదాలక్ష్మి పేరు, జనగామకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలనే డిమాండ్ కూడా వస్తూన్నది. ఎందుకంటే మాయావతి తన హయాంలో 18 జిల్లాలను ఏర్పాటు చేసి వాటికి గౌతమబుద్ధ నగర్, జ్యోతిబాఫూలే నగర్, సాహు మహరాజ్ నగర్, అంబేద్కర్ నగర్, మహామాయ (బుద్ధుని తల్లి), రమాబాయి అంబేద్కర్, సంత్ కబీర్, సంత్ రవిదాస్ మొదలైన వారి పేర్లు పెట్టారు. జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టడమంటే వారిని తలచుకోవడమే. సమసమాజ నిర్మాణానికి వారు చేసిన కృషిని గౌరవించడమే! ఈ స్ఫూర్తిని కొనసాగిం చేలా కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు తెలంగాణ త్యాగధనుల పేర్లు పెట్టుకొని శాశ్వతంగా వారిని స్మరించుకోవచ్చు. రుణాన్ని తీర్చుకోవచ్చు.