Home తాజా వార్తలు తెలంగాణభవన్‌లో గ్రీవెన్స్ సెల్

తెలంగాణభవన్‌లో గ్రీవెన్స్ సెల్

public grievance cell

 

పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపు
కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశం
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేపు బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కె.టి.రామారావు నియమితులైన తర్వాత శనివారం మొదటిసారి తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యుల ఆలోచనలు, సలహాలను కెటిఆర్ పరిగణనలోకి తీసుకుని కొన్ని సూచనలు చేశారు. 2006లో టిఆర్‌ఎస్ కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించి, భవిష్యత్తులో పార్టీని ప్రణాళికాబద్ధంగా బూత్, గ్రామ స్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. జనవరిలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు.

డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని, అర్హులందరి పేర్లనూ ఓటర్ల జాబితాలో చేర్చేలా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో గెలిచామో పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనిపేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు గ్రామాలకు ఉపయోగపడేలా కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వీలైనంతవరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడాలని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ద్వారా ఆ గ్రామానికి రూ.10 లక్షల నిధులు వస్తాయని, ఆ నిధులను గ్రామాభివృద్దికి ఉపయోగించుకోవచ్చని చెప్పారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో సభ్యత్వ నమో దు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్చి నుంచి పార్లమెంట్‌లో ఎన్నికల్లో గెలుపే లక్షంగా కార్యకర్తలందరూ పనిచేయాలని అన్నారు.

రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీ కమిటీలో వివిధ హోదాలలో ఉన్న ఐదుగురు ఎంఎల్‌ఎలుగా గెలుపొందిన నేపథ్యంలో తమ నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి పెట్టాల్సి ఉన్నందున కార్యవర్గం నుంచి తమను తప్పించాలని స్వఛ్చందంగా కోరారని అన్నారు. టిఆర్‌ఎస్ బిసి సెల్ అధ్యక్షుడిగా ఉన్న ముఠా గోపాల్, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు సుంఖె రవిశంకర్, ప్రధాన కార్యదర్శి మైనంపల్లి హన్మంతరావు, కార్యదర్శులు పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌లు స్వఛ్చందంగా పార్టీ కార్యవర్గం నుంచి తప్పుకున్నారని, త్వరలో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వాటితోపాటు కార్యవర్గంలోని మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలో జిల్లాలవారీగా కెటిఆర్ పర్యటనలు ఉంటాయన్నారు.

తెలంగాణ భవన్‌లో గ్రీవెన్స్ సెల్
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ భవన్‌లో త్వరలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత ఎంఎల్‌ఎకు లేదా సంబంధిత అధికారులకు బదిలీ చేసి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్‌లో ఉంటే ప్రతి రోజు 2-3 గంటలపాటు తెలంగాణ భవన్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

రేపు 11.56 కెటిఆర్ బాధ్యతల స్వీకరణ
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కెటిఆర్ సోమవారం ఉదయం 11.56 గంటలకు తెలంగాణ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Formation of public grievance cell soon in Telangana Bhavan

Telangana Latest News