Home వార్తలు కాక చెప్పిన కత

కాక చెప్పిన కత

నేను హైదరాబాద్‌ల పుట్టిన. నైజాం నవాబు రాజ్యమేలుతున్న కాలం. గప్పుడు నా అసోంటి మాలోల్లకు సదువేడిది? ఏదో కొంచమంత సదువుకున్న. బతుకుటానికి ఏదో పని జేసెటోన్ని. గప్పుడు కన్నాగురం జిల్లా పెద్దపెల్లి దగ్గెరున్న రామగుండం ప్రాంతంల బొగ్గు గనులు పడ్డయి. గాడయితె పని దొరుకుతదని పోయిన. గక్కడ కార్మికునికి లెక్క పన్జేసేటోన్ని. తాపి మేస్త్రి పనిగూడ జేసిన. గప్పుడు కార్మికుల మీన మస్తు జబర్దస్తి జేసెటోల్లు.

Taatalu-Cheppina-Kathaluగిది గా సానపెద్దసారు కేంద్రంల, రాష్ట్రంల మంత్రి పదవులు సేసినసారు సెప్పిన కత. గయినెను గుడిసెల వెంకటసామి అంటరు సానమంది. గదయినెకు గౌరవమే కని తక్కువ కాదు. గయినె గుడిసెలోల్ల మనిషి. అంటె గుడిసెలు గూడ లేనోల్లకు గుడిసెలేపిచ్చిండు. నీడ లేనోల్లకు నీడనిచ్చిండు. పేదోల్లకు సాయం జేసిండు. హైదరాబాద్‌ల నిలువ నీడలేని పేదోల్ల దిక్కుండి గాల్ల కోసం పోరాటం జేసిండు. చెట్ల కింద ఉండె బక్కసక్కోల్లకు గుడిసెలేపిచ్చి ఆదుకున్నడు. గందుకే గాసారును గుడిసెల వెంకటసామి సారంటరు. గాసారుకు గసోంటిపేదోల్ల కష్టాలు మస్తుగ తెలుసు. ఎందుకంటె గయినె గసోంటి గరీబోల్ల కులంల పుట్టిండు. పేదరికం అనుభవించిండు. పేదోల్ల దిక్కున్నడు. ముందుగాల తాపీమేస్త్రీగ ఉన్నడు. లేబరోల్లకు నాయకత్వం జేసిండు. కార్మిక నాయకుడైండు. ఎంతోమందిని ఎదిరించిండు. గా గాంధీ మహత్ముడు జాతిపితయితె గీనెనందరు కాకా అందురు. నెహ్రూ అసోంటి పెద్దోన్ని చాచా నెహ్రూ అందురు గద. గట్ల లక్షల మందికి కోట్ల మందికి కాక అయి ఆదుకున్నడు ఎంకటసామి. పేదోల్ల పాలిటి పెన్నిధి అయిండు.
తాపిమేస్త్రీ నుంచి కేంద్రమంత్రి దాక ఎందిగిండు. ఇందిర గాంధికి దగ్గెరయిండు. రాజీవ్‌గాంధికి సోపతయిండు. పి.వి.నరసింహారావు ప్రధానమంత్రయితె గండ్ల కేంద్ర మంత్రయిడు. గా సారు గొప్పమనిషి. తను ఎదిగిండు. కుటుంబాన్నెదిగించిండు. రాష్ట్రం కోసురం పాటుపడ్డడు. దేశం కోసురం తండ్లాడిండు. గయినె రాష్ట్రపతి గూడ అయ్యేదుండె. కని కొన్ని కారణాలతో గక్కడిదాక పొయ్యాగిండు. ఓ తెలంగాన బిడ్డ, దళిత బిడ్డ పేదరికంల కెల్లి అచ్చినోడు గన్ని ఎత్తులకెదిగిండంటె ఎంత గొప్పపని. ఎన్ని కష్టాలు పడాలె. గట్ల గయినె జీవితాన్ని గెల్చుకున్నడు. అందరి గుండెలల్ల కాకగ ముద్రపొందిండు. గయినె కొడుకే పెద్దపెల్లి మాజీ ఎం.పీ. వివేకానంద.
