Home Default కమలానికి హ్యాండ్

కమలానికి హ్యాండ్

Former AP deputy CM wife Padmini Reddy joins BJP

ఉదయం బిజెపిలో చేరి రాత్రికల్లా
మాట మార్చిన పద్మినీ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కాషాయకండువ కప్పుకున్న పద్మినీరెడ్డి రాత్రి తొమ్మిదింటికల్లా ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి గురువారం ఉదయం ఊహకందని తీరులో నగరంలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బిజెపిలో చేరారు. ప్రధాని మోడీ పరిపాలనా విధానం, మహిళల సాధికారతకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితురాలై బిజెపిలో చేరుతున్నట్లు పద్మినీరెడ్డి వ్యాఖ్యానించారు. తన భర్త కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా తాను బిజెపిలో చేరడంలో ఆశ్చర్యమేముందని ఎదురు ప్రశ్నించిన పద్మినీరెడ్డి రాత్రి తొమ్మిదింటికల్లా సంగారెడ్డిలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బిజెపిలో చేరుతున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని స్వంత గూటికి చేరుకున్నట్లు ఆమె సంగారెడ్డిలో పాత్రికేయులకు వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బిజెపిలో చేరిన వార్త కాంగ్రెస్ వర్గాల్లో మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకుపెద్ద సంచలనాన్నే రేకెత్తించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె బిజెపిలో చేరడం మొత్తం కాంగ్రెస్ పార్టీపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందన్న చర్చ కూడా పార్టీ సీనియర్ నేతల మధ్య చర్చ జరిగింది.

తాను బిజెపిలో చేరుతున్నట్లు తన భర్తకు సమాచారం ఇచ్చానని పద్మినీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్‌లో చర్చ జరిగింది. భార్య విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరించాల్సి వచ్చిందని రాజనర్సింహ గురించి పరోక్షంగానే గాంధీభవన్‌లో చర్చలు జరిగాయి. ఒక దశలో రాజనర్సింహ వ్యవహారాన్నే తప్పు పట్టేంత స్థాయిలో గాంధీభవన్‌లో క్రిందిస్థాయి శ్రేణుల్లో గుసగుసలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు తొమ్మిది గంటల వ్యవధిలో నాటకీయంగా పద్మినీరెడ్డి తన బిజెపి చేరిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని స్వంత గూటికి చేరుకున్నారు. ఉదయం తాను బిజెపిలో చేరిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జరిగిన చర్చలు తన దృష్టికి వచ్చాయని, వారు మదనపడుతుండడంతో తాను నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్‌లో చేరానని పద్మినీరెడ్డి మీడియాకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సైతం రాజనర్సింహతో ఈ విషయం గురించి సీరియస్‌గా స్పందించడంతో పద్మినీరెడ్డి కథ సుఖాంతమైంది.

Former AP deputy CM wife Padmini Reddy joins BJP