మాజీ రాష్ట్రమంత్రి వినోద్. గయినె మొదలు వెట్టిందే 6 తెలంగాణ చానెల్. గది గిప్పుడు జబర్దస్త్ చానెల్. తెలుగు చానెల్లు అన్నిట్ల నెంబర్‌వన్ చానెల్. తెలంగాణ బాసకు పట్టంగట్టింది. మంచి మంచి కార్యక్రమాలు జనానికి అక్కెరకచ్చెటియి అన్నున్నయి. తెలంగాంటె 6 అనుకునేట్టత్తంది. గది కాక మానపుత్రిక . గయినెకు మొన్న లుంబిని పార్కుల పెద్ద విగ్రహం కట్టిచ్చిండ్రు. గా సారు తెలంగాణ బాస మస్తు మాట్లాడ్తడు. యాడాదికిందనే సచ్చిపెయిండయినె. గా సారు సెప్పిన ఆత్మకతసోంటి కత గిది. గయినె పెద్దపెల్లి ఎం.పి.గ మూడు మట్ల గెల్సిండు. కని గయినె జీవితం సికిందరబాదుల మొదలయినా రాజకీయ జీవితమంత పెద్దపెల్లిలనే. గక్కన్నుంచే మంత్రయిండు. లేబర్ లీడరయిండు. గయినె గోదావరిఖనికి, ఎఫ్‌సిఐకి ఊకూకె వచ్చెటోడు. మస్తు మాట్లాడెటోడు. నేంగూడ గక్కన్నే నౌకరిజేసిన గద. మా పార్లమెంటు నియోజకవర్గం గూడ పెద్దపల్లే. గయినె తన జీవితం గురించి అప్పుడప్పుడు కతోలె సెప్పిన సంగతులే గీ కత. కాక సెప్పిన కత గయినె జీవితాన్ని గెలుసుకున్న సంగతులు జెప్పుతది. గయినె జీవిత చరమాంకంల మైసఫర్ వయ్యి రాసిండు. గయినె సెప్పిన కతో ఆత్మ కతో ఇనుండ్రి మల్ల.
నేను హైదరాబాద్‌ల పుట్టిన. నైజాం నవాబు రాజ్యమేలుతున్న కాలం. గప్పుడు నా అసోంటి మాలోల్లకు సదువేడిది? ఏదో కొంచమంత సదువుకున్న. బతుకుటానికి ఏదో పని జేసెటోన్ని. గప్పుడు కన్నాగురం జిల్లా పెద్దపెల్లి దగ్గెరున్న రామగుండం ప్రాంతంల బొగ్గు గనులు పడ్డయి. గాడయితె పని దొరుకుతదని పోయిన. గక్కడ కార్మికునికి లెక్క పన్జేసేటోన్ని. తాపి మేస్త్రి పనిగూడ జేసిన. గప్పుడు కార్మికుల మీన మస్తు జబర్దస్తి జేసెటోల్లు. కార్మికులకు లీడర్‌గ పనిజెయ్యాలనుకున్నా. గాల్ల కష్టాలు తీర్చాలె ననుకున్న. ఐఎన్‌టీయూసిల చేరిన. ట్రేడ్ యూనియన్ నాయకున్నయిన. జీతాలు పెంచుటానికి, కార్మికుల హక్కుల కోసురం పనిజేయాలకున్న. ట్రేడ్ యూనియన్ నాయకున్ని గద! బలమైన నాయకున్నయిన. హైదరాబాద్ రోడ్లపొంటి, చెట్ల కింద దిక్కు సక్కిలేక నిలువనీడలేక ఉండే కూలినాలి జేసుకొని బతికెటోల్లని జూత్తె కండ్లపొంటి నీళ్ళచ్చేటియి. గాల్లంత దళితులు, గిరిజనులు, పేద బీసి కులాలకు చెందినోల్లే. గాల్ల కోసం పని జెయ్యాలె ననిపిచ్చింది. గాల్లకు నిలువ నీడలేకపాయె. గందుకే సర్కారు బూములల్ల గుడిసెలేపిచ్చిన. నిలువ నీడచ్చింది గద! అటెనుక సానమందికి గా బూములు సొంతమైనవి. గట్ల గుడిసె లెపిచ్చేపటికనే నాకు గుడిసెల ఎంకటసామని పేరచ్చింది. గాల్లెట్ల పిలుసుకున్నా నాకు సంబురమే. అవుమరి నేను గుడిసెలోల్ల ఎంకటసామినే. అటెనుకు 1968-69ల జరిగిన తెలంగాణ పోరాటంల మస్తు కొట్లాడిన. ఎన్నో కారణాలతోని గా పోరాటం ఎనుకకు పెయినా సానమందికి రాజకీయ భిక్ష పెట్టింది. నాకుగూడ గా లొల్లితోనే రాజకీయ భిక్ష దొరికింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపెల్లి నుంచి ఎంపినైన. గప్పుడు రామగుండంల ఎరువుల కంపనీ అచ్చుటానికి మస్తు కోశిశ్ జేసిన. పి.వి.నరసింహారావుతోని తిరిగిన. ఎంపినైనా, మంత్రినైనా ఏదైనా నాకు రాజకీయ భిక్షకు కారణమైన తెలంగాణను, ట్రేడ్ యూనియన్‌ను మరిసిపోలేదు. మాదండి సేవ జేసిన. సింగరేణి కాలరీలు మూతవడకుంట కేంద్రంల కోశిష్ జేసిన. ఎఫ్‌సీఐ కోసురం గూడ ఇట్లనే కష్టపడ్డ. కని గది మూతపడ్డది. కేంద్రమంత్రిగ ఉండి కార్మికులకు ఫించన్ లేకుంటే పించనచ్చెటట్టు జేసిన.
గదే కాంట్రిబ్యూటర్ పెన్షన్. నాకు ఇందిర గాంధితోని, రాజీవ్‌గాంధీతోని, పి.వి.నరసింహారావుతోని, సోనియా గాంధీతోని గూడ మంచి సంబంధాలుండె. మన్‌మోహన్‌తోని గూడ. నాకు రాష్ట్రపతి పదవి వస్తుదనుకున్నగని రాలేదు. ఏదేమైన నేను పేదసాదోల్ల కోసురం మస్తు కష్టపడ్డోన్ని. దళితులకు రాజ్యాధికారం వస్తే మంచిగుంటదనుకున్నోన్ని. గిది నాకత… అని సెప్పిండు. వివిధ సందర్భాలల్ల రెండోసారి జరిగిన తెలంగాణ పోరాటానికి గూడ మస్తు మద్ధతిచ్చిండు. కె.సి.ఆర్ అసోంటోల్లకే విలువైన సలహాలిచ్చిండు.
తెలంగాణ రావన్నని తండ్లాడిండు. ఎందుకంటే గసోంటి పెద్దపెద్ద లీడర్లు గూడ ఆంధ్రోల్ల పాలనతోని రావల్సినంత ఎలుగులకు రాకుంట పెయిండ్ను. తెలంగాణ వచ్చిందని మస్తు సంబురపడ్డడు కాక. తెలంగాణ రాకముందే తెలంగాణ కోసురం 6 చానెల్‌ను తెర్సిండు. తెలంగాణ యాసమీద, భాషమీద, సంస్కృతి మీద కాకకు మస్తు ప్రేమ. మూతపడ్డ ఎఫ్‌సిఐని తెరిపిచ్చుటానికి ఒగతిప్పలు వల్లేదు. గదిప్పుడు తెర్సుకుంది. ఏదేమైన కాక జీవితం ధన్యం. దళితవనంల పుట్టిన సువాసన గల పుష్పం మన కాక కారణజన్ముడు. శనార్తి.

Kaluva-Mallaiah-001డా ॥కాలువ మల్లయ్య
98493 77578